అక్కడ – ఇక్కడ :
ఋతువులు- చెట్లు – పర్యావరణం:
కాలాలు, ఋతువుల వివరాలు చిన్నప్పుడు పాఠం నేర్చుకోవటమే కానీ, అనుభవంలోకి వచ్చినది నిజానికి ఇక్కడికి వచ్చాకనే!
నా సైన్స్ పాఠంలో శిశిరం, వసంతం ఇలా ఆరుకాలాల/ఋతువుల గురించి నేర్చుకున్నా, నేను పెరిగిన ఊరులో కానీ, హైదరాబాద్ లో కానీ ఋతువులలో తేడా పెద్దగా ఉండేదికాదు. మాకు వేసవిలో వేసవి సెలవలు, మామిడి పండ్లు, మల్లెపూల గుబాళింపు, ఎండలు వీటి మూలంగా వేసవి బాగా తెలిసేది. వాన జల్లులు వచ్చినా నాకెప్పుడూ ఇదే సమయంలో వానలు పడుతాయనే అని గుర్తులేదు. ఎప్పుడూ వానలు తప్పు సమయములో పడుతున్నాయని అంటూవుండేవారు.
హైద్రాబాదులో వానొచ్చిందంటే రోడ్లు అన్ని బంద్! ఎక్కడ చూసినా వెలసిన తటాకాలేగా! అందుకనే అనుకుంటా ఋతువుల గురించి, “ఎండా కాలము, ఎండా కాలం కాని కాలం” అని విభజించటము సామాన్యమైంది.
నా పెళ్ళైన కొత్తల్లో శ్రావణమాసం పూజలు, మంగళ గౌరీ వ్రతాలూ మొదలెట్టాక, వానా కాలం, తాంబూలాలకు వెళ్లి తడవటం మరొక జ్ఞాపకం. చలి కాలం మనకు అంతగా బాధించదు కదా!. మంచి ఆహ్లాదకరంగా ఉండి, జీవితానికి శాంతి నిస్తుంది. చెట్లు, పుట్టలలో మనం చూడగానే పసిగట్టేటంత మార్పు అనేది పెద్దగా ఏ సమయములోనూ ఉండదు. పూలో, పళ్ళో బజారులో రావటం తప్ప అలాంటిదే గా మనము చూసే మార్పు.
ఇక్కడ ఫాల్ కలర్స్(శిశిరము రంగులు) చాలా పేరున్న కాలం. ఊరిలో చెట్లన్నీ తమ తమ ఆకులను పసుపు నుంచి ఆరంజ్ దాకా రకరకాల రంగులోకి మార్చుకుంటాయి. మా ఊరులో అయితే మరీ అందంగా మారిపోతాయి. మాకు దగ్గర లో ఉన్న స్మోకీ పర్వతాలైతే తంగేడు పూలు అలంకరించిన గొబ్బెమ్మలా ఉంటాయి ఆ సమయములో. కన్నులకు విందుగా ఉంటుంది ఆ కాలమంతా. చాలా టూరిస్ట్ కాలం కూడా అదే ఇక్కడ. చాలా తెలుగు సినిమాలో పాటలు చిత్రీకరణలో కూడా చూడొచ్చు, ఎరుపు, పసుపు, నారింజ ఆకుల చెట్లు ఉన్న వనాలు ఉన్నాయంటే అవి ఫాల్ రంగులని. ఆ ఆనందమంతా ఒక నెల ఉంటుందేమో. తర్వాత ఆకులు దూసేసినట్లు అన్నీ రాలిపోతాయి.
ఇక శీతా కాలమంతా మొండి చెట్లు చలిని మంచును ఎదురీదుతూ నిశ్శబ్ద సైనికుల్లా చలితో పోరాడుతూ వుంటాయి.
మన చైత్రం వచ్చినప్పుడు ఇక్కడ వసంతం మొదలవుతుంది. ఒక్కసారి ఊరంతా ఎక్కడచూసినా ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. అది చెట్లకు వచ్చిన ఆకులతో కాదు సుమండీ, పువ్వులు పూచి వాటి పుప్పోడితో. . అంతలా అన్ని చెట్లు ఒక్కసారే మొగ్గలేసి, పువ్వులు విచ్చుకొని ఊరంతా పూల సజ్జ లాగుంటుంది. అన్నీ పూలే, ఒక ఆకుకూడా రాకుండా చెట్టంత పూలతో ముంచెత్తుతాయి. ఆకుల కన్నా ముందు పువ్వులు వచ్చి వింత అందాలతో, సున్నితాలతో నిండిపోతుంది. చెర్రీ బ్లూసమ్ అని వాషింగ్టన్ డీసీ వైపు చాలా పేరుపొందిన కాలమిది. మళ్ళీ టూరిస్ట్ సందడికి, స్ప్రింగ్ హడావిడి మొదలయ్యే కాలము కూడా ఇదే. డిట్రాయిట్ లోనూ, సియాటిల్ దగ్గర తూలిప్ పూల పండుగలు జరుగుతాయి. గాలిలో పుప్పొడి నిండి పండుగలా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆకుపచ్చటి రంగు కప్పేసి ఉంటుంది, ఊరు వాడా అంతా. మా ఇంటి వెనుక ఉన్న ఓక్ వృక్ష రాజ్యాలూ అత్తి ఎత్తుగా పెరుగుతాయి. విరివిగా ఉత్తర అమెరికా, కెనడాలలో కనబడుతాయి ఇవి. వీటి కాయలు నల్లగా వుంటాయి. ఇవి విచ్చుకొని, రకరకాల బుట్టలు, బొమ్మలు చెయ్యటానికి చాలా వాడబడుతూ వుంటాయి. వాటి నుంచి చాలా పుప్పోడి రాలుతుంది. ఆ పొడి కూడా ఇదే సమయంలో వస్తుంది. అన్ని కలసి మొత్తానికి ఉరికి అందమే కాదు చాలా డస్ట్ కూడా తీసుకువస్తుంటాయి. వీటితో చాల ఎలర్జీస్ కూడా ఈ సమయంలో కలుగుతాయి. దాదాపు అందరూ తుమ్ముతు, దగ్గుతూ, కళ్ళు ఎర్రబారి తిరుగుతుంటారు.
శీతాకాలపులో చలికి పసుపుపచ్చగా మారిన లాన్ అంతా ఆకుపచ్చగా మారుతుంది ఈ సమయములోనే. ఎక్కడనుంచో రంగురంగుల పిట్టలు ఆహారంకోసం ఇళ్ళ చుట్టూ తిరుగుతూ చాలా హృద్యంగా కనిపిస్తాయి. వాటికి ఎక్కువగా పొద్దుతిరుగుడు పువ్వు గింజలు ఇష్టం. మా బర్డ్ ఫీడ్ లో ఆ గింజలు నింపితే ఉదయానే శుక పికముల, కళ రవములతో,కిలకిలా లాడుతూ ఉంటుంది ఇంటి ఉద్యానవనమంతా.
ఇక్కడ ఉడతలు చాలా పెద్దవిగా ఉంటాయి మన ఉడతలలా కాకుండా. అంతే కాదు, వాటికి వీపున మనకు మామూలుగా ఉడతలకు కనిపించే మూడు గీతలు ఉండవు. మేము వాటిని చూసి, వీటికి రామస్వామి స్పర్శ తగలక ఇలా ఉన్నాయి, ఇవి అమెరికా ఉడతలు కాబట్టి కామోసు అని అనుకుంటాము సరదాగా.
మనకు ఇక్కడ ఋతువులలో కనిపించినంతగా తేడా మన దేశములో కనపడక పోవటానికి ముఖ్య కారణం, మన దేశం సబ్- ట్రాపికల్ దేశం అన్నది ఒక ముఖ్య కారణము. మనకు ఎప్పుడు చూసినా పచ్చని చెట్లు ఉండే సమశీతోష్ణ దేశం. కాబట్టి కూడా ఇంత తేడా కనపడదు.
మీదు మిక్కిలి మన వృక్ష సంపదను మనం చాల మటుకు కాలరాచుకున్నాము కూడా కదండీ. దాని ఫలితము మన ఋతువుల మీద కాలాల మీద కనపడుతూనే ఉంది. మన వసంతోత్సవం మనము ఎదో నామమాత్రంగా జరుపుకుంటూ, చెట్ల కోసం వెతుక్కుంటున్నాము.
గణపతి పూజకు పత్రి కోసం మార్కెట్ లో కొనుక్కోవాల్సిన గతిలో ఉన్నాము. మనకు ఇంటి చుట్టూ పెరడు,చెట్లు, మొక్కలు ఎక్కడ?
ఉన్నంతలో కాస్త చెట్లు పెంచి, మనకు కుదిరినంతగా వాతావరణానీ రక్షించుకునే బాధ్యత మన మీద లేదంటారా?
ఇక్కడ న్యాయ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంటుంది. ఒక చెట్టు నరికితే వారికి ఇంకొక చెట్టు నాటాల్సిన బాధ్యత తాము తూ. చా. తప్పక పాటిస్తారు. కట్టే ఇళ్ళలో 40% ఆకుపచ్చగా వుంచాలంటే వాటిని అమలుపరుస్తారు. లేకపోతే వాళ్ళ ఇళ్ళకు ఇన్సపెక్షను పూర్తి కాదు.
ప్రతి ఇంటి ప్రాగణంలో చెట్లు, మొక్కలు ఉంటాయి. కాంక్రీటు అరణ్యాల మధ్యకూడా వీళ్లు పార్క్ కోసం 700 ఎకరాలు భూమి వదిలేశారంటే మీరు నమ్మగలరా? న్యూయార్క్ లో చూడండి, సెంట్రల్ పార్క్ ఉన్న చోట్టూ తప్ప చుటూ ఆకాశ హర్యాలు.
మరి నేటి యువత ప్రతీదీ దిగుమతి చేసుకుంటున్న తరుణం లో మన వృక్ష సంపద రక్షించుకుకోవటం లాంటివి కూడా అనుసరించటము అయితే బాగుంటుంది.
నా ఉద్దేశం అమెరికా అద్బుతము, మిగిలినవి తూచ్ అని కాదు, రెంటి లోని మంచి తీసుకు యువత సాగాలని.
తడికెళ్ళ భరణి గారు చెప్పినట్లు “మన దేశం లో ఇళ్ల మధ్య చెట్లు ఉంటాయి. అమెరికాలో చెట్ల మధ్య ఇళ్ళు ఉంటాయి”.
ఈ నెల 22 ప్రపంచ పర్యావరణ రోజు గా గుర్తించారు. కాబట్టి మనం చెట్లను గౌరవించి, కాపాడాలని నా ఆకాంక్ష.
చెట్టను కాపాడుకోగలిగితే, ఋతువులలో వాటిలో జరిగే మార్పులు, పూలు పళ్ళు రావటము ఇత్యాదివి ప్రతివారు గమనించేటంతగా వుంటుందనటములో సందేహమే లేదుగా.




