“ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే ” అని గీతాచార్యులు చెప్పారు.
సనాతన ధర్మం గతి తప్పి, చెక్కా ముక్కలౌతుంటే, అరాచకం ప్రబలి హైందవం 72 ముక్కలుగా అతలాకుతలమౌతుంటే, ధర్మం పునరుద్ధరించటము కొరకు
పరమాత్మ స్వయంగా మానవునిగా వచ్చిన అవతారమే జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు. మనందరం నేడు ఇలా మనగలుగుతున్నామంటే, అనాది అయిన సనాతన ధర్మము ప్రపంచంలో తలెత్తుకు జయకేతం ఎగురవేస్తోంది అంటే- అది జగద్గురువుల భిక్ష.
అయన జన్మించినది క్రీస్తు పూర్వం 507 అయినా, జన్మ సంవత్సరం గురించి వివిధ వాదనలు ఉన్నాయి. శంకరుల గురించి మనకు ప్రామాణికంగా లభిస్తున్న గ్రంధం శ్రీ మాధవ విద్యారణ్యులు రచించిన “శంకరదిగ్విజయం”. ఈ గ్రంధం మూలంగానే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.
32 సంవత్సరాలు మాత్రమే జీవించిన శ్రీ ఆదిశంకరులు, సమస్త భారతావనినీ నలుమూలలా సంచరించి, అవైదిక మతాలను ఖండించి, సర్వ సమ్మత అద్వైతమును స్థాపించారు. నాలుగు మూలలా నాలుగు మఠాలు స్థాపించి, నలుగురు శిష్యులను నియమించారు. ఆ మఠాలు దీపస్తంభములవలె నేటికీ హిందూ మతానికి దారి చూపు తున్నాయి.
శంకర భగవత్పాదులవారు వివిధ దేవి,దేవతా స్తోత్రాలను రచించి మనకందించారు. నేటి మన నిత్య పూజ, మన జీవనం ఇలా సాగటానికి వారే ప్రథమ కారణం అని చెప్పవచ్చు. పరమాత్మను చేరటానికి సంసారికి కర్మభూయిష్టమైన జీవితంలో, నిత్య పూజ ఎంతో ఉపయోగపడుతుందని శంకరులవారు మనకు ఆ విధి విధానం అందించారు. మన జీవితాలు తరింపచేయటానికి అవతరించిన మహాదేవుడు శ్రీశంకరభగవత్పాదుల వారు అనటానికి ఇంతక మించి ఏమి నిదర్శనం కావాలి?
“గురుస్తుతి, గురువాష్టకం, గణేశ స్తోత్రాలు, దారిద్ర దహన గణేష స్తోత్రం, సంకట నాశన గణేష స్తోత్రం, వివిధ శివ స్తుతులు 31, విష్ణువు స్తోత్రాలు 19, దేవి స్తోత్రాలు 31, హనుమాన్ పంచరత్నం, సుభ్రమణ్య భుజంగ స్తోత్రం, గంగ, యమునా, నర్మదా స్తోత్రాలు, మణికర్ణికాష్టకం, కాశీ పంచకం, ప్రాతస్మరణ స్తోత్రాలు, మోహముద్గరం (భజగోవింద స్తోత్రం) ఉపదేశ పంచకం వంటి ఎన్నో పంచకాలు, అద్వైత పఞ్చరత్నం, దశశ్లోకి, ఏకశ్లోకి, నవరత్న మాలిక స్తోత్రం, ఆత్మబోధ, వేదాంత డిండిబి, తత్వోపదేశం, ఇలా దాదాపు 139 వరకు రచనలు చేశారు.
వేదాలకు, వేదాంగాలకు, ఉపాంగాలకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాసి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. హిందూజాతి మనుగడను బలంగా పునప్రతిష్టించడానికే ఈ భారతావనిలో ఉధ్బవించారు జగ్దగురువులు ఆదిశంకరుల వారు.
వారు రాసిన వాటిలో సౌందర్య లహరి గురించి నాలుగు మాటలు:
“సౌందర్య లహరి” ఈ రచన గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి.
శంకరులు కైలాసం వెళ్ళినప్పుడు అమ్మవారు ఆయనకు ఈ సౌందర్య లహరి ఇచ్చిందని, అంత పవిత్ర మంత్ర శాస్త్ర గ్రంథం నరులకు దక్కటం నిష్టం లేక నంది తీసుకొన ప్రయత్నించినగా…. దక్కినవి సగం పట్టుకు శంకరులవారు భూలోకము వచ్చారని, అందువల్ల దక్కినవి సగము మాత్రమేనని అంటారు. ముందు 49 శ్లోకాలను అమ్మవారు చెప్పినవని అందుకే వాటిని “ఆనంద లహరి” అని అంటారు. తర్వాత 51 శ్లోకాలని సౌందర్య లహరి అని, అవి జగద్గురువులు కూర్చారని పేరు.
మరొక కథ,
“ఆనాటి అద్వైత సిద్ధాంతం ప్రతిష్టించటములో, శంకరుల మీద ఎన్నో వదంతులు వ్యాప్తిచెందబడ్డాయి.
అందులో ఒకటి “శక్తి లేదని శాక్తేయులతో వాదన చేశారని”.
అలాంటి సందర్భంలో ఒక నాటి సాయంత్రాన జగద్గురువులు కాశీ లోని ఆశ్రమము నుంచి సాయంత్రం వేళ అలా నడుస్తూ వెళ్తున్నారట.
ఆయన చీకటి పడుతున్న వేళకు దారి తప్పి వెళ్లి ఒక ఊబిలో చిక్కుకున్నారట. దిక్కుతోచక శంకరులు చూస్తుంటే, అటుగా ఒక వృద్ధ స్త్రీ మూర్తి వచ్చినదిట. శంకరులు ఆమెను బయటకు వచ్చుటకు సహాయం అడిగారట. ఆమె “శక్తి లేదని అంటివిగా. నీకు నీవై వచ్చేయి” అన్నదట. కొంత సేపటికి ఎందరో దేవతా మూర్తులు, శివుడు వచ్చి ఆమెలో ఐక్యం అవటం శంకరులు చూశారుట. ఆయన తన తప్పు తెలుసుకున్నారని, తర్వాత ఆశ్రమానికి వచ్చి “సౌందర్య లహరి” రాశారని అంటారు.
అందుకే మొట్టమొదటి శ్లోకం లోనే,
”శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ,
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి “(సౌ.ల.-1)
“శక్తి లోపించిన శివుడైనా కదలలేదు” యని మొదలుపెడతారు.
సౌందర్యం అంటే అందం.
సు +నర = సుందర గా మారిందని బాషా శాస్త్రజ్ఞులు అంటారు. సౌందర్యమునకి అర్థం సుందరం అని తేలిక గా అనుకోవచ్చు.
లహరి అంటే అల. సముద్రములో అలలు కలిగితే అందం. అది నిరంతర ప్రవాహానికి, కదలికకు, జ్ఞానానికి, ప్రాణానికి, మార్పుకు సంకేతం కదా!
ఇక్కడ చెప్పింది అమ్మవారి గురుంచి కదా! సదా కదులుతున్న సౌందర్యమైన, చైతన్యము అమ్మవారు.
ఏమిటి సౌందర్యం?
అమ్మవారు నా?
అవును, అమ్మవారు ‘లలితా పరమ భట్టారిక’ అంటే సౌందర్యం కదా మరి. అది ఎలాంటి సౌందర్యం? లావణ్యాము అతిశయించిన అందము. అమ్మవారి లావణ్యము వర్ణనకు అందనిది. నిరుపమానాతిశయించిన నిరాపేక్ష సౌందర్యము.
లోకంలో కురూపిలుంటారు. కానీ, కురూపి అమ్మ ఉండరు.మరి అమ్మల కన్న అమ్మకు, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన అమ్మవారు మరింత అతిశయించిన సౌందర్యం లో ఒప్పుతుండటం అంటే అది సహజమే కదా!
సౌందర్యం అంటే అదేనా?
అదే కాదు, శ్లోకాలలోని కవిత్వము అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు శంకరుల వారు ఆనందముతో విశ్వరూపము దాలుస్తారేమొ. అందుకే ప్రతి శ్లోకాలులో పదాలు అత్యద్భుతంగా అమరి అందమైన పూలగుత్తి వలె బాసిల్లి చదివే వారికీ అనంతమైన ఆహ్లాదాన్నిస్తాయి.
సౌందర్యమంటే అంతేనా?
కాదు, మహా మహిమాన్వితమైన సౌందర్యలహరి యథార్థంలో మంత్ర తంత్ర శాస్త్రము. నిష్ఠగా సంపుటి చేసిన వారి సర్వమూ అమ్మవారే చూసుకుంటుంది.
అంతేనా?
కాదు.యందలి నిబిడీకృతముగ యున్న సౌందర్యం ఆధ్యాత్మికం. అది చదివిన వారికి అనుభవమే. ప్రతి శ్లోకం లోను గూఢమైన, అంతరార్ధము తీసుకున్న వారు అమ్మవారి పదములు విడువరు. తేలికగా అమ్మ సాన్నిధ్యం అందించు అత్యంత అద్భుతమైన గ్రంధం సౌందర్య లహరి.
పూజ్య గురువు ఎక్విరాల కృష్ణమాచార్యులు వారు తమ శిష్యులకు నిరంతరం చదుకొనమని ఇచ్చిన 3 శ్లోకాలు కూడా ఈ సౌందర్యలహరి నుంచే.
అవి 3-15-1
నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం శ్రీ చాగంటి వారిని కలిసినప్పుడు వారు నాకు సౌందర్య లహరి లోని ఈ శ్లోకమునే ప్రతి రోజు చదుకోమ్మని చెప్పారు.
“అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీజడానాం
చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ .
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతీ “(సౌ.ల.-3)
ఇన్ని అద్భుతమైన స్తోత్రాలలో ఏ ఒక స్తోత్రము పట్టుకున్నా చాలు మన జీవితాలు పండించుకోవడానికి.
కాదంటే సౌందర్యలహరిలోని ఒక్క శ్లోకము చాలు.
అసలు అమ్మ పదములు మనమున తలచినామంటే చాలా అదృష్టవంతుల మని అర్థమట.
మన జాతికి ఎంతో మేలు చేసి, ‘జగద్గురువు’లని నామం ఉన్న ఒకే ఒక్క గురువులు “శ్రీ ఆది శంకరులు”.
వారి జయంతి వైశాఖ శుద్ధ పంచమి(April-20).
ఆ రోజు మనం గురుదేవుని తలుచుకొని, ప్రణామాలర్పించటం మన కనీస ధర్మం.
“సదాశివ సమారంభం
శంకరాచార్య మధ్యమం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం”
ఈ సందర్భంగా ఈశ్వర సన్నిధిలో వున్న నాకు జన్మ నిచ్చిన కన్నతల్లి, జ్ఞానము నిచ్చిన గురువులు, నేడు నా ఆధ్యాత్మిక అభ్యుదయానికి చేయి పట్టి నడుపిస్తున్న దేవిదాసు గురువులతో పాటు నాకు సౌందర్య లహరి రాగయుక్తంగా నేర్పించిన వసంత గారికి కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను..
“సర్వేజనా సుఖినో భవంతు”
సంధ్యా యల్లాప్రగడ