అట్లాంటా అంటే మేముండే ఊరనే కాదు, ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికత లో ఎంతో మునుముందుకు సాగుతున్న నగరం . ఎలాగంటారా?
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి చే “ప్రబోధ సుధాకరం – కృష్ణ భక్తి” తో ఈ వారమంతా, మేము మునిగి తేలితిమిగా..
జూన్ 25 న గురువుగారు అట్లాంటా కు విచ్చేసారు.
అంత ప్రయాణ బడలికలోనూ వారు నన్ను గుర్తుపెట్టుకొని వెంటనే మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించారు.
వారి రాకతో మా గృహము, అట్లాంటా పావనమైనాయి.
వారి ప్రవచనం జూన్ 27 న మొదలై, జులై 1 న రుక్మిణి కళ్యాణం తో ముగిసింది.
మేము అంటే “NRI లము”, భారత దేశం వదిలి వచ్చినా, మాకు ఉన్న సందేహాలను తీర్చటానికి, మమ్ములను ధర్మ మార్గంలో నడపటానికి, భగవంతుడు ఇలా గురువుల రూపంలో తిరుగాడుతూ, ప్రవచనాల రూపంలో మంచిని బోధిస్తుంటారు అని అనిపించింది వారిని చూస్తే.
శ్రీ సామవేదం గారు చెప్పిన ఈ 5 రోజుల ప్రవచనం విన్నవారందరికి కలిగిన అభిప్రాయం ఇదే!
శ్రీ శంకర భగవత్పాదుల వారు అందించిన “ప్రబోధ సుధాకరం అంతా అద్వైతమునకు, ద్వైతానికి, విశిష్టాద్వైతానికి గల తేడాలను, వివరిస్తూ, మాలో పేరుకు పోయిన అజ్ఞానం తొలగించి జ్ఞాన జ్యోతి వెలిగించే ప్రయత్నం చేశారు.
ధర్మం ఆచరణ, వైరాగ్యం ప్రాముఖ్యత, గురువును ఆశ్రయించుకోవటం వంటి విషయాలు ప్రస్తావించారు.
“నిశ్చ – తాను కానిది తాను అనుకోవటం, భ్రాంతి గురించి వివరించారు. …”
“నామ రూప రహితం మైన అవ్యక్త , వ్యక్త రూపాలు, పరా రూపం కల పరమాత్మ ను సేవించు భక్తి లో వివిద రకముగా వున్నది”.
అవి ‘స్థూల, సూక్ష్మ భక్తి’, అట్టి భక్తిలో తేడాలను గురించి వివరించారు.
మనం మన జీవితం లో బంధం విడిపించుకోవడానికి పరమాత్మ తో బంధం పెట్టుకోవాలి.
‘సత్సాంగత్యం’ సదా దానికి సహాయం చేస్తుంది.
భక్తి అంటే భగవంతుని నామంతో చలించి చమరించటమే కదా!!
స్వధర్మమును ఆచరించటమన్నది ఒక యోగం వంటిది. ఆ యోగమును సాధన చెయ్యటం మన లక్ష్యం కావాలి.
‘నాద’ సంధానం మనసును అంతర్గతం చెయ్యటం ద్వారా సాదించవచ్చును.
ఆ నాదమే శ్రీకృష్ణుని మురళీ నాదం, మానవ జీవన వేదం.
కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం.
లీలా మానుష రూపుడు కృష్ణుడు. మనసును బుద్దిని ఏకం చేసి భక్తి సాధించటం ద్వారా మనం కృష్ణుని నాదం వినవచ్చును. అలాంటి నాదం విన్నతర్వాత మనకు సామాన్యమైన జీవితంతో ఏమి పని?
గోపికలకు జీవన నాదం వినపడినదంటే అది వారి భక్తి మూలంగానే !!
‘అంతర్ముఖ సమారాధ్యా’ అయిన అమ్మను జ్ఞానిస్తే ముక్తి సుఖం, ఆనందం. బహిర్ముఖాన అది దుర్లభం”
‘ప్రబోధ సుధాకరం’ అన్న అమృతం అందించారు గురువుగారు. శ్రద్ధగా విన్నవారి సందేహాలు తొలగించారు. మనసు పెట్టి వింటే, మార్గం కనపడగలదని తెలిసింది. చివరి రోజున రుక్మిణి కళ్యాణం గురించి వివరించారు. రివర్డేల్ బాలాజీ గుడి లో జరిగిన ఆ కళ్యాణం భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి.
మేము మా అమ్మ రుక్మిణి వైపు బంధువులం. గుడి ప్రెసిడెంట్ కుసుమగారు, వైస్ ప్రెసిడెంట్ షీలా గారు కృష్ణ స్వామి తరుపు…. పువ్వులు పళ్ళు , ఇచ్చిపుచ్చుకున్నాము. అలా రుక్మిణి దేవి ని స్వామికి కన్యాదానం చేసి, ఆ వేడుక చూసి తరించాము. “ధార్మిక ” సంస్థ తరువున శ్రీరామ్ ని, నన్ను గుడి శాలువ కప్పి సన్మానించారు.
ఇవ్వనీ ఒక ఎత్తు, వారితో నేను గడిపిన సమయము మరో ఎత్తు. నా వరకూ శ్రీ సామవేదము వారు స్వయంగా అమ్మవారి ప్రతిరూపము.
వారు కరుణతో చూసే చూపులో నాకు అమ్మ కరుణామయమైన చల్లని చూపు వుంటుంది. వారితో నేను ఈ వారం రోజులు గడిపి వారికి నా చేతనైనంత సేవ చేసుకున్నానంటే అది నా అదృష్టం. వారు చెప్పే కొన్ని అనుభవాలు, ధర్మాచరణ లో మనము చెయ్యవలసినవి ముఖఃత వినటము మేము చేసుకున్న అదృష్టం. వారితో గడిపిన ఈ వారము రోజులు నిముషాలలా కరిగిపోయాయి. ఈ అపురూప అనుభూతి మనసులో పదిలపరచుకొని అమ్మ పాదాలపై దృష్టినుంచి, గురువుగారు చెప్పినట్లుగా అంతర్ముఖ మయ్యే సాధన చెయ్యటమే కర్తవ్యం!!
సంధ్యా యల్లాప్రగడ