రామనవమి అంటే భద్రాచలమే గుర్తుకువస్తుంది తెలుగువారికి ఎవ్వరికైనా!!
మా చిన్నప్పుడు పెరిగిన ఊరిలో రామాలయం లేదు, కానీ ఇంట్లో విధిగా అమ్మ రామనవమి ఆచరించేది. మాకు వడపప్పు, పానకం ఇచ్చేది. పానకం కారంగా, చాలా కొంచము తీయగా ఉండేది కాబట్టి తాగటానికి నాలుగు వంకలు పోయి, తప్పక గొంతులో పోసుకునేవాళ్ళము,అందుకే చాలా గుర్తు. ఒకసారి నవమికి తెనాలిలో ఉన్నాము. నాకు బహుశా 10 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. ఊరంతా పందిళ్లు, ఎక్కడ చుసినా జనం.. అన్నిటికి మించి బోలెడు బొమ్మలు ఆ పందిళ్ళలో అమ్మటానికి పెట్టారు. చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మలు చాలా గుర్తు, ఎంత బాగున్నాయో అని. అదొక్క సారే మేము శ్రీరామ నవమికి తెనాలిలో ఉండటం. మళ్ళీ నవమి ఉత్సవాలు నేను ఎప్పుడూ చూడలేదు. ఇంట్లో సంప్రదాయంగా చేసుకునే రామాయణ పారాయణము తప్ప.
నాన్నగారు శ్రీరామనవమి నాటికి పూర్తి అయ్యేలా సుందరకాండ పారాయణం చేయించేవారు ఇంట్లో.
శాస్త్రులు గారు రోజు మమ్ములను ముందేసుకుని( మేము అలా కూర్చోబెట్టబడే వాళ్ళము) సుందరకాండ పెద్దగా చదివి అర్థం వినిపించేవారు. సుందరాకాండ అసలు వైదికమంత్ర శాస్త్రమని చెబుతారు. మంత్ర శాస్త్ర పరముగా వివరణలు మనకు దొరుకుతాయి. అందుకే సుందరకాండ పారాయణము సర్వోవృద్ధికి తోడ్పడుతుంది.
నాయనమ్మ ప్రతి సంవత్సరం భద్రాద్రికి ఒక బియ్యం బస్తా కానుక పంపేది. రామకోటి రాయటం ఒక సరదాగా ఉండేది మాకు. రకరకాల నామాలు, బొమ్మల షేపులలో రంగు రంగుల ఇంకు వాడి నేను తమ్ముడు రామకోటి రాసే వారము. ప్రతి పేజీ చివర “ఆపదా మపహర్తారం…” పద్యం తప్పక ఉండవలసినదే. ఇవ్వన్నీ చిన్ననాటి రామనవమి గురుతులు.
ఇండియాలో నాకున్న రామనవమి జ్ఞాపకాలు ఇంతే. నేను భద్రాచలం ఎప్పుడు రామనవమికి వెళ్ళింది లేదు, చూసింది లేదు..రేడియో లో ఉషశ్రీ చెప్పే కళ్యాణం వినటం తప్ప-
కానీ ఈ సారి, రామ కళ్యాణం – మా ఊరిలోని హిందూ దేవాలయం లో చూసి తరించాము. అసలు పండుగ ఎప్పుడు వచ్చినా అది వారాంతరానికి లాగి వేడుకలు జరుపుకోవటం అలవాటైన జీవితాలకి, పండుగ వారాంతరమే రావటం పెద్ద పండుగేకదా!
మా ఊరి గుడిలో జరిగిన వేడుక, భద్రాద్రి కళ్యాణం అంత వైభోగంగా జరిగింది. వేల రామ భక్తులు హాజరైన ఆ ఉత్సవం చుసిన వారి కన్నుల పంటగా సాగింది. ఊరి పెద్ద పురోహితులు భట్టారుగారు ఆధ్వర్యంలో అత్యంత హృద్యంగా సాగింది. వ్యాఖ్యాతలుగా ఉన్న పూజారులు బాగా ఉషశ్రీ వారి వ్యాఖ్యానం విన వంటపట్టించుకున్నారులా ఉంది … ఆద్యంతం ఏంతో భక్తిగా రక్తి కట్టించారు. తెల్లని మధుపర్కములలో రాములవారు సాక్షాత్తూ నారాయణుగా, ఎంతో సుందరంగా ‘పుంసామోహన రూపాయ’ కదా మరి వారు, ప్రజలందరినీ సమ్మోహులుగా చేసారు … స్వయంగా అమ్మ సీతమ్మను మోహింపచేసిన జ్నాగనాథునకు సామాన్య ప్రజ మనమొక లెక్కా?… అమ్మవారు ఎర్రని చీరలో మెరిసిపోతూ లోకపావనిగా సాక్షాత్కరించారు. తల్లి జడ బంగారు పూల జడ, వజ్రాలు అద్ది వివిధ నగలతో మనోహరంగా, కన్నులపంటగా ఉంది.
ఆ తల్లి అసలు అవతారమే శక్తి స్వరూపం. అసలు లక్ష్మి అవతారములలో సీతా దేవి అవతారం విభిన్నమైనది. సీతగా అమ్మవారు రాములవారికి దిశానిర్దేశం చేశారు. సీతా దేవి రామస్వామితో అడవికి వెళ్ళకపోయినా, బంగారు లేడిని అడగకపోయినా రామాయణం ఉండేదికాదు, దుష్ట శిక్షణా, సాధుజన సంరక్షణా అన్న భగవత్ కార్యం సాగేదే కాదు. అవన్నీ జరిపించటానికే అమ్మవారు సీతా మాతగా అవతరించి రామస్వామి అవతారానికి ఒక వన్నె తెచ్చారు. ఇంత సృష్టి సంరక్షణా, రామస్వామికి సాధ్యమైనది సీతా మాతను పెళ్ళాడినందువల్లనే కదా! అందుకే అంతటి ఆనందకరమైన సంఘటనలను రాముని జన్మ దిన వేడుకలుగా “సీత రామ కళ్యాణం” గా జనులు ఇప్పటికీ జరుపుకోవటం సమంజసమే కదా!!
రామ కల్యాణ వేడుక, ఒక కమనీమైన మధురమైన వేడుక. యుగ యుగాలుగా భారతీయ డిఎన్ఏ లో ఇంకిపోయింది రామనామం. రామ కళ్యాణం ముక్తిదాయకమని నేటికీ ఓక నమ్మకం.
అలాంటి కళ్యాణం చూడటానికి కన్నులు చాలవు.
అమ్మవారికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, ప్రవర చదివేటప్పుడు, చక్కట్టి త్యాగరాజ కృతులు పాడుతూ ఒక బృందం పక్కనే ఉన్నారు. తబలా, వొయిలెన్ తో పాటు, సన్నాయి మేళం, అవసరమైన చోటంతా డొల్లుసన్నాయి వాయిస్తూ, రక్తి కట్టించారు. “ఉపచారము చేసే వారున్నారని మరువకురా రామా … ” అని భైరవి రాగంలో వారంతా పాడుతూ ఉంటే మేము గొంతుకలిపి ఆ రామ స్వామికి మేము ఉన్నామని, సేవకు సిద్ధముగా’ అని విన్నపించుకున్నాము.
“ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీశ్వ పాణినా ” అని మా అందిరికీ చెబుతూ కన్యాదానం చేయ్యటానికి బ్రహ్మ గారు మంత్రాలూ చదువుతుంటే, నేనైతే భక్తిగా అమ్మని తలుచి మొక్కాను .. “మాకు ఇలా కన్యాదానం చేసే అవకాశం రావాలని”…మా శ్రీవారిని హెచ్చరించాను, అలా మొక్కుకోమని…. అమ్మని, జానకీమాతను.
జనకమహీపతి… అలా చెబుతూ కన్యాదానం చేస్తే, రామస్వామి ఆ అమ్మవారు హస్తం అందుకొని, మన జీవితాలు పండించాడు కదా అని మేమంతా ఆనందించాము..
గాయకులు … “ఆనందమనందమాయనే… అని భైరవి రాగం లో మరో కీర్తన అందుకుంటే మేమంతా ఆనందంతో ఓలలాడిపోయాము.
ఆహా! అమ్మవారు జానకి కన్యారత్నం మెడలో ఆ స్వామి మంగళసూత్రం కట్టారు మాకందరికీ కన్నులపండుగ అదే కదా!
“సీతమ్మ పెళ్లికూతురాయనే.. మన రామయ్య పెళ్లికొడుకాయనే..” అంటూ అందరితో కలసి పాడుతూ ఆ కళ్యాణంలో.. ఆకాశమంత పందిట్లో , భూలోకమంత అరుగు మీద అవుతున్న కళ్యాణం, లోక కళ్యాణము కోసమే కదా!
అలాంటి ఇలాంటి పెళ్లి కాదండి అది.. చేసినవారి ….చూసిన వారి జన్మ ధన్యం… చూడకపోతే మాత్రమూ నిజంగానే వారు ఎంతో కోల్పోతున్నట్లే… ఒక్క సారైనా చూడాల్సిన ఇలాంటి వేడుక… మా అట్లాంటాలో ఉన్న ఈ బాలాజీ దేవాలయంలో ప్రక్కనే శివమహాదేవుణ్ణి సన్నిధి లో,జరిగిన వేడుకలో రెండు వేలమంది పాల్గొన్న వేడుక…
కళ్యాణం లో మేము పాల్గొన్నందుకు మాకు “రాం పరివారు” మా ఇంటికి వచ్చారు..
పుట్టిన దేశాన్ని వదిలి వేళ్ళ మైళ్ళ దూరం వచ్చినా, మనసులో భారతీయత మారదు, రామ నామ వేడుకల మీద మక్కువ మారదు.. ఎంత జీవితాలు వేగమంతమయినా, ఇలాంటి పండుగల సందర్భంలో మాలోని భారతీయత ఆత్మకు ఆహారం అందించి.. మరోరోజు జీవితపు నాటకానికి శక్తిని ఇస్తాయి.
-సంధ్యా యల్లాప్రగడ




