మొదటి సారి వారిని 2013 లో తానా లో కలిశాను. అప్పటికి మిథునం వచ్చి, US అంతా ఢంకా మ్రోగించింది. వారిని చూడగానే, నేను చెప్పిన మాట “అద్భుతః”, అనగానే నవ్వేశారు హాయిగా. అంత నిరాడంబర సెలిబ్రిటీ మరొకరు మనకు కనిపించటము అరుదు.
నిన్నటి సోమవారం భరణి గారు మా ఆహ్వానాన్ని మన్నించి మాతో గడపటానికి ఉదయమే వచ్చారు… రావటం రావటం మాకు “తిరుపతి ప్రసాదం“ అని నాచేతికి ఇచ్చారు.
ఆ చైత్ర శుద్ధ తదియ నాడు, సోమవారపు ఉదయం వాన వెలసి చల్లటి వాతావరణనా, శివ తత్వాలని ఆవిష్కరించిన భరణిగారు తిరుపతి వెంకన్న ప్రసాదం అందచేయటంతో ఉదయానికి చెప్పలేని పవిత్రత అద్దింది.
నిజంగా మా మేన మామనో, బాబాయో వస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది మా ఇద్దరికి. ఆయన ఉన్న ఆ రెండు గంటల సమయము … రెండు నిముషాలలా కరిగిపోయింది. కదులుతున్న తెలుగు పద్యం…పెదవి విప్పితే గద్యం.. ప్రతి మాటా ఒక ప్రాసతో సమాదానమివ్వటం.. అంతటి పద్యాల గంగా ప్రవాహానికి నేను పూర్తిగా తడిసి ముద్దయిపోయాను.
“ఏంటి మీ ఇద్దరే… మిథునమా ? అంటూ ప్రశ్నించి… హని (మా అమ్మాయి) గురించి వివరాలు అన్నీ అడిగి కన్నుకున్నారు.
దానికి వచ్చిన ప్రెసిడెంట్ మెడల్ చేత్తో పట్టుకొని ఎంత అపురూపంగా చూశారో..
వీణా? నీవేనా వాయిస్తావు?… అంటూ..
నా లైబ్రరీ లో ఎక్కువ సేపు గడిపేశారు…
అమరకోశం కంఠతా పట్టాలి… మీనింగ్ కోసం వెతుక్కోవటం కాదు… అంటూ , అమరకోశం లో కొన్ని శ్లోకాలు వివరించారు…వారిని నేను ఆన్లైన్ ఆంధ్రభారతి గురించి చెప్పి, నా బద్ధకాని చాటుకున్నాను. చాలా ఇంటరెస్ట్ గా వెంటనే ఆ ఆన్ లైను తెలుగు నిఘంటువును పరిశీలించారు.
నీలకంటేశ్వర శతకం, దూర్జటి కాళహస్తీశ్వరా శతకం… అలా ప్రవాహం లా చెబుతుంటే… నేనయితే నాకొచ్చినవి కూడా మర్చిపోయి… వింటూ ఉండిపోయాను…
అన్నేసి అలా ఉధ్రుతంలా ఎలా చెబుతున్నారో కదా… అని… కదులుతున్న కవిత్వమా అని అనిపిస్తుంది ప్రతి క్షణమూ .. .
ఫిల్టర్ కాఫీ ని ఆస్వాదిస్తూ దానితో పాటే నేను చదివిన కవితనూ ఆస్వాదించారు.. భరణి గారికి నేను సమర్పించిన కవిత –
“ఆభరణమే లేని భరణి ఈయన,
పలుకులరాణి మెడలోని ఆభరణమీయనే!
గుప్పెడు నక్షత్రాలు కోసి గుండెకద్దుకుంటాడీయన,
నక్షత్రాలలో చంద్రునిలా వెలుగుతాడీయనే !
పరికిణి అందాలందించిన అచ్చతెలుగీయన,
అపురూప ఆత్మీయ ఆంధ్రు డీయనే (తెలుగు అన్న అర్థములో వాడిన శబ్ధం)
సెహభాషని శివుని మెచ్చినదీయనే ,
అలవోకగా ఆత్మతత్త్వమందించిన దీయనే!
ఆటకదరా అని శివుని ఆటలను ఆవిష్కరించినదీయనే,
జీవితపు ఆటలో మేటి గెలుపీయనే !
ప్రపంచపు రంగస్థలిలో దేదీప్యమానంగా –
వెలిగేటి వాగ్దేవి వామనరూపమీయనే !
విశ్వనాథ శ్రీశ్రీ లను అంబులపొదలపెట్టి,
మాటల శరపరంపరతో ఉర్రుతలూగించిన విలుకాడియానే !
గర్వమన్నది ఎరుగని గాంభీర్యమీయనే,
జీవిత సారాన్ని కాచి అందించిన తత్త్వమీయానే!
అతిథిగా వేంచేసిన మా ఆత్మీయుడియానే,
ఆనందం పంచు ఆత్మభవుదీయనే!! ”
సరదాగా ఆ సరస్వతి పుత్రునితో గంటలు నిముషాలలా గడిచిపోయాయి. ఎన్నో సలహాలు, రచనలో పనికొచ్చేవి చెప్పారు. చదవవలసిన కొంత సమాచారం ఇచ్చారు. మా కాఫీ టేబుల్ మీద ఉంచిన మాగంటి వంశీ గారి “అనగనగా” బుక్స్ చూసి ముచ్చటపడి, కావాలని అన్నిట్లో నాకు నచ్చినది, (సైరంధ్రి)అడిగి తీసుకున్నారు చనువుగా. “దీనిమీద ఏమైనా రాసివ్వు ” అని అడిగి మరీ నా చేత అది నేను ఇచ్చిన గుర్తు రాయించుకున్నారు.
కొండల్ ఏవో పిక్స్ తీయ తంటాలు పడుతుంటే, నా ఫోను తీసుకొని తానే సెల్ఫీ తీసి నవ్వేశారు.
వారి సంభాషణ సర్వం తొణికిసలాడిన హాస్యం.
ఎంత సాహిత్యప్రియులో అంత హాస్య ప్రియత్వం.
నా దగ్గర వారి బుక్స్ ప్రింట్ కాపీ చూసి ముచ్చట పడి, ఒక సెట్ హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకోమని చెప్పారు. (నేను పూర్వం బుక్స్ దొరకక e-బుక్స్ తీసుకొని, ప్రింట్ చేసుకున్నాను.)
హైదరాబాద్ లో వారి ఇంటికి ఆహ్వానించారు. ఫోన్ నెంబర్ ఇచ్చి హైదరాబాద్ రాగానే రమ్మని మరి మరి చెప్పారు. మా తోడికోడలు అన్నయ్య తెలుసనీ వారే స్వయంగా ఫోన్ చెయ్యమని, అనంత్ గారితో మేము మాట్లాడాక తాను ఆయనను పలకరించారు. ఎంత సింప్లిసిటీ నో ఆయనకీ.
పెసరట్టు మితంగా , గారే కొద్దిగా రుచి చూసి, కొబ్బరి పచ్చడిని ఇష్టపడి, కాఫీని ప్రేమించి, మమ్ముల్ని అలరించి… హృదయంలో మరింతగా ఆత్మీయత నింపి, మమ్ముల్ని కాసేపు సాహిత్య అమరలోకాలకు పట్టుకుపోయారు.
ఏదో మాటల సందర్భంలో మావారు “మీకెంత ఓపిక అంటే”, నా లైఫ్ లో కోపగించుకునే టైంలేదండి బాబు! అసలే చిన్నది జీవితం!! అని సరదాగా నవ్వేశారు. మాకు వారి
మిని బుక్స్ కానుకిచ్చారు బయలుచేరెముందు.
ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది అహం అన్నది లేకపోవటం, ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం…



