గుమ్మడి పులుసు గుమగుమలు- వివాహంలో విరహాలు
మిత్రులకి శుభాకాంక్షలతో
మిత్రులు సోదర సమాన శ్రీ వెంకట రత్నం గారు వివాహాలలో గుమ్మడి పులుసు విషయం ప్రస్తావించాక అది చేసి కానీ మాట్లాడకూడని ఊరుకున్నాను.
ఆ ముచ్చట ఇప్పటి కి కుదిరింది. అదే గుమ్మడి పులుసు చెయ్యటం.
నిన్న గుమ్మడి తెచ్చి పులుసు గుమ గుమ లాడించి, మీ ముందుకు తెస్తున్నాను.
మరి వివాహ విషయం ముచ్చటించకుండా ఎలాగు మీకు రెసిపీ చెప్పగలను చెప్పండి.
పూర్వం పెళ్ళిళ్లు ఐదు రోజులు చేసేవారట.
ఇప్పుడు ముందు వెనక, వెనకవి ముందుకు జరిపి తూతూమంత్రంలా హడావిడిగా సాగె పెళ్లిళ్లు తో కాలక్షేపం చేస్తున్నాము.
కానీ సంప్రదాయ్యాని తూచా తప్పక పాటించే అగ్నిహోత్రావధాని మా నాన్నగారు. 5 రోజులు కాకపోయినా అంత మొత్తం చేసి, దాదాపు అన్ని చూసుకుంటే 5 రోజులైయ్యేలా పెళ్లి ముచ్చట అంతా జరిపించారు.
పెళ్ళికి ముందే నాకు శ్రీవారు పరిచయం ఉన్నా పెళ్లి టైం కి మాత్రం ఏంటో చాల టెన్షన్ మాత్రం వచ్చేసింది.
అసలు భారతీయ వివాహం ఒక గ్యాంబ్లింగ్. ఒక పాచికలాట. శ్రీవారితో ఎంతో పరిచయం ఉన్నా వాళ్ళ అమ్మవాళ్ళతో అంత పరిచయం లేదు.
ఆ ఆడపడుచులు, వాళ్ళ నాన్నగారు ఇలా కొత్త వాతావరణం ఆ భయం కి కారణం కావొచ్చు.
పెళ్లి కి ముందు ఒక రోజు వారు కదలివచ్చారు రాజమండ్రి నుంచి.
అక్కయ్య కొడుకు 7 ఏళ్ళ చిన్నవాడు. శ్రీవారు వాడితో రాయబారం పంపే ప్రయత్నం తెగ చేసి నాన్న గారి దృష్టికి వచ్చారు. నాన్న హైదరాబాద్ లో తిరిగినా ఏమి అనలేదు కానీ, పెళ్ళికి తరలివచ్చిన వాళ్లతో తానూ వచ్చి నన్ను చూడటానికి వీలు లేదని కండిషన్ పెట్టేశారు.
తనేమో నన్ను ఎలాగైనా మిత్రులతో కలసి వఛ్చి పలకరించాలని, వాళ్ళ అక్కలతో కలిపించాలని విపరీతంగా ట్రై చేశాడు.
రోజంతా వడుగు, గొడుగు, ఎదురుకొల్లు, వరపూజ అని అట్టే పెట్టేశారు కళ్యాణ మండపంలో.
ఆ రోజు బహుశా చిన్న పిల్లోడు ఒక 20 సార్లు రాయబారం తెచ్చి ఉండి ఉంటాడు.
నేను ఇంట్లో ఉండిపోయాను నాన్న సంగతి తెలుసు కాబట్టి గమ్మున. అయినా ఏంటి ఆప్షన్ ఉంది. తాను ఆగకుండా తాతయ్య తో చెప్పి రెకమెండేషన్ చేయించే ప్రయత్నం చేసారు కానీ సఫలం అవలేదు.
సాయంకాలమైంది. వివాహ ముహూర్తం అర్ధరాత్రి 2 గంటలకి.
సాయంత్రం 7కల్లా అనుకుంటా నన్ను రెడీ అవమని చెప్పి, అయ్యాక మండపానికి తీసుకువెళ్లారు.
అసలు వంటలు ఏమి వండారో నాకు తెలియదు. పెళ్లి రాత్రి అయితే సాయంత్రం రిసెప్షన్ లాంటివి ప్రశ్న లేదు. అసలు ఆ రోజు ఆఖరికి అమ్మ కూడా చెప్పింది తాను నా కోసం చాలా సార్లు అడుగుతున్నాడని. సంధ్య ఏది అని అడగటం, అంతా కలసి తనని ఆడేశారు అని తమ్ముడు చెప్పాడు.
సరే మరి సాయంత్రం 7.30 ఆ టైం లో వెళ్ళాను. ఇంకా వాళ్ళ వాళ్లు ఒక్కోలే రావటం, నా తలా ఎత్తి మొకంలో మొకం పెట్టి చూసి బుగ్గలు నొక్కి వెళ్ళటం. ఆడో ఆటలా.
ఇంకా ఎవ్వరి రాయబారం కుదరటం లేదు. అసలు తన గోడు వింటంలేదులా ఉంది చూడబోతే. దొంగలించిన జామకాయ, పెళ్ళికి ముందు పలకరించడం చాలా బాగుంటాయి కాబోలు అసలు.
వద్దన్నది చేయాలనీ కూడా ఉబలాటం ఉంటుంది.
చిన్నోడు వచ్చి పిన్ని పెళ్ళికొడుకు బాబాయి నిన్ను రమ్మని చెప్పారు అంటం అలాస్యం, అందరూ పక్కు మంటమూ, నా తల నేలలోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండగా భోజనాలు వడ్డించేస్తున్నారని కబురు కూడా వచ్చింది. తినండి అన్నాను. కాదు నీవు రా అని కబురు.
వాళ్ళ పెద్దక్క సీను లోకి ఎంట్రన్సు ఇచ్చింది. ఎవ్వరు ఏమి చే ప్పినా వినకుండా నా చేయి పట్టుకొని లాక్కువెళ్ళినంత చేసి శ్రీవారి పక్కన బోజనాలలో కుర్చోపెట్టారు.
పాపం నాన్న గారి లాబలాబలు ఎవ్వరు పట్టించుకోలేదు.
అలా పెళ్ళికి ముందు 4 గంటల ముందు అనుకుంటా మొదటిసారి వాళ్ళ వాళ్లు (అప్ప్పటికీ , తర్వాత అంతా జగనాధమే అనుకోండి) మధ్య కూర్చొని తిన్నది ఏమిగుర్తుంటుంది. పులుసులో గుమ్మడి ఉందా అనా, లేక టెన్షన్, నాన్న గారు ఆచారం కోసం ఏమి మొత్తుకుంటారో అని, అత్తగారు పెళ్ళికి ముందే కొడుకును కొంగుకు కట్టేశానని ఎక్కడ నొక్కుతారో అని ఆందోళనాతప్ప.
పెళ్ళి అర్ధరాత్రి అని ముందే చెప్పాగా, తిన్న తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి గౌరీ పూజతో మొదలై రాత్రి 12 నించి మరోజు 12 వరకు ఏంటో చేయిస్తునే ఉన్నారు.
మధ్యాహ్నం భోజనాలకి తర్వాత అప్పగింతలని మూడ్ అంతా మారిపోయే సీను.
అంత అగ్నిహోత్రావధానులు నన్ను పంపించాలని చిన్న పిల్లాడిలా విలవిలా లాడుతుంటే అబ్బా ఇప్పటికి నాన్నగారి ని తలుచుకుంటే ఏంటోలా అనిపిస్తుంది.అయినా అదే గా పితృప్రేమ.
నా పెళ్లి అయిన నెలలో బాబాయి కూతురు పెళ్లి లో ముందే రిసెప్షన్ పెట్టారని నాన్నతో అంటే “మరి అంత ఆచారానికి ఎవరికైనా ఎలా కుదిరింది, ఆ రోజు శ్రీవారిని ఎందుకంత ఏడిపించారు” అంటే నాన్నగారు “మనది ఈ మార్గం, వారిది ఆ మార్గం అంతే” అని అడగటం గుర్తుకు వస్తుంది.
ఇంత ఎమోషనల్ పెళ్ళిలో పులుసులు ఇంకోటి ఏ ఆడపిల్లా చెప్పలేరు.
కాబట్టి పెళ్ళి పులుసు వదిలేసి ఇప్పటి గుమ్మడి పులుసు ఎలా చేశానో శ్రీవారు లొట్టలేస్తూ ఎలా తిన్నారో మాత్రం చెప్పగలను.
ఒక చిన్న మంచి గుమ్మడి ముక్క (మాకు విడి ముక్కలు దొరుకుతాయి ఇక్కడ)
ఒక చిన్న సొరకాయ
1 చిలగడదుంప
1 క్యారెట్టు
1 టమాటో
1 మునకాడ
4 పచ్చిమిర్చి
కరేపాకు రెమ్మ
కొత్తిమీర
తిరగమాత
కందిపప్పు ఒక 1/2 కప్
సాంబారు పోడి ఉంటె ఓకే లేకపోతె కొంచం ధనియాలు, శనగ పప్పు మినపపప్పు, ఎండుమిర్చి డ్రై గా వేయించి ధనియాలు కలిపి పొడి చేసుకోవటమే
పప్పు విడిగా వేయించి వండుకోవాలి
ముక్కలు విడిగా ఉడకేసుకోవాలి
ఒక గిన్నెలో చింతపండు రసానికి ఉడికిన ముక్కలు, పప్పు కలిపి, పసుపు, ఉప్పు కారం మీ అభిరుచిని పట్టి కలపటం చెయ్యాలి.
అంతా కలసి ఉండుకుతుంటే, ఆ మిశ్రమానికి సాంబార్ పొడి కూడా కలిపి మంచి ఇంగువతో తాలింపు వేసి వెంటనే దించుకోవాలి,
తిరగమాట ఉడకకూడదు. అంటే దించేముందు కలపాలి. చిలగడ దుంప వాడితే బెల్లం వాడవద్దు. తీపి ఎక్కువైపోతోంది.
దుంప కలపకపోతే మాత్రం బెల్లం కలపండి.
గుమ్మడి పులుసు గుమగుమతో ఇల్లంతా నిండు. తిన్నవారి కడుపు చల్లగుండు.
Happy cooking


