ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం –
పూర్వం చందమామ కథలలో మనందరము చదువుకున్నాము కదండి సత్రాల గురించి. అదే నేటి ఆధునిక ముసుగేల కున్న airbnb.
వివరాలలోకి వెళ్ళిపోయ్యామంటే –
మేము మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కు వెళ్ళాలన్నప్పుడు ఐదు నెలల ముందుగా హోటల్ బుక్ చేసుకునే ప్రయత్నం చేశాము. అసలు మామూలుగానే డౌన్-టౌన్ లోని హోటల్స్ లో ముఖ్యమైన రోజులలో కిటకిటలు, ఆకాశానికి ధరలు సర్వ సాధారమైన విషయం. ఈ నాలుగు సంవత్సరాలలో చూసినదేమంటే, క్యాంపస్ దగ్గరగా ఉన్న హోటల్స్ ఏమో చుక్కలో ధరలు, మేము తప్పక ఉండవలసి రావటం జరుగుతూనే ఉన్నది. ఈ సారి మాత్రం మాకే కాక, ఆ రోజుకు వచ్చే తమ్ముడికి, వారి కుటుంబానికి, అక్కయ్య పిల్లలకి కూడా బుక్ చేయాల్సి రావటం, అంతా కలసి మోపడవుతుందని ఆలోచనలో పడ్డప్పుడు, మా అమ్మయి చెప్పిన ఉపాయమే ఈ AIRBNB.
Airbnb లో ఖర్చు తక్కువ, చక్కటి గృహ వాతావరణంలో మనం ఉండొచ్చు. కాకపొతే మనకు రూమ్ సర్వీస్ లాంటి సౌలభ్యం ఉండదు. ఈ ఆతిధ్య రంగానికి చెందిన కంపెనీ పని చేసే విధానం, కొద్దిగా uber పద్దతే. అంటే మన ఇల్లు లో కొంత, లేదా పూర్తీ భాగం సర్వాంగ సుందరంగా అలంకరించి, మనం వాడుకునేబదులు, కోరిన అతిధులకు ఇస్తామన్నమాట, రోజుకు (airbnb)వారు నిర్ణయించిన ధరకు. నేటి రోజున బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ airbnb లో రెంటు తీసుకోవా లన్నా,ఇవ్వాలన్న ముందుగా మనకు వారి వెబ్సైటు లో అకౌంట్ ఉండాలి.
మనం ఉండబోయే ఇంటి యజమాని కి, వారి అందించే సౌకర్యాలను బట్టి, శుభ్రత, వారు అందించే ఆతిధ్యం బట్టి రేటింగ్ ఇవ్వబడుతుంది. ఈ airbnb లో మనం రెంట్ తీసుకోవాలన్నా మన అకౌంట్ కు ఉన్న సీనియారిటీ బట్టి, మనం ఉండే పద్దతి బట్టి, పూర్వపు యజమానుల రేటింగ్ బట్టి, ఇస్తారు. అంటే కొత్తగా తీసుకునేవారికి కొద్దిగా ఇబ్బందే. ముందుగా మనము మన పూర్తి వివరాలు, లైసన్స్, కెడిట్ కార్డు వివరాలు వారిసి సమర్పించాలి.
మంచి శుభ్రమైన వాతావరణం, తక్కు ధరలో వసతి, గృహ వాతావరణము వలన ఈ airbnb వ్యవస్థ బాగావృద్ధి చెందటానికి కారణం. డబ్బు అవసరమున్నా, ఎక్సట్రా ఆదాయము కావల్సిన వారికి ఇది కామధేనువు. నెలకు తక్కువకు ఇచ్చె బదులు పూర్తి పర్నిష్ చేసి ఇలా ఇవ్వటము వలన రాబడి పెరుగుతుంది.
తొలుత 2008 లో ‘జో గుబ్బియా’ అన్న పెద్దమనిషికి కు వచ్చిన ఒక ఆలోచన నేడు కొన్ని కోట్ల వ్యాపారానికి దోహద పడి ఇలా వృద్ధి చెందింది. రెంటులో వారికి కొంత శాతం అందచెయ్యవలసి వుంటుంది.
airbnb లో భాగస్వాములుగా ఎవ్వరన్నా చేరవచ్చు. మీకు సొంతమైన ఇల్లు మీరు వాడకం లేక ఖాళీ గా ఉన్నట్లైతే, లేదా అద్దెకు ఇవ్వాలంటే, మీరు పూర్తిగా దానిని అలంకరించి బాడుగకు ఇవ్వచ్చు. దీనికి గాను, airbnb వారి వెబ్సైటు లో ఒక అకౌంటులా నమోదు చేసుకోవాలి. దాంట్లో ఉన్న లొసుగులు( సంవత్సరము మొత్తం అది వాడకంలో వుండక పోవచ్చు) దానికి ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా బాగా పుంజుకుంటున్న వ్యాపారమిది. ఇండియా లో కూడా చాలా నే వాడుకలో వచ్చింది ఇది.
మేము మొన్న ఫిలాడాల్ఫియా లో మొదటిసారిగా వాడాము. మా అమ్మాయి మాత్రం గత ఐదు సంవత్సరాలుగా వాడుతోంది.
రెండు విశాలమైన బెడురూమ్స్, ఒక వంటగది, వాడుకోవడానికి వంట సామాను తో ఎంతో అనువుగా ఉంది మేము తీసుకున్న ఇల్లు. కాలేజీ కి దగ్గరగా ఉన్ననూ, మాకు ఆ కాలనీ(neighborhood), వాతావరణం కొత్త గాబట్టి మేము కొంత భయపడ్డాము.
కానీ, ఆ గృహ యజమాని చాల స్నేహంగా, చాలా కేరింగ్ గా ఉంది. ఆమె జింబాబే నుంచి వచ్చిన నల్లజాతి వనిత. మేము గ్రాడ్యుయేషన్ కు వస్తున్నామని ముందే చెప్పి ఉన్నందున, మేము వెళ్లే సరికే “గ్రాడ్ కి స్వాగతం” అని స్వాగత పు పోస్ట్ తో, కప్ కేక్ లతో భోజనపు బల్ల అమర్చినది. మేము చూడగానే పులకరించిపోయాము. ప్రతి రోజు మా బాగోగులు కనుకొవటము, ఉన్న వారం రోజులు మమ్ముల్ని కనిపెట్టుకున్నది.
కారు పార్కింగ్ డౌన్ టౌన్ లో పెద్ద సమస్య. ఎక్కడైనా రెండు గంటల కన్నా ఎక్కువగా వాహనము నిలుపలేము. అలా నిలిపితే మనకు టికెట్ తప్పదు. మేము ఉన్న ఇంటి వారు మాకు పార్కింగ్ కూడా సహాయం చేశారు.
మేము ఒక రోజు పార్టీ అయ్యాక పిల్లలు పెద్దలు అలసి, వచ్చి అడ్డదిడ్డంగా అరుపులు నవ్వులతో అల్లరిగా సరదా గడిపాము అంటే, (తమ్ముడి కుటుంబం, అక్కయ్య పిల్లలు అంతా) ఒక చోట ఉండగలిగామంటే మేము చేసుకున్న ఈ airbnb ఇల్లు ఏర్పాటే. పెద్ద వంటగది కూడా ఉన్నందున, నా కూడా నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, సున్ని పొడి, నెయ్యి ఆవకాయ తీసుకు వెళ్లినందుకు, ఎంత బయట తిన్నా రాత్రి అంత మళ్ళీ అన్నం తో పెరుగు ఆవకాయ్ లాగించి, ఇంటిని గుర్తుచేసుకో కుండా గడిపేశారు అంతా. వారి ఇంటి శుభ్రత కూడా చాల ఎన్నతగినది. సౌకర్యవంతంగా, సరదాగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మా వారం రోజులు అక్కడ గడిపేశాము.
హైదరాబాద్ లో మా ఫ్లాట్ కూడా ఇలా airbnb కి ఇవ్వమని మా మిత్రులు మాకు సలహా ఇచ్చారు. ఇలా చెయ్యటానికి పక్క న ఒకరుండి చూడాలని నా అభిప్రాయము, అందుకే వద్దనుకున్నాను. అది కాక మొన్ననే లక్షలు పోసి రిమోడెల్ చేసుకున్న ఇంటిని మళ్ళీ ఎవరికో ఇవ్వటం నాకు కుదరని పని కూడా. నేను చూసుకోవటానికి కుదరదు కూడానూ.
నేడు ప్రపంచ వ్యాప్తంగా బాగా వ్యాప్తి చెందుతూ, తక్కువలో శుభ్రమైన, సులువైన గృహ వాతావరణం కావాలంటే airbnb సులువైన మార్గం. కుదిరితే మీరు వుండటానికి ప్రయత్నించండి.
ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు మీ సందేహం తప్ప ..