రోడ్స్ :అక్కడ-ఇక్కడ
మా చిన్నప్పుడు మేము ఉన్న ఊరిలో ఒక్కటే విశాలమైన రోడ్ ఉండేది.
అది మా చిన్నతనము, రోడు మరీ పెద్దగా అనిపించేది. ఆ రోడ్ దాటితే కానీ ఆడుకోవటానికి ఉండేది కాదు. అమ్మవాళ్ళు రోడ్ దాటనిచ్చేవాళ్ళు కాదు అంత తొందరగా, అక్కడ పెద్ద ట్రాఫిక్ ఉండకపోయినా.
హైదరాబాద్ లో రోడ్సు విశాలం గురించి నాకెప్పుడు అర్థం కాదు. సగం రోడ్ చిన్న వ్యాపారాలు, సగం రోడ్ దుకాణపు దారులు… మిగిలినది ఆటో స్టాండ్.. అసలు రోడ్ కనపడనే కనపడదు.
చరిత్రలో చూస్తే మనకు రోడ్స్ ముఖ్యమని అశోకుని కాలంలోనే గమనించారు. నేటి కాలానికి వస్తే వాజుపయి కి..చంద్రబాబుకి …. తెలుసనుకుంటా… ఈ మధ్యలో, ఆ తర్వాత కనెక్షన్ పోయినట్లున్నది చూడబోతే.
భారతదేశంలో రోడ్స్ కోసం ఎంత శ్రద్ధ పెడతారో, ఒక కాలనీ కట్టేముందు తెలుస్తుంది… కొత్త కొత్త కాలనీలు వచ్చేస్తాయి కానీ సరయిన రోడ్స్ సౌకర్యం ఉండదు. కాలనీ లోని ప్రజలకు, కాలని అసోసియేష్స్ వారికి రోడ్ల మీద శ్రద్ధ వుండదు. మళ్ళీ ఆ సందుగొందులలో, సిటీ బస్సు దగ్గర్నుంచి సమస్తం కూరుకు పోతూ ఉంటాయి. వానా కాలం వచ్చిదంటే దుమ్ము బురద సమస్తం రొచ్చే.
మొన్న మొన్నటివరకు ఆచరణలో చాలా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ విభాగం రోడ్స్ కదా!
కాగితాలకు పరిమితమైన, నిజానికి మాయమైన రోడ్లు ఎన్నో పాపం. ఒక కాలనీలో అయితే… అక్కడి మున్సిపాలిటీ రాకపూర్వం మాట, కాలనీ బాగా డెవలప్ అయింది, సర్పంచి చూస్తుండగానే మూడంస్థతుల భవంతి నిర్మించుకున్నాడు, రోడ్ మాత్రం నామమాత్రం, అడిగే నాథుడు లేదు, బాగుపరిచే శక్తి లేదు..
ఇదంతా ఎందుకొచ్చిందంటే రెండు వారాల క్రిందట నేను ఒక్కతినే, అమెరికా రాజధాని అయినా వాషింగ్టన్ నుంచి, అట్లాంటాలోని మా ఇంటికి నా బెంజు తోలుకుంటూ వచ్చేశాను. 10 గంటల ఏకధాటి రథచోదన తర్వాత సాయంత్రానికి ఇల్లుచేరాను క్షేమంగా.
అప్పుడు కలిగిన ఆలోచన ఇండియాలో ఇలా చెయ్యగలగటం ఇంత తేలిక కాదు గదా అని ..
మా చిన్నతనం నుంచి ఇండియా లో రోడ్స్ మీద ప్రయాణించినా, అదో ప్రహసనమే కానీ, సాఫీగా ఉండేదికాదు.
అమెరికా రాక ముందు, ఇక్కడి రోడ్స్ గురించి, తెగ చెప్పేవారు ప్రజలు… చాల శుభ్రంగా ఉంటాయని, వెల్ మైంటైన్ చేస్తారని, మన బెడ్ రూమ్స్ కన్నా (అదెలాగో)బాగుంటాయని …. నా తలకాయని… ఊదరగోట్టేశారు. మా పక్కింటి మామి ఏకంగా నాతో అయితే ఒక రోజంతా తన జ్ఞానం పంచుకున్నారు… “రోడ్ల మీద లైన్ లు గీసి ఉంటాయి, అదే లైన్ లో వెళ్ళాలి… గీత దాటావా ఫైన్ కట్టాలి, ఎవరికీ వారు అలా గీతలోనే వెళ్ళాలీ అంటూ”…
మేము అమెరికా వచ్చిన వారంలో మా పాపను సమ్మర్ క్యాంపు ఏదో ఉంటేనూ అందులో జాయిన్ చేసి, రెంట్ కార్ లో దాన్ని దింపి, వెనకకి తెచ్చుకొని, నేను నాకు వీరతాడు వేసుకున్న ఆ జ్ఞానమంతా వంటపట్టించుకొని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వాగదు.
ఇక్కడ రోడ్లు, వాటి మైంటైనెన్స్ కు చాలా ప్రాముక్యత వుంది. ముందు రోడ్స్ నిర్మించి తరువాత ఇళ్ళు కడుతారు.
రోడ్లు లేకండా కచ్చా గా దార్లు కనపడవు. అట్లాంటా లోనే కాదు మనకు కంట్రీసైడు లో కూడానూ.
అమెరికాలో హైవే రోడ్స్ సిస్టం అత్యంత ఆశ్చర్య గొలిపే విషయమే. 1921 నుంచి, రకరకాల రూపాలుగా మారి, ఇప్పటి, ఇక్కడి హైవే సిస్టం పటిష్టమైన పునాదుల మీద, దాదాపు దేశం లోని ప్రతి మూల కలుపుతూ నిర్మించిన ఓక అద్భుతమైన నిర్మాణం. పూర్వం జార్జియా వరకు రైల్వేస్ ఉండేవి కానీ, వారి సివిల్ వార్ అప్పుడు, పట్టాలని ద్వంశం చేశారు. మళ్ళీ వాటిని బాగుపరిచే శ్రమ తీసుకోలేదు. పటిష్టమైన రోడ్స్ ఉన్నా, మనకున్నంత బస్సు సర్వీసెస్ వెసలుబాటు ఉండదు.. ఉన్న బస్సులు కూడా, చాలా నెమ్మదిగా నడుపుతారు. దాని ఖర్చు కూడా ఎక్కువే. దాదాపు విమానం టికెట్ అంత ఉంటుంది. అందుకే చాలామటుకు ప్రజలు తమ స్వంత కార్లలు కానీ, విమానంయానం కానీ ప్రయాణానికి వాడుతారు. దానికి తోడు ఈ దేశం చాలా విశాలమైనది. ఆ మూల నుంచి, ఈ మూలకు 47,856 మైల్స్ మించి రహదారులు. తూర్పు నించి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణం కు ..మొత్తం దేశాన్ని కలుపు ఉండే మహోన్నతమైన విధానం.. సుమూరు ప్రతి నలభై మైళ్లకు రెస్ట్ ఏరియా సౌకర్యం కలిగి ఉంటాయి. ఉత్తరానికి వెళ్లే కొద్దీ రెస్ట్ ఏరియా లోనే పెట్రోల్ బంక్ లు, అల్పాహారము, కాఫీ, టీ అందుబాటులో ఉంటాయి. ఈ రోడ్ల మీద స్పీడ్ లిమిట్ 5 మైళ్ళ తేడాతో గంటకు 70 నుంచి 80 మైళ్ళ వేగంతో ప్రయాణించ వచ్చు. వేగాన్ని కంట్రోల్ చేయటానికి అక్కడక్కడా కనపడకుండా మాటువేసి ‘కాప్స్’ కాపుంటారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది వెళ్లాలంటే, ఈ దేశ భౌగోళిక సౌందర్యం ఆస్వాదించాలన్నా, ఈ హైవేస్ మీద మన సొంత కారులో ప్రయాణించటం ఉత్తమమైన మార్గం.
ఫిలడల్ప్యాలోని కాలేజీ లో మా అమ్మాయి చేరాక, ఈస్ట్ కోస్ట్ హైవే మీద మా ప్రయాణం పెరిగిందనే చెప్పాలి. అంతకు పూర్వం, తమ్ముడిని కలవటానికో, ఎదో ఒక ఊరు చూడడానికో వెళ్ళేవాళ్ళం. ఫిల్లీ కి వెళ్ళే హైవే బ్లూ రిడ్జ్ హైవే. 760 మైళ్ళ అట్లాంటా నుంచి ఫిల్లీ కి. మధ్యలో తగులుతుంది ఈ హైవే. ఈ బ్లూ రిడ్జ్ హైవే చాలా అందమైనది. సీనిక్ రహదారిగా కూడా దానికి పేరు. చాల భాగం, స్మోకీమౌంటెన్స్ మీదుగా ఉండే ఆ రహదారి ఎత్తులను లోయలను దాటుతూ ప్రయాణిస్తుంది. కొన్ని చోట్ల, పర్వత శిఖరం పైకి వెళుతుంది … అప్పుడు కింద లోయలో ఉన్న పల్లెలు అందంగా అగుపిస్తూ ఉంటాయి. హైవె లలో కూడా ప్రక్కన హరితము, చాలా చోట్ల మధ్య పూల చెట్టు లతో మైయింటైన్ టీం వుంటారు.
రోడ్ల మీద చెత్త చల్లటం పెద్ద నేరం. పడెస్తూ దొరికితే $500 ఫైన్ కట్టాలి.
వర్జీనియా రాష్టం చాల ఆకుపచ్చగా అందంగా ఉంటుంది. ఆ హరితం చూసె కొద్దీ మనకు, కళ్ళు చల్లబడి, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రకృతి సౌందర్యపూరిత పరిసరాలలో మన కారులో షికారుగా 70 – 80 మైళ్ళ వేగంతో మనతో పాటు, రఫీనూ, కిషోర్ కుమారునూ, ఘంటసాల వారిని తోడుంచుకుంటే…. ఓహ్ .. చెప్పేదేముంది …. అందుకే నేను ఒక్కతినైనా అల్లనల్లనా వచ్చేశాను…
ఉదయం 6 గంటలకు, మంచిగా చాయ్ తో నా ఫ్లాస్క్ నింపుకొని, బయలుచేరితే …. సాయంత్రానికి ఇంట్లో ఉన్నాను. మధ్యలో పెట్రోలుకు ఆగాను.
రెండేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు, (చాల కాలం మధ్యలో గ్యాప్ వచ్చింది) అక్కడ హైవే చూసి భలే ముచ్చటేసింది. వెలిగిపోతోంది నా దేశము, ఇంకేంటి అహా అనుకున్నాను. అసలు ఎక్కడికన్నా రోడ్ మీద ప్రయాణం చిన్నపట్నుంచి అలవాటు తెలంగాణ లో పుట్టి పెరిగాము కాబట్టి. సో తిరుపతి కానీ, ఇంకోటి కానీ రోడ్ మీదే ట్రావెల్ చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాము. ఎదో పెద్ద బండే, ప్రయాణము బానే ఉంది.. కానీ, హైవే మధ్యలో ఎన్నిచోట్ల ఆగాలో అన్ని చోట్లా ఆగాము…. కొన్ని చోట్ల అయితే ఒక వైపు హైవే రాళ్ళతో క్లోజ్ చేసి వడ్లు ఆరబోశారు…. ఇంక ఇంతకన్నా ఘోరం నేను ఊహించలేనమ్మా… ఆవులు, మేకలు తోలటం సరే, మరి వారికి ప్రత్యామ్న మార్గం లేకపోతే ఏమిటి దారి? హై వే లో ఎదురు రావటము, అడ్డంగా దాటేసెయ్యటం, సైడ్ రావటం ఇలాంటివి మనం భారత్ లో పెద్దగా పట్టించుకోకూడదు…. వారికి హైవే కల్చర్ రావటానికి కొంత సమయం పట్టొచ్చు … కానీ వడ్లు ఆరబోసుకోవటం మాత్రం ‘సూపర్ మంచి’ రా బాబు !..
అంతే కాదు,రోడ్స్ వేశారు కానీ, మన వాళ్ళు రెస్ట్ ఏరియాస్ మర్చిపోయారు. మనకు అది ఒక పెద్ద అడ్డు ..గడ్డు…సమస్య… శుభ్రమైన రెస్టురూములు పబ్లిక్ ప్లేస్ లో కోరుకోవటం కన్నా ‘కోహినూర్ వజ్రాన్నీ’ ఇండియా తెచ్చుకోవటం తేలిక.
మెట్రో కట్టారు పార్కింగ్ మర్చిపోయారు … ఫ్లైఓవర్ కట్టారు ఫుట్ పాత్స్ మర్చిపోయారు.. ఇలాగే మౌఖిక విషయాలయందు మన వాళ్లకు శ్రద్ధ లేదు ..కొంత నిర్లక్ష్య ధోరణి.
అదే ఇక్కడ ప్రతి చిన్న విషయం కూడా శ్రద్ధ ఉంటుంది… బిల్డింగ్ కట్టాలంటే పార్కింగు వుండాలి ముందు. కాలనీ కట్టాలంటే రోడ్లు వుండాల్సిందే. ‘లా’ విషయము తు.చా తప్పక పాటిస్తారు. రొడ్ల ప్రక్కనంతా గడ్డి గాని మల్చ్ (చిన్న చెక్కముక్కలు) కాని కప్పాల్సిందే. మట్టి కనపడకూడదు. ఆ రకంగా దుమ్మును తగ్గించేస్తారు. ఆ రకంగా పొల్యుషను కూడా తగ్గిపోతుంది. ప్రభుత్వ విధానాలలో ప్రజలకు కనీస అవసరాలు అదించటములో వీరికి నిబధత్త వుంది. అందుకే ఇక్కడ రోడ్స్ కానీ, రోజువారీ జీవితం కానీ సాఫీగా సాగుతాయి…
-సంధ్యా యల్లాప్రగడ