పుస్తకమా ఎక్కడ నీ చిరునామా?
రెండు వారాలకు మునుపు, నేను మిత్రులను అడిగిన ప్రశ్నలు, మీకు నచ్చిన నేటి కాలపు రచయితా/త్రి ఎవరు అన్ని. చాల మంది మిత్రులు సమాధానాలు చెప్పారు. ఒక్క విషయం అంతా వక్కాణిస్తున్నది నేటి యువతలో చదివే అలవాటు తప్పిందని. ఇంతకూ మునుపులా చదవటంలేదని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది నిజమా?
నేటి యువత అసలు చదవటం అన్నది లేదా?
ప్రస్తుతం కాలములో మనము చదవటం తగ్గించామా?
మనలను ప్రభావితం చేసి రచనలు రావటం లేదా?
సంఘం యెడల బాధ్యతగా ఉండే రచనలు చేసె రచయితలు లేరా?
ఉన్నా ప్రజల ఆదరణ కోల్పోయారా?
జీవితంలో పెరిగిన వేగం, మార్పులు మనలను పుస్తకానికి దూరం చేశాయా?
ఇవి నా ముందు ఉన్న ప్రశ్నలు!
వీటికి నాకు తెలిసిన, నాకు అందుబాటులో ఉన్న జ్ఞానంతో విశ్లేషించే ప్రయత్నమే ఇది-
పుస్తకాలు చదవటము ఒక వ్యసనము:
మాకు చిన్నప్పుడు ఇంట్లో పుస్తకాలు చదివే అలవాటును తీసుకురావటానికి చందమామ, బుజ్జాయి, బొమ్మరిల్లు, ఇత్యాదివి ఉండేవి. ఇంట్లో ఇవి కాక, అమ్మ పత్రికలూ తెప్పించుకునేది. ఆంధ్రభూమి, స్వాతి మొదలైనవి. అవి మేము చదివేవారం. కొంత కాలానికి ‘షాడో’ నవలలు పిచ్చ ఇష్టంగా చదివాము.
టెన్త్ తర్వాత సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, మామయ్య లైబ్రరీ లో ఉన్న తెలుగు నవలలు అన్ని నమిలేశాము. అప్పుడే నాకు ఒక సొంత గ్రంధాలయం ఉండాలని కోరిక కలిగింది. మాకు అక్కడ మొబైల్ లైబ్రరీ వచ్చేది. CEColony కి. నేను అక్కడే ముందుగా రా.వి. శాస్త్రి కథలు, మునిమాణిక్యం కథలు, రంగనాయకమ్మ నవలల నుంచి సాక్షి వ్యాసాలు, ఒకటేమిటి కనపడిన, లభ్యమైన ప్రతి పుస్తకం చదివాను. ఇది నాకు చదివే అలవాటు చేసి, పెంచి పోషించుకునే అవకాశం కలిగించింది. ఒక వ్యసనమై కూర్చున్నా, నాకు ఆనందము కలిగించే విషయము.
మాకు స్కూల్ లో తెలుగుకి, ఇంగ్లీష్ కి నాన్ డిటైల్ అని నవలను పరిచయం చేసేవారు. అవి చదవటానికి తెగ ఉత్సాహం చూపే వాళ్ళం.
లైబ్రరీ కోసం ప్రత్యేకంగా ఒక గంట వారంలో కేటాయింపుగా ఉండేది. అప్పుడు బుక్స్ చదవాలి తప్పక. అప్పుడే మాకు మంచి పుస్తకాలను పరిచయం చేసే వారు టీచర్లు.
నా పెళ్ళి తర్వాత నేను ఇండియా లో ఉన్నది లేదు. మా అమ్మాయి అక్కడ పెరగలేదు కాబట్టి నేటి మారిన విద్యా విధానం బయట్నుంచి చూడటం తప్ప, లోపలి విషయాలు నాకంతగా తెలియదు.
ఇక్కడ – అంటే అమెరికా లో ‘రీడింగ్’ అని వీళ్ళకు ఇంగ్లీషులో ఒక ప్రత్యేక సబ్జెక్టు ఉంటుంది. చిన్నపట్నుంచి మంచి మంచి పుస్తకాలను పిల్లలకి పరిచయం చేస్తారు. సంవత్సరంలో ఒక నెలంతా “బ్లాక్ పీపుల్ హిస్టరీ మొంత్(Black people History Month)” అని వారికి(ఆఫిరికన్అమెరికన్లకు) సంబంధించిన చరిత్ర, పుస్తకాలూ పరిచయం చేసి పిల్లలలో పఠనాసక్తితో పాటు, విజ్ఞానం కలిగిస్తారు.
కాబట్టి ఇక్కడ బుక్స్ అన్నవి మనం పిల్లల చేతులలో చూడవచ్చు.
నేను ‘చినవీరభద్రుడు’ గారు రాసే విషయాలను చాల ఇష్టంగా చదువుతాను. వారు మనకు పరిచేయం చేసిన అత్యంత అద్భుతమైన “బ్లాక్ పీపుల్ చరిత్ర ” బుక్స్ అన్నీ ఇక్కడ వీళ్ళకి 9వ తరగతి, 10 వ తరగతి లో చదివిన పుస్తకాలు.
నేటికీ అమెరికాలో సంవత్సరానికి 10 లక్షల పుస్తకాలూ ప్రింట్ అవుతాయి (on average). ప్రపంచవ్యాప్తంగా వాటికి మార్కెట్ ఉన్నది అన్న విషయం పక్కన పెడితే, ‘న్యూయార్క్ బెస్ట్ సెల్లింగ్ లిస్ట్’ లో తమ పేరు ఉండాలని కోరుకోని రచయితలూ ఉండరు. అంటే నేటికీ పుస్తకానికి అంత విలువ ఇస్తారు ఇక్కడ. ఎంతో వేగవంతమైనా జీవిత విధానం ఉన్న ఈ దేశంలో పుస్తకానికి ఇచ్చిన విలువ అది.
అదే భారతావనికి వద్దాం.
అన్ని బాషలు కలిసి టోకున సంవత్సరానికి 90 వేల పుస్తకాలు ప్రింటు అవుతున్నాయి.
ప్రతిదానికి పశ్శిమ దేశాల మీద, అనుకరణ మీద మోజు ఉన్న వాళ్ళు మరి ఎందుకు పుస్తకాని నిరాదరణ చేస్తున్నారు?
– “నిజంగా నిరాదరణ చేస్తున్నారా??”
అమిష్ త్రిపాఠి గురించి విన్నారా మీరెప్పుడన్నా?
2010 కి పూర్వం మాములు ఒక ఫైనాన్క్ లో పని చేసే వారు
ఆయన.
2010 నుంచి భారతదేశంలో ప్రతి యువతి, యువకుల నోటిలో నానుతున్న పేరు ఆయనదే.
“శివ త్రిలోజి ” అన్న వరుస పుస్తకాలతో , ప్రతి భారతీయ యువత చేతిలో పుస్తకము పట్టించారు. ఆ మూడు పుస్తకాల వరుసలో మొదటిది 2010 లో విడుదలైంది.
మొత్తంగా దానివి ఒక్కొక్కటి 4 మిలియన్ అమ్మకాలు సాధించిందని వినికిడి. ఆయన ప్రతి పుస్తకం ఒక పెద్ద హిట్. అవి 12 భారతీయ ,5 ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయ్యపడినాయి.
ప్రతి పుస్తకం ఒక పెద్ద విప్లవం తెచ్చినా ఆ కథ పాతదే.
కానీ, కథనము,ఆలోచన, వివరించిన విధానం మాత్రం నూతనంగా ఉండి చదువరులను కట్టిపడేస్తుంది.
ఆయన తీసుకున్న కథ ‘శివుడు పార్వతి’ గురించి. పురాణాలనుంచి నడచి వచ్చిన ఆ కథానాయకుల కథను వినూత్నంగా ఆవిష్కరించి, నేటి యువతను తమ తదుపరి పుస్తకం కోసం ఎద్దురు చూసేలా చేసారు.
– “మన జీవితాన వేగం పెరిగి, మన రీడింగ్ అలవాటు తప్పినదా? లేక అకట్టుకునే కధనం లేదా ? “
నేడు మన జీవితంలో ప్రతిదీ వేగవంతమైంది. ఆటలనుంచి, పాటలనుంచి, సంగీతం నుంచి, చదవటం వరకు ప్రతిదీ మనకు క్విక్ గా అయిపోవాలి. క్రికెట్ లో ఇంతకు పూర్వం 50 ఓవర్లతో వన్ డే మ్యాచ్ ఉండేది. నేడు 20 ఓవర్ల వన్ డే లు. అప్పుడు నవలలు,కథలూ చదవటం అలవాటు. నేడు కేవలం యూట్యూబ్, స్మార్ట్ ఫోన్ లో చూసుకోవటం…. ఇలా అన్ని ఫాస్ట్ ట్రాక్ లో కావాలి.
మన సమయం మనది కాదు.
నిద్రలేవగానే మనలో ఎంతమంది “కరగ్రె వసతే లక్ష్మి” అని తలుచుకుంటాము?
మొబైల్ చేతిలోకి తీసుకొని, వాట్సాప్ చూసి, ఫేస్బుక్ చూసి అప్పుడు బద్ధకం వదిలించుకొని మంచం దిగటం నేటి అలవాటు.
నేటి సమాజానికి తగినట్టుగా ప్రతిభావంతంగా రచనలు చేస్తున్నవారు తగ్గిన మాట కొంత నిజమైన… మంచి రచనలు వస్తూనే ఉన్నాయి అన్న విషయం మనకు “వందేళ్ళ తెలుగుకథ” అన్న గొల్లపూడి మారుతీరావు గారి పుస్తకం చుస్తే తెలుస్తుంది.
నేటి సమాజం గురించి, మారుతున్న వేగవంతమైన కాలం గురించి వివరించే రచనలు చాలానే నేడు మనకు డిజిటల్ మీడియాలో చదవచ్చు.
అప్పుటి పత్రికల స్థానే, నేడు బ్లాగ్ లు, ఫేస్బుక్ లో సమూహాలు, విరివిరిగా ఉన్నాయి. ప్రజ్ఞను పట్టుకొని, దాగిఉన్న కళను వెలికి తెచ్చే మహానుభావులు నేటికీ ఉన్నారు.
అవి ఎంతవరకు పాఠకులకు చేరుతున్నాయన్నా ప్రశ్న ఉదయించినప్పుడు, సమాధానం ‘అమిష్ త్రిపాఠి’ ఉదాహరణ మనకు చెబుతుంది.
జ్ఞానం అపారం. అలాంటి జ్ఞానచక్షువు ఉన్నవారు, జ్ఞాన పిపాస ఉన్నవారు ఎక్కడ నుంచైనా చదువుతారన్నది నిజం. చదివే అలవాటు ఉన్నవారికి అది ఎక్కడికి పోదు. యువతకు ఎంతవరకు మనం ఆ అలవాటు నేర్పించామన్న ప్రశ్న ఉదయించినప్పుడు అన్ని బాధ్యతల లాగానే అది కూడా మన బాధ్యతగా తీసుకోవాలి. పిల్లలకి ఇక్కడలా (అమెరికాలో) రీడింగ్ అన్నది ఒక సబ్జెక్టు గా పెట్టి, మంచి పుస్తకమును పరిచయం చెయ్యటం ప్రారంభిస్తే అది కలకాలం నిలబడుతుంది.
నేటి విద్యావిధానం లో మార్పు రావాలని నేను హైదేరాబాదు వెళ్లిన ప్రతిసారి అనుకుంటాను. నా మిత్రులకు చెవిలో పోరుతుంటాను.
8 వ తరగతి నుంచే ఐఐటీ కోచింగ్ కాకుండా పుస్తకాలను చదవటము వంటి విషయాలను ఆలోచిస్తే బాగుంటుంది కదా తల్లితండ్రులు.
అమెరికా నుంచి తప్పక నేర్చుకోవాల్సిన మరో లక్షణం మాత్రం ఈ రీడింగ్ అన్నది. అది కనుక మన పిల్లలకు అభ్యాసం చేస్తే మరో వందేళ్లు తెలుగు కధ సుఖంగా ఉండగలదు.
డిజిటల్ మిడియా పెరిగాక, ‘ఈ-పుస్తకాలు’ విరివిరిగా దొరకటంతో చదవాలనుకుంటే చాలానే లభ్యమవుతున్నాయి.
నేను అట్లాంటాలో ఉన్నందున మిస్ అయ్యింది టీవీ సీరియల్స్ , వారపత్రికలు తప్ప మరోటి లేదు.
మంచి పుస్తకాలూ తెప్పించుకోవటానికి నాకు అంతర్జాల షాపింగ్ ఉన్నది, గరుడవెగా, ups వున్నవి.
నా హ్యాండ్ బాగ్ లో సదా ఒక పుస్తకం ఉంటుంది.
మరి మీకో? మీ పిల్లలకు?
Sandhya Yellapragada
బాగా రాసారు!
తెలియని విషయాలు చెప్పారు. Good work!
LikeLiked by 1 person