నాయనమ్మ మడి – తిప్పలు

మా పుట్టింట్లో చాలా మడి.. దడినూ … అందుకే మేము అసలు వంటింటి ఛాయలకు కూడా వెళ్ళేవాళ్ళము కాము మా చిన్నప్పుడు. ఏమి ముట్టుకుంటే ఎమి అక్షింతలేస్తారోనని భయం… అందునా మా నాయనమ్మ వున్నప్పుడు మరీనూ ఈ గొడవ ఇంకా కొంచం ఎక్కువయ్యేది. ఆవిడ మా ఇంట్లోనే ఉండేది,చాలా మటుకు,  బాబాయిలు దగ్గర అప్పుడప్పుడు ఉండి వచ్చేది. ఆవిడ వూరు వెళ్లిందంటే మాకు అందునా నాకు చాలా హ్యాపీగా ఉండేది.

నాయనమ్మ వంట గది ఎప్పుడూ తుడుచుకోవటం, పొయ్యి కడుక్కోవటం, కడిగిన పొయ్యి తుడిచేందుకు మరొక ‘మడి బట్టా’ అంటూ ఏవి తాకనిచ్చేది కాదు. ఆవిడ పెద్దదయ్యే కొద్దీ ఈ పిచ్చి చాదస్తం కూడా మర్రిచెట్టు తొర్రలా పెరిగిపోతూ వచ్చింది. ఆ పిచ్చి మడిగోలతో  మమ్ములని నాయనమ్మ మూడు చెరువుల నీరు త్రాగించేది. అసలు మంచి నీళ్ళు త్రాగటానికి వంటగదిలోకి వెళ్ళాలన్నా కూడా మాకు భయమేసిపోయేది.
స్కూలు డ్రెస్సుతో వంటగది లోకి రాకూడదు, ఆవిడ ఆరవేసుకునే చీర వున్న చోటకు మేము వెళ్ళకూడదు, ఇలాంటి తలా తోక లేని నిబందనలు పెట్టేది. చివరకు ఇళ్ళు తుడుచుకునే బట్టనై సరే మేమెవ్వరమూ తాకకూడదు….తెల్లారకముందే లేచి స్నానాదులు చేసి,ఒక సోలెడు కాఫీ అమ్మ చేత ఇప్పించుకొని,ఈ కడుగుడు కార్యక్రమము మెదలెట్టేది.తుడిచినదే… తుడుస్తూ, కడిగినదే కడుగుతూ,  వంటచేసుకొని, దేవుడి అర్చన చేసి, మహానైవేద్యం పెట్టేవరకు మాట్లాడేది కాదు.. దానితో మధ్యలో ఎమైనా కావాలన్నా సైగలతో ఒక చిన్నపాటి డ్యాన్సు చెసేది వంటగదిలో. అమ్మ చాలా ఓపిక వున్న మనిషి. చాలా కామ్ గా అన్నీ అమరుస్తూ వుండేది నానమ్మకు.
స్కూల్ కి వెళ్ళే మాకు ఏమైనా పెట్టాలని అమ్మ వంటగది బయట కుంపటి మీద అన్నం వండి గోంగూరతోను, పెరుగుతోను తినమని మాకు విడిగా పెట్టేది.
స్కూల్ ఉన్నప్పుడు ఆమె మూగ డాన్స్, మేము మా డాన్స్ లతో మా ఇల్లు ఒక కిష్కిందే అనుకోండి.  పాపం అమ్మ మధ్యలో మూగ ప్రేక్షకురాలు. అలాంటి చాదస్తపు ఉదయాలకు కొంత హెల్ప్ గా నాన్న గారు ఒక స్పాంజ్(క్లీనింగ్ కోసము) తెచ్చారు. దాంతో ఎంత కావాలంటే అంతగా తుడుచుకోమని, దానికి మడి మైల అంటవని నాయనమ్మకు చెప్పి వప్పించారు. ఆ రకంగా మా ఇంట్లో ఆ పసుపు పచ్చటి నలుచదరపు స్పాంజ్ ముక్కలు చాల ప్రాముఖ్యత సంతరించుకున్నాయి,ఎలక్షన్లలలో న్యూట్రల్ వోటర్లలా.

నానమ్మ చాదస్తాల మధ్య పెరిగిన నాకు వివాహమై తరువాత, అత్తగారి ఇంట్లో సర్వం జగన్నాథ పద్ధతి విచిత్రంగా ఉండేది. కాని పదవ తరగతి తరువాత వేసవి సెలవలలా,
హస్టళ్ళలో వున్న పిల్లలకు అమెరికా వచ్చేసింనంతటి స్వేచ్ఛ వచ్చింది. “అంటూ-సొంటూ” అని గొడవలు లేవని వూపిరి పీల్చిన మాట వాస్తవమైనా, వీళ్ళకి ఒక పూజా లేదు, పునస్కారం లేదని వెలితిగా వుండేది.

నా పెళ్ళైన తరువాత, ఒక నెల రోజులలో మేము హైదరాబాద్ లో ఒక చిన్న ఫ్లాట్ లో సెటిల్ అయ్యాము. శ్రీవారు అహమ్మదాబాద్ లో చదువుకొని  వచ్చారు. ఆయనకీ గుజరాతీ వంటకాలు చాలా ఇష్టం. నాకు  ఆంధ్రా, తెలంగాణనే సరిగా చెయ్యటమే రాదు, ఇంక పరాయా అంత సీను లేదు ……. అని నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. అందుకని పాపం తను ఎక్కడ్నుంచో ఎవ్వరు గుజారితీ డిష్ చేసినా, లేదా గుజరాతీ హోటల్ నుంచి తెచ్చుకునేవాడు.  నేను తన కోసం అవి వండాలని చాలా ఆశ పడేవాడు . నేను  కమిట్ అవ్వకుండా,  ‘అలాంటివి వండటానికి చాలా టైం ఉంది, ముందు మన వంటలన్నీ నేర్వనీరాదడండీ’ అని సాగదీసేదాన్ని. నాకు మామూలు వంటలు కూడా సరిగ్గా తెలియని ‘బాల దశ’ అది మరి. ఒక సారి ఇలాగే బీన్స్ కూర ఎలా చెయ్యాలి అని ఆలోచించి,చించి, ఎంతో తెలివిగా వండి వడ్డించాను. తాను లంచ్కు రాగేనేనూ.తను మాములుగా గుటకు మంటున్నా నాకు ముద్ద దిగితే వట్టు. ఆ కూర పరమ ‘యాకు ‘ పరమ చెత్తగా ఉంది. తనతో ఎలా తిన్నారు  కూర అంటే, నాకు బానే ఉంది అన్నాడు.
చాలా భోజన ప్రియుడైన శ్రీవారుపాపం నా వంటతో అలా ఉప్పు లేని కూరా, ఉడకని పప్పుతో గడుపుతున్న క్రొత్తగా పెళ్ళన ఆ రోజులలో మా నాయనమ్మ మా కొత్త కాపురం చూడటానికి ఇంటికి వచ్చింది.
ఆవిడ వచ్చి ఒక రాత్రి ఉంది. నాకు చచ్చే టెన్షను. ఆవిడకు విపరీతముగా మడి. శ్రీవారికి ఏమీ తెలియదు వాటి గురించి అని. నేను గండము గడవనీయి దేవుడా అని బిక్కు బిక్కు మంటూ బిక్క చచ్చి వుండిపోయాను.
ఉదయం శ్రీవారి ని ఆఫీసుకు తోలేసి,కిచను శుభ్రం చేసి నాయనమ్మకు హండోవరు చేసేశాను. ఆవిడ దాన్నే మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తూ, కడిగిన దాన్ని కడుగుతూ, హైరానా పడుతూ వండుకొని, నైవేద్యం పెట్టుకొని తిని ఆ రోజు కానిచ్చింది. హమ్మయా అనుకున్నాను నేను.

ఆ రోజు సాయంత్రం నేను శ్రీవారు ఆఫీసు నుంచి వచ్చాక అంతకు ముందురోజు ఎదురింటి మామి ఇచ్చిన  డోక్లా పెడదామని చూస్తే కాళీ బాక్స్ దర్శనమిచ్చింది.  ఇదేంటబ్బా అని అమ్మని అడిగితే తెలీదు అంది.మరి నానమ్మ ఇలాంటివి అసలు ముట్టుకోదుగా, ఎమైందబ్బా అని డౌట్ గా, “నానమ్మ ఈ డబ్బాలో డోక్లా అని యెల్లో కలర్ ది ఉండాలి చూశావా” అంటే- అప్పుడు పేల్చింది బాంబు ఆవిడ!“అదా  స్పాంజ్ , వెదవ స్పాంజ్ తెచుకున్నారేంటి? మంచి సామాను కొన్నుకోవటం కూడా రాదు., చదివారు మళ్ళీ ఇంజనీయరులు, లాయర్లునూ, ఎలాంటి వస్తువు కొనుక్కోవాలో కూడా తెలియదు” అంటూ అక్షింతలు వేసింది..ఆవిడకు వంట గది శుభ్రం చేసుకోవటానికి స్పాంజ్ కావాల్సి వచ్చింది. నాన్నగారు చేసిన అలవాటుకాదా మరి. ఈ నేపథ్యంలో మా పక్కింటి ఆవిడ చేశానని ఇచ్చిన  డోక్లా క్రితం రోజుది ఉంది వంటగది అలమరాలో … సీజనింగ్ విడిగా, డోక్లా విడిగా ఉంచుతారు మాములుగా . అది సర్వ్ చేసి ముందర సీజనింగ్ వేసి ఇస్తారు.నానమ్మ వచ్చింది అదే రోజు. ఆ హడవిడిలో నేను దాని సంగతి ఆ రోజుకు మర్చిపోయాను.  మనవరాలు ఎల్లా ఉందో చూద్దామని వచ్చిన నాయనమ్మ రాత్రికి ఉండిపోయి, ఉదయం అలవాటు ప్రకారం కిచెన్ గట్టు బాగానే ఉన్నా చాదస్తంగా  కడుక్కోవాలి, అంటూ తుడిచినదే తుడుస్తూ, స్పాంజ్ కోసం వెత్తుకొని అలమరాలో బాక్స్ లో ఉన్న డోక్లాను చూసి స్పాంజ్ అనుకొని, దాన్ని పర పరా కిచెన్ గట్టుకు పులిమేసి,పాడైన స్పాంజ్ తెచ్చుకున్నారని, పిల్లలకి మంచి సామాను కొనటం కూడా రాదని,(మాట్లాడదుగా తినేంతవరకు) మమ్ముల్ని మనసులోనే కోప్పడి, వంట చేసి మహానైవేద్యం పెట్టుకొని, (ఆవిడా దేవుడిని సదా కూడా తెచ్చుకుంటుంది) తాను తిని, కిచెన్ మాకు వదిలేసింది.అలా  మా నాయనమ్మ చాదస్తానికి హైలైట్ డోక్లాతో  వంటగది శుభ్రం చెయ్యటం. అప్పుడు మేము ఆవిడ బాధ పడుతుందని గమ్మున వూరుకున్నా, ఇంట్లో అందరూఎప్పుడు డోక్లా చూసినా  ఆ విషయము గుర్తు చేసుకు  నవ్వేస్తాము.

ఇంతకూ డొక్లా రెసిపి చెబుతా ట్రై చెయ్యండి. చాలా తెలికే.

శనగపిండి ఒక కప్పు తీసుకొని 4 చెంచాల నూనె వేసి సరిపోయినంత నీరు, ఉప్పు, నిమ్మరసము, బేకింగు పౌడరు, ఉప్మా రవ్వ 1 చెంచా  వేసుకొని కలపాలి.

ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇదంతా ఒక నూనె రాసుకున్న గిన్నెలో పెట్టి, ఇడ్లీ లా స్టీమ్ తో ఉడికించాలి. 20 నిముషాలకు దించి వేరె కంచములోకి మార్చకేవాలి. తిరమాతకు, నూనెలో ఆవాలు, ఇంగువ, కొద్దిగా పచ్చి కొబ్బరి, పంచదార, పచ్చిమిర్చి వేసి ఈ డొక్లా మీద వేసి సర్వ్ చేయ్యటమే. మొత్తము 25 నిముషాలు పడుతుంది. మనం చేసేది 5 నిముషాలు. ట్రై చెయ్యండి.

Happy Cooking

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s