గారెలకు తెలుగువారికి సంబంధం అనాదిగా ఉన్నది.
అసలు మాములుగా పిండివంటలు అంటే గారెలు బూరెలు అని కదా అంటారు.
గారెలు ఇష్టపడని వారు ఉండరు. గుండమ్మ కథ లో జమున గారెలు వండుకోవాలనేగా వెళ్లి అసలు రహస్యం కనిపెట్టేసింది.
గారెలతో పెరుగు గారెలు మరీ రుచి. ఆవడ, దహి వడ,, పెరుగుగారే పేరు ఏమైనా రుచి అదే, వస్తువు అదే…
అసలు పెరుగు గారెలు చేయటం ఒక కళ. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ గీసినట్లు, ఒక డాన్సర్ ధ్యానంగా డాన్స్ చేసినట్లు శ్రద్ధగా చెయ్యాలి.
ముందు పెరుగు పలచన చేసుకొని, మంచి నాణ్యమైన అల్లం పచ్చిమిర్చి కలిపి నూరి, బాగా ఇంగువతో దట్టించిన తిరగమాత లో ఈ నూరిన అల్లం పచ్చిమిరప వేసి,
కలియబెట్టి ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి పక్కన పెట్టుకోవాలిగా.
తర్వాత తీరుబడిగా గారెలు వేయటం తీసినవి తీసినట్లుగా ఈ పెరుగులో వేసేయటం.
ఒక గంటా గంటున్నార తర్వాత గుటుక్కుమనిపించటం.
సులువుగా చేసుకొనే ఈ పెరుగు గారెలు ఎంత ముష్టాన సుఖం. కొందరు ముందు నీటిలో వేసి తర్వాత పెరుగులో వేసుకుంటారు.
పర్లేదు బనే ఉంటాయి ఆలా చేసినా. కొన్ని సార్లు గారెలు బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీటిలో ముంచి మైక్రోవేవ్ చేసినా మెత్తబడి పంటికింద నలిగి ఆలా ఆలా ఆనందాన్ని ఇస్తాయి.
బాగా నానిన పెరుగు గారే ముట్టుకుంటే చాలు తేనెలూరుతున్నట్లుగా రుచికి రుచి, చూడటానికి అందంగా ఆలా ఆహ్వానిస్తూ ఉంటాయిగా.
కానీ ఒక అనుభవం మాత్రమే కొంచం తేడాగా జ్ఞాపక పెట్టిలో అదే మెమొరీబాక్స్ లో గుర్తుంది పోయింది.
పెరుగు గారెలు గురించి గుర్తుకు వచ్చినా, నేను చేసినప్పపుడు కూడా గుర్తుకు వచ్చి నవ్వుతో పాటు వెర్రి అయోమయం పడ వేస్తుంది.
అలా అలా గతంలోకి వెళ్ళితే (సినిమా లో రింగులు రింగులు తిరుగుతాయి చుడండి అలా అన్నమాట) అప్పుడు మేము లండన్ లోఉన్న రోజులలో, తమ్ముడి మిత్రుడు ఒకడు పెళ్లి చేసుకొని మాకు దగ్గరలో కాపురం పెట్టాడు. వాళ్ళ ఇంటికి మమ్ముల్ని ఒకసారి ఆహ్వానించాడు. సరే నేను మా చిన్నపిల్ల , తమ్ముడు కలసి వెళ్లాలని నిశ్చయించుకున్నాము. శ్రీవారు క్యాంపు మీద వెళ్లారు.
ఆ అమ్మాయి మేము వస్తున్నామని చాలా హడావిడి పడిపోయి నానా పదార్థాలు చేసింది. వాటిలో ఆవడలు ఒకటి.
పెరుగులో వేసిన ఆ ఆవడలు బండ రాళ్లకు కొంచం తక్కువగాపేపర్ వెయిట్ కి ఎక్కువగా ఉన్నాయి.
సరిగ్గా ఉడికి ఉడకక లోపల పచ్చిగ్గా పిండిపిండిగా పైన గట్టిగ ఒక పెరుగు లేయర్ తో ఉన్నాయి.
తిందామంటే కాస్త కష్టంగానే ఉన్నాయవి.
లోపల పిండి వదిలేసి పైన ఉన్నది తిని ఊరుకున్నాను మా తమ్ముడు చుసిన చూపుకి అప్పటికి.
మరి వెళ్ళింది వాడి స్నేహితుని ఇంటికిగా.
ఆ గట్టి పెరుగు రాళ్ళని, సారీ గారే అనే రాళ్ళని పిల్ల దానికి తినిపించాలని ఆ అమ్మాయి కుతూహలపడింది . వద్దులే దానికి పళ్ళు కదులుతున్నాయని మెత్తని పదార్థం తప్పతినలేదని వారించాను ,మొత్తుకున్నాను. చిన్న పిల్లకి ఇవి ఇష్టం లేవని బొంకాను. కళ్ళతో ను కదిపి కాళ్లతోను తొక్కి సైగలు చేసినా ఫలితం లేదు. చంటిది అప్పటికి ఆంటి ఆంటీ అంటూ ఆ అమ్మాయి చంకలో ఎక్కి కూర్చుంది. వినలేదు, రమ్మంటే రాలేదు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సైగలు చేసినా మలైకా డాన్స్ ముందు భరతనాట్యం లా ఎంత మాత్రం తమ్ముడి కానీ మా చంటిదాని దృష్టికి రాలేదు. నా యాక్షన్ పలించలేదు. నేను ఏమి చేయలేక తలపట్టుకు కూర్చున్నాను.
మానవ ప్రయత్నంఫలించకపోతే చేయగలిగినది ఏమి లేదు. జరిగేది జరుగక మానదు. చంటిది ఆ ఆవడ నోట్లో పెట్టుకోవటం, కొరికే ప్రయత్నం చేయటం, కదులుతున్న ముందు పన్ను ఊడి చేతికి రావటం అంతా అలా అలా slow motion లో మూవీ లాగా జరిగి పోయాయి. అది కేర్ మనటం, నేను దూకి దాని చేతులోకి అందుకొని, బాత్రూం లోకి తీసుకో పోయి కడిగి, రక్తం ఆగాక బయటకి వస్తే పాపం ఆ అమ్మాయి తెల్లబోయి చూస్తూ ఉండింది.
మేము ఎదో సర్ది చెప్పిము. వారం నుంచి కదులుతోంది, ఇప్పటికి బెడద వదిలిందని అల్ హ్యాపీ అని చెప్పి బయట పడ్డాను. వాడితో ఏంటిరా ఆ రాళ్ళూ అంటే, నా మీద అరుస్తాడు ఏంటో మరి.
అప్పట్నుంచి ఆవడ నేను తినాలంటే ఎవ్వరు ఏమనుకున్నా స్పూన్ తో కట్ చేసి ట్రై చేసి తినేదాని.
మా చంటిదానికి పళ్ళు కదులుతూ ఉడక విసిగిస్తుంటే, నేను ఎంత ప్రయత్నం చేసినా రాళ్ల గారే చేయలేక పోయాను. అందుకే పిజ్జా ని వాడే దాని. పిజ్జా నమలాలని ప్రయత్నించి పళ్ళు రాలగొట్టుకునేది.
అదండీ ఆవడలు.. ఊడిన పళ్ళు.
ఈ ఆవడలు సాఫ్ట్ గా బానే వచ్చాయి. శ్రీవారు ఒక పట్టులు అన్నింటిని కతం చేసి అన్ని తినేశారని నాకు మిగలేదని ఫీల్ అయ్యారు. నాకు మాత్రం ఆ సంఘటన గుర్తుకు వచ్చి మళ్ళీ పొలమారింది.
Happy weekend…

