మనం సెకండ్ హ్యాండ్ లో సామాను మాములుగా ఏది కొనము,వాడము, ఒక్క పుస్తకాలు తప్ప. ఇండియాలో అందునా హైదరాబాద్ లో సెకండ్ హ్యండు బుక్స్ కి మంచి గిరాకీ.
పుస్తకాలు తప్ప మనం సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎంత కొత్తగా, నాణ్యంగా, మన్నికగా వున్నా కొనటము, వాడటము ఎంతో చిన్నతనంగా భావిస్తాము. మీదుమిక్కిలి మన గౌరవానికి భంగం కూడాను అన్న నమ్మకము మన రక్తంలో జీర్ణించుకుపోయ్యింది.
నా చిన్నప్పుడు అక్క బుక్స్ నాకు బట్వాడా అయ్యేవి. తనకి చిన్నవైపోయిన స్కూల్ డ్రెస్ లు, పావడాలు కూడాను. నాకు మా చెడ్డ చిరాకుగా ఉండేది. కొత్తవి కావాలని పేచీ పెట్టి, మంచి బహుమతి గా పెసరట్లు వీపున వడ్ఢియించుకున్న చరిత్ర. ఏమైనా సెకండ్ హ్యాండ్ అంటే మనందరికి పరమ నచ్చని విషయం కదండీ.
కానీ అమెరికాలో అలా కాదు. ఇక్కడ ఒక నానుడి ఉంది ” one persons trash – other persons treasure” అని. అంటే ఏదైనా పనికిరానిదంటూ లేదని కదా వీరి ఉదేశ్యం. అందుకే ఇక్కడ “గరాజ్ సేల్” కి మంచి డిమాండ్.
నేను వచ్చిన వెంటనే గమనించిన విషయం, ఇండియాలో ‘గ్యారేజు’ అనే మాటను ఇక్కడ గరాజ్ అనటం.
వచ్చినా ఒక నెలకు మా అపార్టుమెంట్ భవన సముదాయంలో ఈ ‘గరాజ్ సేల్’ అని పెట్టారు. ఆ వారాంతరము అంతా తిరిగి చూసి వచ్చాము నేను, మా అమ్మాయి కలసి. మాకు నచ్చినవి అక్కడ బోర్డు గేమ్స్. మా అమ్మాయి దగ్గర ఆడుకోవటానికి చాల గేమ్స్ ఉన్నా దీని దగ్గర లేనివి అక్కడ ఒక 50 సెంట్లకు ఒకటి చొప్పున దొరుకుతుంటే, “ఆహా బలే మంచి చవుక బేరము మించిన దొరకదు…బాగుంది ఇది” అని బుట్టెడు కొని పట్టుకొచ్చాము. అప్పుడు ఈ గరాజ్ సేల్ కాన్సెప్ట్ అర్థమైంది.
ఇంక చూడండి, మాకు బాగా నచ్చిన చెక్క ఫర్నిచర్ కోసం ప్రతి వీకెండ్ నేను మా అమ్మయి తెగ తిరిగే వాళ్ళము మొదట్లో. ఏమి కొనక పోయినా ఎక్కడ గరాజ్ సేల్ అన్నా చూసి వచ్చేవాళ్ళం. మంచి ఫర్నిచర్ దాన్ని మన్నిక, రూపము, వాడుక పట్టి ధర నిర్ణయిస్తారు. మన వూర్లో కోటి, సుల్తాన్ బజార్ లోలా బేరం కూడా చేసుకోవచ్చును.
మేము సొంత ఇంటికి వచ్చాక మా అమ్మాయి తన పాకెట్ మనీ కావాల్సినప్పుడల్లా, గరాజ్ సేల్ అనేది. వద్దే బాబు అంటే వినేది కాదు. దాని ఎలిమెంటరీ స్కూలు బుక్స్, డ్రెస్సెస్, గేమ్స్ అమ్మకానికి పెట్టి, అమ్మినవి అమ్మగా, మిగిలినవి తీసుకు వెళ్ళి డొనేషన్ కి ఇచ్చేసేవారము. అంతే కానీ అట్టేపెట్టుకోవటం ఇంక ఉండదు.
అసలు ఇక్కడ ప్రతి ఏప్రిల్ లోను స్ప్రింగ్ క్లీన్ (వసంతలో శుభ్రం చెయ్యట) అని మొదలెడతారు. ఇంట్లో పనికి రానివి అన్నినూ కట్ట కట్టి గరాజ్ లో పెట్టి, కొద్దిగా వేసవి మొదలు కాగానే ‘గరాజ్ సేల్’ పెట్టేస్తారు. ఒక సంవత్సరం అసలు వాడక పొతే అది అక్కర్లేనిదిగా భావించాలని చెబుతారు.
ఇలాగైతే మన తాత ముత్తాతల నాటి మన గంగాళాలు, ఇత్తడి సామాను పూర్వకాలపు పెట్టె మంచాలు చూసి ఏమందురో. కానీ, అసలు వాడనివి ఉంచుకోరు ఒక రకంగా.
అది ఒక విధమైన కాన్సెప్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం తర తరాలుగా వచ్చే సంపద అది పుత్తడి కానీయండి, ఇత్తడికానీయండి అంత తొందరగా వదిలెయ్యం కదా. చాలా పాతది అంటే ఒక 100 సంవత్సరాలకు మించినది అయితే మళ్ళీ పురాతన వస్తువు క్రింద జమకట్టి, లక్షలకు లక్షలు పోసైనా కొంటారు.
ఈ గరాజ్ సేల్ లో ముందుగా, ముఖ్యంగా అమ్ముడుపోయేవి చెక్క సామనే. చెక్క బీరువాలు, అలమారాలు, కుర్చీలు, బల్లలు, తరువాత ఫ్లవర్ వాజులు, కప్పులు, సాసర్లు, ఇత్యాదివి అన్నమాట!
దాదాపు 4 సంవత్సరాల పూర్వం వరకు క్రేగులిస్ట్ అన్న అంతర్జాల వెబ్సైటు లో ఈ విధమైన ప్రకటనలు వచ్చేవి. అమెరికా లోని అన్ని నగరాలలో పూర్తిగా విస్తరించి ఉండేవి ఈ క్రేగ్ లిస్టు. ఏదైనా ఊరు వెళ్లగానే ఆ క్రెగ్ లిస్ట్ లో చూసుకొని చాల మంది వస్తువులు తెచ్చుకొని జీవితం మొదలెట్టేవారుట ప్రజలు.
ప్రస్తుతం FB లో వారి వారి ఊరికి, వాడలకు కౌంటిలకు సంబంధించిన యార్డు సేలు గ్రూపులు వచ్చి, క్రేగ్ లిస్ట్ వాడకానీ తగ్గించిందని చెప్పాలి.
మొత్తానికి ఏది కూడా అవసరం కానిది లేదని, ఒకరికి పనికి రానిది వేరొకరికి అవసరపడగలదని ఇక్కడ సర్వత్రా నిరూపించపడుతున్న విషయం. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపార ప్రకటనలలో చూశాను, ఇలాటివే వెబ్సైటులు వచ్చాయని. ఎంతవరకు ఉపయుక్తంగా ఉన్నాయో అవి, అన్నది మీరే చెప్పాలి.
మొత్తానికి మన ఇంటి గరాజ్ నుంచి, మన ఇంటి ముందు ఉన్న యార్డ్ నుంచి, అంతర్జాల యార్డ్ సేల్ వరకు పాకినా, ప్రపంచం లో పనికి రానిది అంటూ ఉండదని, అవకాశం పట్టి, అవసరం పట్టి వస్తువు వాడకం మారుతూ ఉంటుందని మరల మరల నిరూపించబడుతున్న సత్యం, ఇలాంటి గరాజ్ యార్డ సేల్ వలననే కదా!
Sandhya Yellapragada
