ఉగాది ముందుగా అందరికి గుర్తుకువచ్చేది వుగాది పచ్చడేగా.. ఆ చిరుచేదు, పులుపు, తీపి మిశ్రమము. ఆ పచ్చడి, చిన్నప్పుడు తినాలంటే పగలే చుక్కలు కనిపించేవి. అందునా మా ఇంటి వెనకాల ఒక వేప చెట్టు వుండేది. ఆ ఉదయమే తాజాగా వేప పూత కోసుకొచ్చి పచ్చడి రెడీ చెసేది అమ్మ.
తలంటి పోసి కొత్తబట్టలు తొడిగి అందరికి వరసగా చేతులలో ఆ పచ్చడి పెట్టి మిలిటరీ డిసిప్లెనుతో మా నాన్నగారు తన ముందే మింగమంటే, ఒక సారి మంచినీళ్ల సాయంతో, మరో సారి … నోట్లో పోసుకొని, బయటకు జారుకుని, ఎవ్వరు చూడకుండా వదిలించుకొని… నానా వేషాలు వేసేవాళ్ళం.
పెళ్ళైన కొత్తలో చింతపండు పులుసులో ముక్కలు కలుపుతుంటే అదేదో జోకులా అత్తారింట్లో అంతా ఒకటే నవ్వులు… పులుసు పెడుతున్నావా అని. తెల్లపోవటం నా వంతైంది.. వాళ్ళు జస్ట్ కొబ్బరి, అరటిపండు అక్కడక్కడా వేపపూత వేసి కమ్మగా తింటారు. పచ్చళ్ళను ఇలా ఎడ్జస్టు చేసుకోవొచ్చని నాకప్పటివరకు వెలగలేదు. అలాగైతే చిన్నప్పటి నుంచి ఇంత కష్టం వుండకపోను.
పచ్చడైతే ఎడ్జస్టు చేస్తారు కానీ, లైఫ్ లో అలా చేదు కలిగించే సంఘటనలు మిస్ కొట్టి కానియొచ్చా? అలాంటి ఎడ్జెస్టుమెంటు ఉంటే ప్రపంచంలో ఇంత అశాంతి ఉండదుగా!!
ఉగాది రోజున మా చిన్నప్పుడు రేడియోలో కవిసమ్మేళనము వచ్చేది. నాన్నాగారు వింటుంటే అప్రయత్నంగా మేమూ వినేవాళ్ళం. అలాంటి కవిసమ్మేళనం లోనే నేను మొదటిసారి ప్రసాదరాయ కులపతి గారి కవితలు వినటం జరిగింది. ఆనాడు తెలియదుగా.. వారే నాకు మంత్రోపదేశము చేసిన గురువులవుతారని.
చిన్నప్పుడు కవిసమ్మేళము వింటూ పెరగటము వలనేమో, ఉగాదంటే కవిత్వం కూడా వుండాలనే ఒక నమ్మకము పడిపోయింది.
పంచాగములో లాభనష్టాలు చూసుకోవటము అదో హడావిడిగా. ఎంత నమ్ముతారో కాని నేను మాత్రం చాలా నమ్మేసే దాన్ని. అవమానము చూసి ఎంత అక్కతో కొట్టేసుకుంటానో అని లెక్క పెట్టుకోవటం ఒక తమాషా జ్ఞాపకము.
సాయంత్రాలకు బయట పడి పక్కింటి రమతో కాని, ఎదురింట్లో అక్కతో కాని ఆటలు. అసలు మేము ఎన్ని ఆటలాడేవారమో. అమ్మ ఇంట్లో నే ఆడుకోమంటే పడేది కాదు. అక్కకు నాకు మధ్య పచ్చగడ్డి భగ్గు భగ్గు. కొట్టుకుచావటమే కాని ఆడుకునే సౌలభ్యము వుండేది కాదు. అందుకే వీధిన పడేవాళ్ళము ఆటలని.
మేము ఇండియా వదిలేసి వచ్చాకా మొదలైయినాయి చాలా ఇబ్బందులతో పాటూ నా ఉగాది పచ్చడి ఇబ్బందులు మొదలైయ్యంది.
అసలు ఉగాది కనుక వారాంతరము రాకపోతే అది మాములు రోజులలో కలిసి పులుసైపోయేది. ఎంత ఘనమైన పండుగైనా వారాంతరమే.
ముందుగా మేమున్న చోట అసలు ఇప్పటిలా అన్నీ దొరికేవి కావు.
కొబ్బరికాయ కూడా సీజనల్ గా దొరికేది.
వేపపూత గగన కుసుమము. ఎండపెట్టి అమ్మే అప్పటికి పంపేది. కానీ అది కేవలం, నల్ల నువ్వుల్లా చుక్కలు మెరుస్తున్నట్లు వుండేవి. దానికి రంగు, రుచి, వాసన కంబైండుగా మిస్. తీయని అత్తగారి ఉగాది పచ్చిడి కి సెటిల్ అయిపోవాల్సి వచ్చది .
ఒక్కసారి మిత్రులుతో చేదు కావాలంటే అంత కష్టమేమిటోయ్ కొద్దిగా విస్కీ కలపొచ్చుగా అని సలహా కూడా పడేశారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా మొదట్లో అమెరికాలో చేదు పచ్చడి తిన్న జ్ఞాపకమైతే లేదు. కేవలం చింతపండు నీళ్లలో కొబ్బరి ముక్కలు, మామిడి, చెరుకు కలపటం అదే పచ్చడిని మొదటినుంచి తలా కప్పు పం చేసేవాళ్ళము. నేను తెలుగు సంఘం లో వాలంటీరు చేసిన ఆరేళ్ళు ఇలాగే పంచాము. ఇక్కడ అసలు అలాంటివాటికి (రంగు రుచి లోపించిన) అలవాటు పడిపోయామేము. ఎందుకు చేస్తున్నానో తెలియక చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఏమైనా అంటే,మన తరవాత తరానికి తెలియాలిగా అని సమర్ధన మాకుండన్నే ఉంది.
ఈమధ్య, అంటే గత నాలుగైదేళ్లగా ఫ్రెష్ వేపపూత ఇంపోర్ట్ చేస్తున్నారు. పర్లేదు అనిపిస్తోంది.
ఉగాది పచ్చడికే ఇంత కష్టపడాలంటే మరి పుట్టి పెరిగిన వాతావరణం కాకపోయినా, మన పండుగలు పబ్బాలు, మాటా – పాటా చీర, బొట్టు కట్టు, పూజ , నోములు, తాంబూలాలు, ఒకటేమిటి సమస్తం, ఇంపోర్ట్ చెయ్యక పోయినా కుదురినంతగా పట్టుకొచ్చి, మా పిల్ల పాపాలకు అంటించి, ఆనందించే NRI జాతిగా మారిపోయాము. ఈ 17 ఏళ్ల ప్రహసనం లో ఒకటా,రెండా? రెండు కల్చర్స్ మధ్య హస్తిశతాంక మంత తేడా ఉన్నా, కొంత సర్దుబాటు, కొంత వెసలుబాటు, చేసుకుంటూ సాగుతన్న జీవన స్రవంతి కదా….
ఈ ఉగాదికి అవి అన్నీ గుర్తు చేసుకోవటం కుదిరింది ఇలా.
విలంబకు స్వాగతము పలుకుతూ…..
మీ
సంధ్యా యల్లాప్రగడ