అమ్మవారికి కవనమాల
1.
మహి లోన నడిపించు శక్తి నీవు
మా మనసులో కొలువైన జనని నీవు
అగుపించు ప్రకృతివి,
అగుపడనిఅచలజవి
జగతినడిపించుఆత్మనీవు
అందరిలోకొలువైనపరమాత్మానీవు
బ్రహ్మాండాలకుగతియునీవు!!
2.
ఆది శంకరుడు బోధించిన వాణి నీవు
మూకశంకరుని వాక్పటిమ నీవు
భాస్కర రాయుని భాష్యాలు నీవు
పరమాచార్యుణ్ణి పరమ నిష్ఠ నీవు
మా వాక్,కర్మ భావనల యందు నిలిచి
సదా మమ్ము నడిపించావోనీశ్వరి!
3.
మూలాధారములోని మూడున్నర మూర్లు
ముడుచుకున్న మహా శక్తి నీవు
పరమ గురు బోధనలు పాటించు నరులకు
పంచేంద్రియములు అర్పించు మానవుని
మనసుల యందు తిష్ట వేసి
వారల అంతర్ముఖులుగా మార్చి
నిద్రించు శక్తిని నిద్రలేపి
షట్ చక్రములు దాటించి
సహస్రారములోన సదాశివునితో కలసి
విహరించు కుండలిని శక్తి నీవు !!
4.
వరుస జన్మల కర్మలు ముదిరిపోగా
పరిభ్రమించును జీవుడు – పలురూపములు దాల్చి-
జనన మరణ చట్రాలు బిగియపడగా
అంధకార తిమిరాన పరిభ్రమించును ఆత్మ
నిన్ను తలచి మ్రొక్కినవారల, దయచూపి
గండ్రగొడ్డలితో కర్మలు ఖండింతువమ్మా !!
5.
ఏ జన్మలో నేర్చిన పుణ్యమేదో
ఈ జన్మలో నీదు పాదములు పట్టుకుంటి-
నీ గుణకీర్తులను గానము చేయ్యగా
నా కలము నందు వసింపుమమ్మా!!
నా వాక్కునందు నిలిచి నడిపించవమ్మా !!
నిన్ను నమ్మిన వారలకు లేమి లేదు
భగవతి!! ఈశ్వరి! పాహి! పాహి!!
– సంధ్యా యల్లాప్రగడ
