అమ్మా, నాన్నగారు మమ్ములను అందరిని తేడా లేకుండా ముద్దు చేసేవారు.. కానీ మా నాయనమ్మ మాత్రం తమ్ముడిని ఎక్కువ ముద్దు చేసేది. ఒక్క విషయములో ఇంట్లో రామ-రావణ యుద్దము నడిచేది, నానమ్మకు నాకు మధ్య.
ఆ విషయము ఏంటంటే….. ముద్దపప్పు. అవునండి. పప్పే. ముద్దపప్పు. ఉట్టి పప్పు అని కూడా అంటారు. అది ఎలాగంటే … ఇంట్లో ఏ నెలకో ఒక్కసారి మాత్రమే ముద్దపప్పు, పులుసు కాంబినేషన్ చేసేవారు, మిగితా రోజులలో ఆకుకూర పప్పు వండేవారు. పిల్లలకి ముద్దపప్పు ఎక్కువ ఇష్టముంటుంది కదా అందుకని మేము చాలా గోలే చేసేవారము. తమ్ముడు కూడా ఏడిచే వాడు పప్పు కావాలి అని. నానమ్మ వండేటప్పుడు వాడి కోసం మాత్రం ప్రత్యేకంగా కొద్దిగా అంటే కొద్దిగా కేవలం వాడికి మాత్రమే పనికి వచ్చేలాగాను పప్పు తీసి మిగిలిన పప్పులో ఆక్కుకూరనో, ఎదో ఒక కాయగూరనో కలిపేది. అందరం తింటుంటే వాడికి ప్రత్యేకంగా “తినురా నాన్న” అంటూ వడ్డించేది.
ఇంక స్టార్ట్ – నేను అరచి గీ పెట్టినా నాకొక్క పప్పు ముద్ద వేసేది కాదు. ‘ఒక్కడే నలుసు నాగన్న, పిచ్చి నాగన్న తిననీ ఇదైనా, నీవు ఆకుకూరపప్పు తింటావుగా.. వాడు అది తినడు’ అని సమర్ధించుకునేది.
ఎన్ని సార్లు ఉడుక్కున్నా, బ్రతిమాలీనా , గొడవ చేసినా పట్టించుకునేది కాదు. ఆవిడ చాలా మొండి మనిషి.
ఈ అసమానతలు తొలగించాలని, నాకు పప్పు లో భాగము కావాలని, నేను చెయ్యని ప్రయత్నం లేదు.
ముందుగా నాకేసే పప్పు తినటం మానేసి చూశాను, కరగలేదు కానీ నోట్లో కుక్కారు అన్నం. ఇలా కాదని వాడికి హితబోధ చేశాను.”చూడు ! నీకు నేనంటే ఇష్టం కదా! నానమ్మకు చెప్పు నాకు కూడా పప్పు వెయ్యమని ” అని.
వాడు ఒక దొంగ మొహంగాడు. నాతో సరే అని (కాదంటే ఎక్కడ రెండు పీకుతానో అని భయం) తింటున్నప్పుడు మాత్రము నోరెత్తితే ఒట్టు. ఎంత కళ్ళు ఉరిమి చూసీనా, గిచ్చినా, నేను చచ్చినా పట్టించుకునేవాడు కాదు. అదేంటిరా అంటే నానమ్మ ను చూస్తే భయం అనేవాడు, చక్కగా పప్పు నెయ్యేసుకొని మింగి మాయమయ్యేవాడు. ఇంక ఇలా కాదని ఆవిడతో ఒక రోజు డైలాగ్ ఓపెన్ చేశాను.
ఆడవాళ్లకు మొగవాళ్లకు పప్పు మీద సమాన హక్కులుంటాయని, కాబట్టి నాకు ముద్దపప్పు వెయ్యాలని. ఆవిడ వినిపించుకోలేదు. నేను చదివిన ఆంద్రభూమి ( మా ఇంట్లో వచ్చేది అప్పుడు) తెలివి తేటలు ప్రదర్శించి, ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు. నీవే నా శత్రువు అని దెబ్బలాడితే,వెధవ తేలితేటలు ప్రదర్శిస్తున్నావని బాగా సుద్దులు పెట్టింది. వూరుకోకుండా నాన్నకు నామీద పిర్యాదు కూడాను. నాన్న పట్టించుకోలేదు. ఒకసారి నేను గొడవ ఎక్కువగా చెస్తే అమ్మ నా అల్లరి భరించలేక నాలుగు అట్లు వడ్డించటము నేను ఏడుస్తూ మిగిలిపోయాను.
అలాంటి గొడవలు భరించలేక అమ్మ చెప్పేది “అక్షయ పాత్ర”ఉండాలి.
మీకు ఇంక ఈ గొడవ ఉండదని.
అందరికి భారతం కథ తెలిసే ఉంటుంది. భారతంలో ,వనవాసానికి బయలుదేరిన పాండవుల తోడుగా తండోపతండాలుగా ప్రజలు సాగుతారు. ధర్మజుడు వారించి, విఫలమై, వాళ్లకు తిండి తిప్పలు ఎలా రా బాబు, అని బాధపడుతుంటే వారి కులగురువులు దినకరుడిని ప్రార్థన చెయ్యమంటారు. ( ఆయనే కదా సర్వ ప్రాణులకూ ఆహారం అందిచ్చేది.) ధర్మజుడు సూర్యుని ప్రార్థించటం, అక్షయ పాత్రను పొందటం చక చకా జరిగిపోతాయి. ….. వండే పని లేకుండా.. రెసిపీల గొడవ లేకుండా, ఉప్పు ఎక్కువైనది, తక్కువైనది, గట్రా గొడవ కూడా లేకుండా, కుదిరింది కుదరలేదు లాంటి నస లేమి లేకుండా.. సరాసరి అడిగినవి అడిగినట్లుగా చకచకా మన ముందు గిన్నెలోకి, అట్నుంచి కంచంలోకి దిగితే అంతకు మించి హాయి ఏముంటుంది? నేను చెప్పెది ఏంటో మీకు అర్థమైపో యుంటుంది. అదే అక్షయ పాత్ర.
మనవాళ్ళు పెరిటి చెట్టు వైద్యానికి పనికిరాదని, పురాణాలన్నీ పుక్కిటిగా తీసివేసినా, అందులో ఉన్న విజ్ఞానం కావాల్సిన వాళ్ళు అందిపుచ్చుకొని, వారి వారి మేధను జోడించి కొత్త కొత్తవి కనిపెట్టి బజార్లోకి వదిలేస్తున్నారు. అవి ప్రజలకు పనికి వచ్చి వాడుకలో వచ్చాక, మళ్ళీ వీళ్లే “మా వాళ్ళు ఎప్పుడో చెప్పారు” అంటారు.
ఆ అక్షయ పాత్ర కాన్సెప్ట్ అన్నది భారతంలో ఉన్నా నేడు ‘అభినవ అక్షయ పాత్ర’ లాంటి ఒక వంటపాత్ర బజార్ లోకి విడుదలై సంచలనం సృష్టింస్తోంది. అదే “ఇనస్టాంటు పాంట్”. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. మీరు వాడుతూ కూడా ఉండి ఉండొచ్చు. ఇది తెలియని వారికి, ఉన్నా ఉపయోగాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటానికి, లేదా తెలిసినవి చెప్పాలనే ఉదేశ్యం.
చిన్న తేడా వుంది దీనికీ, పూర్వకాలపు పాత్రకు-
భారతం చెప్పిన అక్షయ పాత్రకు మీరు దినుసులు ఏమి ఇవ్వకుండానే కావలసినవి సృష్టించి ఇస్తుంది. మన అభినవ అక్షయ పాత్ర లో మనం చెయ్యవలసిన పదార్థం యొక్క దినుసులు దానికి సమర్పించి మనం ఎంచక్కా ఏ మాయాబజారో, మిస్సమ్మ నో చూస్తూ కాలక్షేపం చెయ్యవచ్చు. నిర్దేశిత సమయానికి అది చిన్న విజిల్ వేసి మనలను రమ్మని పిలిచి, కన్నుకొట్టి కూర్చుంటుంది.
మనం ముక్తాయింపుగా కొద్దిగా తీరగమాత మంచి ఇంగువతో పైన వడ్డించి , అలా తెచ్చి ఇలా సమర్పయామి అని తిండి తినే బల్ల (డైనింగ్ టేబుల్) మీదికి తెచ్చి అతిధులకు వడ్డిస్తే, తిన్నవారు తిరిగి అడుగుతారు కావాలని, కోరి మరి వేయించుకుంటారు. రెసిపీ అడిగితే చెప్పేది ఏముంది మన అక్షయపాత్ర ను చూపించటమే.
అమ్మా వాళ్ళు విసుగు విరామము లేకుండా అలా ఎలా వంటచేసే వారో రాత్రి, పగలు అర్దం కాదు. ఆ విషయమే అడిగితే అమ్మ నవ్వేసి “మీరు అక్కడ సర్వం చేసుకుంటారుగా, ఇక్కడ మాకు వంట ఒక్కటేగా చేసేది” అని అనేది.
చిన్నప్పుడు ఇలాంటివి వుండివుంటే నాకు ముద్దపప్పు కోసము తిప్పలు, తన్నులు తప్పేవి కదా అనుకుంటా.
ఇది నిజంగా చాలా సహాయకారి.
నేను చాలా కూరలకు, పులుసులకు, పప్పుకు ఇదే వాడుతాను. ఇందులో వంట సులభం. రుచి అనన్యం. చేయాల్సిందంతా కావలసినవి వేసి మూత మూసి కావలసిన బటన్ నొక్కటమే. నిజమండి. దీనికి గిన్నె కూడా స్టీలుది. అందుకే దిగులులేదు. నాన్ స్టిక్టు అంటే మళ్ళీ అదో గోల. రంగు పోయి సత్తు రూపము దర్శనమిస్తుందని.
ఇలాంటి పాత్రలుంటే నా చిన్నప్పటి పప్పు యుద్దాలు వుండవుగా అని అనిపిస్తుందనుకొండి.
ఇలాంటివి మన దగ్గర వుంటే మనమే నలభీములము, మరోటీనూ. ఇది ఇప్పుడు మార్కెటు అంతటా వ్యాపించి అందరి వంటిట్లోకి దూరి అందరిని ఆనందపరుస్తోంది. ఇండియాలో దొరుకుతుందో లేదో తెలియదు. కుదిరితే ట్రై చెయ్యండి. తప్పక ఇల్లాలి కి మంచి నేస్తం ఇది.
నేను ఇందులో నిన్న గుత్తి వంకాయ కూర చేశాను. చాలా తేలిక రెసిపి. రుచి బాగుందని అతిథులు మెచ్చారు.
వంకాయలు అర డజను తీసుకొని కడిగి + లా కోసుకోవాలి
1 కప్పు శనగ పప్పు
1 కప్పు మినపప్పు
1 కప్పు వేరుశనగలు
1/2 కప్ప ఎండు కొబ్బరి
1 చెంచా మెంతులు డ్రై రోస్టు చేసి ఎండు మిరప నాలుగు వుప్పు తగినంత వేసి పౌడరు చెయ్యాలి. అందులో కావాలంట్ ధనియాలు వ్సుకోవచ్చు. నేను ధనియా పౌడరు వాడాను. పసుపు ఇంగువ కూడా తగినంత కలపాలి.
నూనె పాట్ సో వేసి చిల్లి ఆప్షన్ సెలక్టు చేసుకొని, ఈ వంకాయలు, పౌడరు కలిపి వేసి మూత పెట్టటం. 35 నిముషాల తర్వాత పాట్ పూర్తి అవుతుంది. మూత తీసి కోతిమూర తో అలంకరించి వడ్డించటమే. గుత్తవంకాయ కూర చెవులూరిస్తూ మీ ముందు వుంటుంది.
Happy cooking
సంధ్యా యల్లాప్రగడ