ఎంత అద్భుతమైన మధ్యహనపు వేళ ఈ వేళ. ఇది గంధర్వ లోకమా లేక అట్లాంటానగరమా అని ఆశ్చర్య పడాలో ఏమిటో తెలియలేదు. చాలా రోజుల తర్వాత ఇంత అద్భుతమైన, ఆహ్లదకరమైన, ఆనంద కరమైన, మనసును, ఆత్మను సమ్మోహన పరచి తృప్తి కలిగిన వేళ ఈ మధ్యాహ్నం.
బయట భానుడు ప్రతాపము మమ్ముల్ని ఎంత మాత్రమూ ఇబ్బంది పెట్టలేదు అంటే మరి అంతేగా జేసుదాసుగారి సుమధుర స్వరఝరిలో తడిసి ఓలలాడి, పవిత్ర ఆ ప్రవాహంలో మునకలేసి మురిసిన హృదయాలకి ఈ ప్రాపంచిక విషయాలు ఎంతమాత్రమూ ఇబ్బంది పెట్టవు.
ఆ సరస్వతీ వరపుత్రులని చూసి వారి గానామృతం ఔన్సుల కొద్దీ త్రాగి ఆ మత్తు పంచాలని ఇదో ప్రయత్నం మాత్రమే.
ఈ రోజు జేసుదాసుగారు వచ్చీ రావటంతోనే వర్ణమాలిక తో మొదలు పెట్టారు మెుదటి వర్ణముని. తరువాత “వాతాపిని” హృద్యంగా ఆవిష్కరించారు. అసలు హంసద్వనిలో దాదాపు 40 నిముషాలు స్వేచ్చావిహారము చేశారు.
కల్యాణిలో మాకు మృదంగపు సొంపు, ఘటం ప్రావిణ్యాలని పరిచయము చేశారు.
“అన్నపూర్ణ విశాలాక్షి ” అని అమ్మవారిపై పాడిన ఆ కీర్తన మాకు నవరాత్రుల ముందు పరిచయం చెయ్యటము అమ్మవారి కృప..
“స్వామి గీతానీ పాడుతామని” అయ్యప్ప స్వామిని ఎంతో ఆర్ద్రం తలచారు.
అభేరిలో రామస్వామిని “నగుమోము” చూపమని వేడుకున్నారు.
“అదైపొంగెరా కన్నా” అని కన్నయ్యని తమిళములోపిలిచారు.
“అల్లా మాలిక్ ” అని సాయి గురుదేవుల మీద భజన్ తో మా మనసులో సాయి కి నీరాజనాలిచ్చారు.
“కొండలలో నెలకొన్న “కోనేరురాయుడినితో అన్నమయ్య ని గుర్తుచేశారు.
“జబ్ దీప్ జలే ఆనా”అని హిందీలో భజన్ పలికారు. మధ్య మధ్య చిన్న జోకులతో అలరించారు.
జనక జన్య రాగాల ఇంపార్టెన్స్ ని సంగీత విద్యార్థులకి వివరించారు.
“హరిహరాసనం” అని అర్ధంగా ఆయ్యప్పని తలిస్తే నాకైతే ఆ గానంలో కరిగి ఆ హంసవాహిని పాదాలు కడిగిన అపరగాంధర్వుని పాదాలు తాకి ప్రళమిల్లినా ఇంకా చెప్పలేనంతాగా మనసంతా భక్తిగా నిండిపోయింది.
వారి గానం ఎంత కాలమైనా చెదరక మనలను మరో లోకాలకి తీసుకుపోతుంది.
ఇంటికి వచ్చినా ఇంకా నాకు ఆ సంగీతము వినిపిస్తునే వుంది.
నాకు వారి సంగీత సభకు వెళ్ళటము రెండవ మారైనా తనివి తీరలేదు.
ఇంకా దాహమారలేదు.
వారు “పవమాన సుతును పట్టిన పాదాలకు” నీరాజనాలిచ్చినా మా మనస్సులో మాత్రము వారి గానము అలా చిరుగంటల సవ్వడి చేస్తూనేవున్నది.