శనగ దోశ- నా అజ్ఞానము

శనగ దోశ- నా అజ్ఞానము

మా పుటింట్లో మడులు, దడులు ఎక్కువ. అందుకే అసలు వంటింటి ఛాయలకు రానిచ్చేవారు కారు మా చిన్నప్పుడు. నాకు వంట రాకపోవటానికి ఇదో కారణమనుకోండి. ఈ సాకుగా నా బద్దకాన్ని కప్పేసి ఎప్పుడూ నాకు వంటరాకపోవటానికి ఈ పద్దతులే కారణమని సాదించే చాన్సు వదిలేదాని కాదు.
వంటే కాదు వంటవస్తువులు కూడా ఏవి ఏమిటో తెలియని అమాయకత్వం ఎవ్వరూ గమనించ కుండా చాలా కాలము దాచాను కాని ఓక సారి అడ్డంగా దొరికిపోయాను. అసలు విషయం లోకి వస్తే:

అప్పట్లో అంట్లే నేను చదువుకునే రోజులలో, మధ్యలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న రోజులలో అన్న మాట. చదువు పావు వంతు కబుర్లు మూడొంతులతో సరదాగా గడిచిపోయె సమయము అవి. అలాంటి సమయములో కొంత కాలం నేను గుంటూరులో కోచింగ్ కోసం ఉన్నాను. చాలా కొద్దికాలంమే అనుకోండి. నా మిత్రురాలితో పాటు ఒక రూమ్ లో ఉండే వాళ్ళం. ఒక రెండు నెలలు ఉన్నామేమో మొత్తంగా. మా పిన్నిగారు వాళ్ళు దగ్గరలో అంటే కేవలం మూడు అడ్డరోడ్డులు దూరంలో ఉండేవారు( గుంటూరు లో అన్ని అడ్డ రోడ్స్ తో ఉంటాయి, న్యూయార్క్ లో బ్లాక్స్ లా) అందుకని ఫుడ్ కి చిక్కు లేకుండా వారి ఇంటికి వెళ్లి, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చేసి వచ్చి, చదవటం సాకుతో కబుర్లు మునిగి సాగే రోజులు.
పిన్నిపిల్లలు చిన్న వాళ్ళు నా కన్నా.
అప్పటికి ఇంకా ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నారు, మిడిల్ స్కూలు (7,8, తరగతులు) ఇద్దరునూ. చిచ్చర పిడుగులు. చూసిరమ్మంటే కాల్చి వచ్చే టైపు.
ఒక రోజు పిన్నికి ఏదో అర్జెంటు పని పడి పొరుగూరు వెళాల్సి వచ్చింది. ఆమె నన్ను పిలిచి, ఇంట్లో ఉండమని రాత్రికి వచ్చేస్తానని, పిల్లలని స్కూల్ నుంచి వచ్చాక కనిపెట్టుకొని ఉండమని చెప్పి’ చక్కా ఊరు వెళ్ళిపోయింది. ఇంక పిల్లలొస్తే వాళ్లకు తిండి పెట్టి, హోంవర్క్ చేయించాలని కాచుకు కూర్చున్నాను. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చారు పిల్లకాయలు. వాళ్లకి ఫ్రెష్ అయి వచ్చి తిని కూర్చోండిరా అంటే వినరు. అన్నం వద్దు అని ఒకడు ఇటు, ఒకడు అటు పరుగెత్తటం. ఒకడిని పట్టుకొస్తే ఇంకోడు జంప్. కప్పల తక్కెడలా ఉండింది వాళ్లకి వ్యవహారం. నాకు వాళ్లని ఎలా కంట్రోల్ చేయాలో,ఎలా తినిపించాలో తెలియలేదు. అన్నం వద్దు అంటే ఏమి కావాలిరా మరి అంటే ‘ఎదో ఒక టిఫిన్ చేయి అక్కా’ అని సతాయించారు. మనకు వంటలో నే కాదు వంటింట్లో కూడా అప్పటి వరకు ప్రవేశం లేదు. అయినా వంట ఏమైనా రాకెట్ సైన్స్ భయపడటానికి ఎదో ఒకటి వండేద్దాం, వాళ్లకి పెట్టి తినిపించి పిన్ని దగ్గర మార్క్ కొట్టేదాం అని ఆలోచించి, ఆలోచించి మా అమ్మమ్మ ఎప్పుడు చేసే శనగ దోశ వేసి పెడదాము అని నిశ్చయించాను.
పిల్లలు రెడీ గా ఉండండి, మీకు దోశ వేసి పెడుతా తిని హోంవర్క్ చేసుకోండి అంటే వాళ్ళు ఫుల్ హ్యాప్పీస్. అన్నం వద్దు అనటం ఒక హ్యాపీ, దానిపై దోశ తినటం ఇంకో హ్యాపీ.
సరే వంట్లిట్లో కి వెళ్లి అంతా గాలించాను. ఒక మూల ఒక ప్లాస్టిక్ కవర్ లో కొద్దిగా యెల్లో కలర్ లో ఒక పొడి దర్శనం ఇచ్చింది.
గుడ్ శనగపిండి దొరికింది. అది అంతా గిన్నెలోకి వేసుకొని, ఉప్పు కారం కొద్దిగా కలిపి, పెనం వేడి చేసి, నూనె వేసి కొంత పిండి పెనం మీద కుమ్మరించి వలయాలా త్రిప్ప ప్రయత్నిస్తే, ఊహూ…రాలేదు.
మొదటిది గోడకు కొట్టిన సున్నం లా పెనానికి అతుక్కుపోయింది. నీళ్లు ఎక్కువైనాయి అనుకోని, ఇంకొంచం ఆ పిండి కలిపి గట్టిగా చేసి, “జంధ్యాల వారి శ్రీలక్ష్మి అప్పటికి తెలియదు కాబట్టి, వీర హనుమంతుని తలుచుకు గుండె గుబేల్ గుబేల్ మంటూ ఉంటే రెండో గరిట పిండి పెనం మీద పోశాను. అది అమావాస్య చంద్రుని తలపించింది. మందములో బహు దొడ్డగా కూడా వచ్చింది. ఇలా కాదని మంట తగ్గించి, నూనె దారాళంగా పెనం మీద పోసి, ఈ సారి ముక్కోటి దేవతలను తలచుకొని, గరిటతో పిండి పెనం మీద తిప్పాను. దోశ వచ్చింది. కాపోతే అది కొంచం ఎరువు ఎక్కువైన కాయగూరలా బలిసి మందంగా దిబ్బరొటిలా వచ్చింది.
ఏదో ఒకటి “దంచినమ్మకు బొక్కిందే లాభమని గబా గబా ఒక నాలుగు దిబ్బరొటెలు లాంటి దోశలు వేసి పిల్లలకి పెట్టాను. వాళ్ళు మొఖాలు అదో మాదిరిగా పెట్టి ఒక ముక్క తిని, మిగిలినది వదిలేసి టమాటో కెచప్ మాత్రమే తిని పారిపోయారు. నేను ఏదోఒకటిరా దేవుడా బ్రతికాను
యని, పిన్ని ఎప్పుడు వస్తుందో అని ఎదురు చుసి, ఆవిడ రాగానే అక్కడ్నుంచి చట్టుకున మాయమైనాను. రెండు రోజులు తినటానికి వెళ్ళలేదు. ఏదో వంకతో. పిన్ని కబురు పంపింది రమ్మని భోజనానికి. తప్పలేదు వెళ్ళక. మధ్యాహ్నం వెళ్ళాను భోజనానికి వెళితే పిన్ని అడిగింది ఏంటే ఏవో రొట్టెలు చేసావటగా అని.
“అవును, శనగ దోశలు, కొంచం మందగా వచ్చాయి” అన్నాను మాడ్చినవి పెట్టానని అక్షంతలు ఎన్ని పడతాయే అని.
“ఏమి పిండి వాడావు, అసలు శనగ పిండి లేకపోతేనూ ఇంట్లో” అంది మా పిన్ని.
విసుపోవటం నా వంతైనది. నాకు చెడ విసుగొచ్చింది. ఇంట్లో ఉన్న వస్తువులు వాళ్లకే తెలీక పొతే ఎలా? చూపించాను ఎక్కడ నుంచి తీసుకున్నానో.
మా పిన్నికి నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ పిండి శనగ పిండి కాదుట అక్షరాలా “కస్టర్డ్ పొడి”. సమ్మర్ కాబట్టి పిల్లలకోసం కస్టర్డ్ చేద్దామని పెద్ద ప్యాకెట్ తెచ్చి ప్యాకు లో నుంచి తీసి కొంత వాడి మిగిలిన పిండి ఆ కవర్ లోనే ఉంచేసింది. డబ్బా పడేసింది పిన్ని. నాకా వస్తు పరిచయం లేదు. కనపడ్డవి తీసి కలిపి దిబ్బరొట్టెలు వేసి వాళ్ళని తినమంటే ఎలా తింటారు? కెచప్ తిని గమ్మున ఉన్నారు. వాటి అందానికి మళ్ళీ ఆ పిండి కాని పిండితో చేస్తే అవి పెన్నానికి అంటుకు పోయి, మాడి పోయి, వూడి రాక నానా అగచాట్లు పడ్డానన్న మాట.
అదండీ కస్టర్డ్ పొడి తో దోశలు చేయపోయి భంగపడ్డి, అరుచితో మాడిన పేరులేని పదార్దం చేసి భంగ పడిన వృతాంతం.
మరొక్కసారి దిబ్బరొట్టి నుంచి పేపర్ దోశకు ప్రయాణం గురించి ఇంకెప్పుడుడైన తీరిగా పంచుకుంటాను మీతో.
ప్రసుత్తం ఈ దోశతో సంతృప్తి పడండి.

శనగ పిండి దోశ కు రెసిపి;

శనగ పిండి 1 కప్పు కు 1/2 మైదా కానీ బియ్యం పిండి కానీ కలిపి,
సన్నగ తరిగిన వుల్లి, పచ్చమిర్చి, కోతిమీర రెడిగా వుంచుకోవాలి.
పిండి జారుగ కలుపుకొని, పెనము మీద. పలుచగా పరచి తరిగి కాయగూరలు చల్లి, వేగాక తీసెయ్యటమే. కమ్మగా వుంచి రుచిగా వుండే శనగ దోశలు పిల్లల దగ్గర్నుండి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు.
Happy 🥘 cooking-

Sandhya Yellapragada

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s