వంకాయోపాక్యానము.మెంతికారము
మిత్రులకి అభినందనలు
“వంకాయ వంటి కూర,
శంకరుని వంటి దైవం
పంకజముఖి సీత వంటి
భార్య కలరే లోకమున్”
ఎంత వంకాయ ‘ఆహా ఏమి రుచి’ అని చప్పరిస్తూ తిన్నా అదేమాదిరిగా తింటే ఎవ్వరికైనా వెగటువేయ్యక తప్పదు కదా. మెంతికారం పెట్టి వంకాయ చేసినా ఈ రెసిపీ తో పాటు మీకు వంకాయ అంటే నాలుక కోసికునే( తప్పుగ వాడినా అర్థం మాత్రం అదే) శ్రీవారికి వంకాయనా బాబోయ్ అన్న సందర్భం ఒకటి పంచుకుంటా.
మా పెళ్లి జరిగి నేను రాజమండ్రి రాగానే అంతవరకు ప్రశ్నలడగ అవకాశం దొరకని అత్తగారు, దొరిక పుచ్చుకొని ఇంటర్వ్యూ చేశారు. వంట వచ్చా, ఎలా వండుతావ్, అంటూనూ. మరి అంత వరకు మడి దడి అని వంటింట్లోకి రానివ్వని సంప్రదాయం అమ్మవాళ్లది. ఇక్కడ అలాంటివి లేవు. పైగా నేను ఇక్కడ కోడులుని. సో వంట రాదంటే ఆవిడ ఏమి నేర్చుకున్న, లేకున్నా వంకాయ మాత్రం తప్పక రావాలి, వాడికి వంకాయ అంటే ప్రాణం అని సలహా ఇచ్చారు. పెళ్ళై వచ్చామని వారి బంధువులు అంతా ఒకళ్ళ తరువాత ఒక్కళ్లుగా పిలవటం భోజనాలకి, వంకాయ కూర, మామిడి పప్పు (మామిడి పప్పు కూడా తనకి ఇష్టమట మరి) వడ్డించటం. రోజు పొద్దున, ఈ రోజు ఒక పిన్ని వాళ్ళ ఇంటికి అంటం, వాళ్ళు వచ్చి తీసుకుపోవటం, వంకాయ కూర, మామిడి పప్పు వడ్డించటం, కబుర్లు, నాకు సలహాలు, బాబుకి వంకాయ కూర ఇష్టం అని ముక్తాయింపు. ఒక రోజు మామయ్య ఇంటికి, మరు రోజు పెద్దమ్మ, ఇంకో రోజు తమ్ముడు, ఒక రోజు అక్క ఇలా దాదాపు ఒక వారం రోజులు పాటు వరసగా మనుస్యులు మారుతున్నారు. వరసలు మారుతున్నాయి. మెనూ మాత్రం మారదు. నేను పెద్ద ఫ్యూడీ కాదు. నాకు ఇష్టం అయిష్టం అంటూ లేదు కానీ ఇలా పగలు రాత్రి ఈ వంకాయ కూర, మామిడికాయ పప్పు తిని వెగటు వచ్చేసింది. మేము ఆ రోజు బయలు చేరి అమ్మ వాళ్ల ఇంటికి వస్తున్నామంటే అత్తగారు అదే మెనూ. ఇంక తను లబో దిబో మని గొల్లున గోల పెట్టి, వెక్కి, ఏమి వేషాలు వేసినా అత్తగారు మాత్రం ” నా చేతి వంట రుచి చూడు” అని ఆవిడ వంకాయ కూర, మామిడికాయ పప్పు వడ్డించారు. ఇతను ఇంక చెయ్యగలిగేది ఏమి లేక గమ్మున లంచ్ కానిచ్చి పెట్టా బేడా సర్దుకొని కదిలాము అమ్మ గారి ఇంటికి. ట్రైన్ లో కూర్చున్న తర్వాత తను “హమ్మయ్య ఇంకా ఈ వంకాయ కొన్ని రోజులు తినను గాక తినను. మీ అమ్మకి చెప్పి మంచిగా వండించుకొని వెరైటీ అంతా తినాలి” అని మురిశాడు. మేము హైద్రాబాదు వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకొని లేచి భోజనాల దగ్గర చూడబోతే “బాబోయి వంకాయ”. ఇద్దరం కళ్ళు తేలేసి అమ్మని వంకాయ ఎందుకు వండావు అని పూడుకుపోయిన గొంతుతో అడిగితె అమ్మ సమాధానం” మీ ఆయనకీ వంకాయ ఇష్టమనీ, పెళ్లి లో మీ అత్తగారు చెప్పారు. అందుకని చేశాను’ అంది. దెబ్బకి వంకాయ దయ్యం దిగి కళ్ళు తేలేసి ఎట్లాగో తిన్నాము.తాను నన్ను బ్రతిమిలాడాడు వంకాయ ఒక నెల రోజులు అసలు వండొద్దని.
అదండీ “అతి సర్వత్రా వర్జతే” అది వంకాయ కానీయండి, లేదా ఇంకోటి కానియ్యండి.
అసలు విషయానికి వస్తే అరుణ చెప్పిన వంకాయ మెంతి కారం చేసిన గుత్తి వంకాయ కూర ఒక పూటలో గుట్టుకు మనిపించారు. ఆ రెసిపీ తో పాటు కాలక్షేపంగా ఈ కథ మీతో పంచుకున్నాను.
ముందు 6 వంకాయలని 4 వైపులా కట్ చేసుకొని నీటి లో ఉంచుకోండి
1.శనగ పప్పు, మినప పప్పు,మెంతులు ఎండు మిర్చి ధనియాలు డ్రై గా వేయించుకోవాలి. వీటిని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోండి
2.పచ్చి మిర్చి కొత్తిమీర అల్లం కలిపి పేస్ట్ చెయ్యాలి
3.పచ్చి కొబ్బరి తురుముకొని ఉంచుకోవాలి
పొడి ని పేస్ట్ ని తురుముని కలిపి చింతపండు బెల్లం తో కలపాలి. దీనికి ఫ్రెష్ మెంతి కూర సన్నగా తరిగినది కలిపి మెంతి కారం రెడీ చేసుకోవాలి.
4.వంకాయలని నీళ్లలో ఉన్న బౌల్ ని మైక్రోవేవ్ లో పెట్టి కొంచం మెత్త పడేలా ఉడికించాలి.
5.ఇలా ఉడికించిన వంకాయలని తీసి కారం ఫిల్ చేసి సన్నని సెగ మీద కొద్దిగా నూనెలో మగ్గనియ్యాలి.
ఇది నేను చేసిన వంకాయ మెంతి కారం… ఒక్క పూటకే ఊష్ అయి పోయింది.
మరి మీదే లేటు
Happy cooking
