ఈ రోజు మా శ్రీవారి జన్మదినం. అందుకే నాల్గింటికివచ్చారు భోజనానికి. వచ్చారుగా అని సంతోషంతో వడ్డించాను చేసిన అన్ని ఫలహారాలు. ఈయన పుట్టినరోజంటే మా పెళ్ళైన కొత్తలో విషయాలు గుర్తుకువస్తాయి నాకు. మా పెళ్ళైన రెండు నెలలకే తన జన్మదినం వచ్చింది. అప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. అత్తగారు వాళ్ళు మాతోనే ఉండేవారు. ఆ ఉదయం, “నూనె అంటమ్మా అబ్బాయి తలకు” అని మావగారు ఆజ్ఞ. నాకు ఇంకా ఇంత ట్రెడిషల్ వేషాలు లేవు. అంతా అయోమయం, గందరగోళం. సింపులుగా ఓక వెర్రి మేళం అన్నమాట. సరే అని కొబ్బరి నూనె సీసా పట్టుకు వచ్చాను. ఇంతలో మా అత్తగారు జెట్ వేగంలో దూసుకొచ్చారు, ఎక్కడున్నారో అంతవరకును మరి. నా చేతిలో సీసా బర్రున లాకొన్ని తన దూసుకెళ్లిపోయారు. శ్రీవారు వంటగదిలోంచి రెండు గరిటలు తీసుకు వచ్చారు. ఆవిడ నూనె సీసాతో, శ్రీవారు చేత గరిటలతో నా ఎదురుగా….నాకు ఏంటో గ్రీకు సినిమాలా అనిపించింది.
భారతం నాటకంలో దృతరాష్ట్రుని లా “ఏంటి జరుగుతోంది?” అని వింత మొకముతో అడిగాను.
‘ముందు గరిటె పుచ్చుకో’ అన్నారు శ్రీవారు. అర్థంకాలేదు.
అత్తగారు అన్నిటికి తెగించిన పోకర్ మొఖంతో “నేను సిద్ధం” అన్న పోజ్. అసలు అర్థంకాలేదంటే నమ్మండి. ఆవిడ “నేనే నూనె అంటుతా” అన్నారు.
నేను “సరే కానీయండి” అన్నాను.
కొండల్ మొఖంలో పెద్ద ప్రశ్నార్థకం. “నీకు ఓకే నా?” అని….
ఆవిడ పేస్ లో రిలీఫ్ స్పష్టంగా కనిపించింది.
ఇందులో అనుకోటానికి ఏముంది , ఉన్న నాలుగు వెంట్రుకలకు ఏవరు పూస్తే ఏంటి నూనె అనుకోని”ఇందులో అనుకోటానికి ఏముంది?” అంటే అప్పుడు హిస్టరీ చెప్పారు.
అంతకు రెండు సంవత్సరాల ముందే వాళ్ళ అన్నగారి వివాహం జరిగినది. అప్పుడూ పెళ్ళైన వెంటనే వచ్చిన మా బావగారి(శ్రీవారు అన్నగారు) పుట్టినరోజున నూనె నేనంటే, నేనని అత్తా కోడళ్ళు శక్తి వంచన లేకుండా ట్రై చేసి, ఆయన బుర్ర తిన్నారట. అప్పుడు మా శ్రీవారు వాళమ్మకి ముందే చెప్పి పెట్టాడట, ఇలా గరిటల ఫైట్ చేసుకోండి….అందులో ఎవ్వరు గెలిస్తే వారు నూనె అంటాలని… తన బుర్ర మీద మాత్రం కోపం చూపి తబలా వాయించకూడదని….
నాకు ఇవ్వన్నీ తెలియవు.
ఎవరైతే ఏమిటి? పైపెచ్చు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం గమ్మున మూలకుండటం ఉత్తమం అనే అభిప్రాయం. అందుకని నేను వెంటనే ఆవిడకు “కానీయ్యండి..” అని పక్కకు వచ్చేశాను.
ఈ నాటకం చూడాలనే మావగారు నన్ను ‘నూనె రాయ్యమ్మా వాడికి’ అంటూ ఆజ్ఞాపించటం గట్రా… ఉందన్నమాట! ఇంత స్క్రీన్ ప్లే నడిచింది. మూవీ పాపం వాళ్ళునుకున్నట్లుగా అవలేదు. ఇంతలో వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చారు… అయిపోయిందా అని.. ఏంటి అని నేను అడిగితె దాటేశారా విషయం… తాను నవ్వుతు “సంధ్య తెల్లజెండా ముందే చేతులో పెట్టుకు కూర్చుంది” అని ఒక నవ్వు నవ్వేశారు.
మా అమ్మాయి పుట్టిన రోజున నేను తప్పక ఆ ఆచారం పాటిస్తాను కానీ శ్రీవారికి మాత్రం మొదటి నుంచి ఈ నాటివరకు అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. అదేమంటే చిన్నవాళ్లకు చెయ్యాలని, పెద్దవాళ్లకు కాదు అని తప్పించుకుంటాను.
వెరసి అమ్మాయిలకు అత్తారింట్లో ఎన్ని స్క్రీన్ ప్లేస్స్ ఉన్నా చేతిలో తెల్ల జెండా, పెదాలమీద చిరునవ్వే శ్రీరామ రక్ష కదండీ!ఈ రోజు తనకి గిఫ్ట్ తీసుకురావటం కుదరలేదు నా పూజలు, జపాలు హడావిడిలో… అందుకే ఏమైనా స్పెషల్ చేద్దామని గారెలు,బూరెలు, చేశాను. వాటితో పాటు ఆలు వేపుడు, ఆకుకూర పప్పు, మూలకాడ చారు, ముక్కల పచ్చడి, బియ్యపు రోట్ట అప్పడములు చేసి వడ్డించాను. ఉదయమే మా భోజన భోజులకు పెసరట్టు ఫలహారం సమర్పించు కున్నాను అనుకోండి! ఈ విందు ఆయనకు, ఈ జ్ఞాపకాల కథలు మీకు!!పూర్ణం బూరెలకు నేను చేసిన రెసిపీ———————————-ముందుగా ఒక కప్ పెసరపప్పు నానపోసుకొని, ఆరు గంటల తర్వాత దాని పిండిలాగా మిక్స్ లో వేసి రుబ్బుకోవాలి.-అదంతా ఒక గిన్నెలో తీసుకొని కుక్కర్ లో ఇడ్లీ లు ఉడకబెట్టినట్లుగా స్టీమ్ తో ఉడకబెట్టాలి.-కుక్కర్ చల్లారాక ఉడికిన పిండి తీసుకొని మెత్తగా నలుపుకోవాలి.-ఒక కప్ బెల్లం, ఒక కప్ నీరులో ఉంచి, తీగ పాకం పట్టుకోవాలి.-ఈ మెత్తగా చేసుకున్న పిండిని ఆ పాకంలో వుండలు లేకుండా కలుపుకోవాలి.-కొద్దిగా ఏలకులు నూరి కలపాలి.-గట్టి పడ్డ ఈ మిశ్రమాన్ని పొయ్యి మీదనుంచి దించి, ఉండలుగా చేసుకొవాలి.-దోశ పిండి ఉంటె మంచిది. లేకపోతె బియ్యంపిండి, మినప పిండి సమపాళ్లలో కలిపి, అవి లేకపోతె మైదా, శనగ లేదా గోధుమ పిండి జారుగా కలుపుకోవాలి.-నూనె వేడిచేసి, కాగిన నూనెలో, రెడీగా ఉన్న పూర్ణం ఉండలను కలుపుకున్న పిండిలో ముంచి నూనెలో వేయించాలి. -ఇలా చెయ్యటానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. కానీ దీని మూలంగా పూర్ణం విచ్చుకు పోదు. అసలు పూర్ణం బూరెలు చెడిపోవటం అన్నది ఉండకుండా గ్యారెంటీ గా కుదురుతాయి. మీకు ఇంతకు మంచి తేలికపాటి రెసెపి వస్తే మీకు వీరతాడు. లేకుంటే ఇది ట్రై చేసి చూడండి.(వీరతాడు కు అర్థం కోసం చూడుడు: మాయాబజార్:))Happy Cooking