చిన్నతనము నుంచి పిల్లలలో సృజనాత్మకత పెంచాలన్నా, అసలు ప్రపంచాన్ని వారికి పరిచయము చెయ్యాలన్నా రంగులు, బొమ్మలే మంచి సహాయకారి కదా!
రంగుల పెన్సిళ్ళు తెల్లకాగితాలు పిల్లలని గంటల తరబడి కదలక కూర్చొబెట్టే సాదనాలు, ఉపకరణాలు. రంగులు, కాగితాల మీద గీయ్యటము, బొమ్మలు వేయ్యటములో వాళ్ళు అల్లరిని లోకాన్ని మర్చిపోతారు. ఇప్పుడు iPads వచ్చాయనుకోండి.
రంగులు వెయ్యటము మూలంగా బాలలలో పరిశీలించే గుణం, ఆలోచించే విధానములో మార్పు వస్తుందని,విజ్ఞాన వికాసము కలుగుతుందని పరిశోదనలలో తేలిన విషయము. బొమ్మలు వేసే బాలలు వారి ఆలోచనలను మరింత స్పష్టంగా వ్యక్తపరచగలరు.
అలాంటి రంగుల మిశ్రమాలతో, బాలలు సృష్టించే చిత్రాలు చెప్పె కథలకు, అంతు వుండదు. వినే వోపిక వుండాలే కాని మనకు మరో ప్రపంచము కనిపిస్తుంది.
క్రిందటి నెలలో ఒక వారాంతరము నాకు అలా బాలల చిత్రాల చెప్పే కథలు వినే అవకాశము కలిగింది.
కాత్యాయని నా పెయింటర్ ఫ్రెండు. తను నడుపుతున్న స్కూల్లో చిన్నారు 5 సంవత్సరాల నుంచి, 14 సం।।వరకూ వున్నారు. వారు గీసిన ఆ చిత్రాలు మా అందరిని మరో లోకము తీసుకెళ్ళి పోయా యంటే అతిశయోక్తి కాదు.
వారు గీసిన చిత్రాలకు, వారి వయస్సుకు సంబంధంలేదు. అందులో నీలి రంగు, తెలుపు కలగలసి కళ్ళు మూసుకున్న ఒక యువతి ముఖము దగ్గర నా నడక ఆగిపోయింది.నాకే కాదు చాలా మంది ఆ చిత్రం దగ్గర ఆగిపోతున్నారు. ఆ మూసిన కళ్ళు…. ముఖంలో భావాలు… పరిపరి విధాలుగా జీవితము గురించి, మంచి- చెడు, అనులోమ- విలోమాల గురించి అత్యంత సూక్ష్మంగా వివరిస్తూన్నాయనిపించింది.
ఆశ-నిరాశ కావలి గట్టు గురించి చెవిలో గుసగుసలాడాయి ఆ చిత్రాలు.
అంతేనా? అంటే అంతే కాదు, చదవగలిగితే జీవితములోని మార్పుల గురించి ఒక ఆశాపూరిత సందేశాన్నిచ్చాయి. అందరానిదేమిలేదని మన ప్రయత్నం అనేది వుంటే అని భోద చేశాయి.
ఆకాశానికి సవాలంటున్న హర్యాలు ఇంకొకరు చిత్రీకరించారు.
పూలలో పువ్వులు మురిసిన బాలాకు పెదవి చివరన చిరవ్వు అతికించటం వాళ్లకు ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాలేదు. గలగలల జలపాతాలు కొందరు సృష్టించారు.
ఒక ప్రఖ్యాత పెయింటింగు లా ఉంది తలుపులు చిత్రం. Doors. మూసినా ఆ తలుపులు ఉన్న చక్కట్టి ఇంటిని, దానికి అల్లికున్న పూల పొదను, అందులో ఉన్న ఆశల పొదరిల్లను, ఆ సౌందర్యమును ఇంకొకరు గీశారు. చిన్న పిల్లలు వాళ్ళు వయస్సుకే, భావాలలో, వాటిని వ్యక్తీకరించటంలో కాదు.
వాళ్లకు వాళ్ళే సాటిలా, అత్యద్భుతంగా గీసిన ఆ చిన్నారుల చిత్రాల ప్రదర్శన మమ్ములను ఆశ్చర్యంతో పాటు, కానరాని లోకాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించింది.ఆ చిన్నారులలో కళను వెలికి తీసిన గురువు కాత్యాయనికి అభినందనలు. వారి తల్లి తండ్రులకు కూడాను. వారు మరిన్ని అద్భుత కళాకండాలు సృష్టించాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను.
మన దేశములో చిన్నారులను తలుచుకొని నాకు కొంత ఆవేదన కలిగింది. వాళ్ళాంతా ఆ చదువుల కర్మాగారములో కొట్టుకుపోతున్నరన ఆవేదన. చదువు ముఖ్యం. విజ్ఞానం కోసం. కాని బాలలో సృజనాత్మకతను చంపేసే చదువులకు మాత్రం నాదో పెద్ద నమస్కారము.
sandhya Yellapragada



