ఇది శారద దేవి మందిరమే ….
అమ్మవారు శారదా దేవిగా, వాగ్దేవిగా, సంగీత లీలా ప్రియగా, గాత్రములో, వివిధ సంగీత వాయిద్యములలో నివసించి మానవులకు రసానందం కలిగించి జీవితం ధన్యత చేకూరుస్తోంది.
రాగం పల్లవించినవేళ ….
తాళం తాండవించినవేళ ..
మహతి సొగసులిడినవేళ
ఒక చక్కటి సాయంత్రపు శుభముహూర్తాన
మానసమున బ్రహ్మానందము నృత్యం చేసిన మధుర కచ్ఛపి ని మీటిన వైణికులు శ్రీ పణినారాయణ గారి రూపములో నాదము అట్లాంటా నేలను తడిపి ప్రమోదాహ్లాదానందాలు ముంచిన సమయమది.
“చారుకేశి, అభేరి, రేవతి, కురింజి, కదనకుతూహల, సింధుభైరవి, హంసనాదాలతో,పరవశించిన వేళ”.
నా పూజ ఫలియించి, అమ్మ ఈ రూపమున నన్ను అనుగ్రహించినది.. లేకున్నా తెలుగు ప్రజలను ఊరుతులూపుతున్న వైణికులు ఫణి నారాయణ గారు ఎక్కడ……
ఏమి తెలియని సరళీ స్వరములు పాడుకునే అట్లాంటా లోని నేనెక్కడ?
మ్యూజిక్ వరల్డ్ ని క్రమం తప్పక ఫాలో అవుతూ ఫణిగారిని అభిమానించటం వరకు మాత్రమే నాకు తెలుసు.
మొన్న అంటే బహుశా 4 వారాల ముందు వారికి నేను తెలియదు… వారి వీణానాదమునకు నేనభిమానిని.
వారి అమెరికా టూర్ అని చూడటం… నేను వారి టూర్ లో అట్లాంటా ఉందా అని అడగటం, వారు వస్తున్నానని బదులియ్యటం…
వారిని ఆహ్వానించటం….
వారు మన్నించి సోదర ప్రేమ చూపి (అయన ఇప్పుడు అమ్మవారు ప్రసాదించిన తమ్ముడు నాకు)
అట్లాంటా వచ్చి మా గృహం పావనం చెయ్యటం…..
అంతా ఒక మ్యాజిక్ లా …. అలా అలా కలలా జరిగిపోయాయి. ఈ వారం రోజులు మరి మా గృహం శారదాదేవి మందిరమే…
క్రిందటి సంవత్సరానికి మా VT Seva లో ఉన్న హై స్కూల్ పిల్లలకు వాలంటీర్స్ కు గోల్డ్ మోడల్స్ ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఫర్ వాలంటీర్స్’ గా వచ్చాయి.
ఈ సందర్భంలో మేము ఒక ఉత్సవం చేసి పిల్లలకు బహుకరివ్వాలని తలచాము.
ఈ సందర్భముగా మాకు అట్లాంటాలో వారితో వీణా విభావరి చేసే అవకాశం వచ్చింది.
మా VT Seva కార్యక్రమానికి జగన్మాత పంపిన బందువువీతడు మరి. ఉన్నది వారం రోజులు మాత్రమే అయినా
తెలిసిన సంగీత మిత్రులను పిలవటం జరిగింది ఈ వేడుకకు ….
ఇవ్వని ఒక ఎత్తు ……
వారి సంగీత విభావరి మరోఎత్తు.
జల జల మని వర్షించిన అమృతపు ధార,
పవిత్రత గంగాప్రవాహ పరవళ్లు ..
మానససరోవరమున వికసించిన పద్మపు గాలుల మృదుమధుర రాగాలాపనలు ..
మెత్తని గవ్వల గలగలలు…
సుందర దేవకన్యల మృదు మందహాసాలు…
ఓంకార నాదపు ఝరులు,
స్వర్గానికి సోపానాలు వారి రాగాలు
ఒకటేమిటి?
ఎన్ని చెప్పినా వారి ప్రదర్శన గురించి చెప్పినట్లు కాదు.
అసలు నాకు తెలిసి తెలుగు భాషలో వారి వీణా నాదం గురించి చెప్పేందుకు సరిఅయిన మాటలేదు.
వారికి వీణ మీద ఉన్న పట్టు అమోఘం అనే కంటే,
వీపంచి వారి చేతిలో అద్భుత రసం ఆవహించి…. అమరత్వం పొందింది.ముట్టుకుంటే ముత్యాల వాన….పలికిస్తే వజ్రపు మెరుపులు …మీటు వేస్తె రాగాల సొగసుల హొయలు,…సాంప్రదాయ రాగాలాపనలు….. ,త్యాగరాజస్వామి కృతులు, అన్నమయ్య పద కవితలు….., ఇళయ రాజా ట్యూన్స్, AR రహెమాన్ పాటలు,హిందీ పాటలు..
ఏది అందుకుంటే ఆ ట్యూన్ ని, రాగాన్ని….అవలీలగా , అతి సునాయాసంగా, అతి లాఘవంగా, అతి మధురంగా, ఆనంద నృత్యం చేయించారు.
విన్న హృదయాలు ఆశ్చర్యంతో, మాటలులేక ఒక అద్వైతానందంలో మునిగిపోయాయి.
అసలు అది దేవ గంధర్వ గానం.వీరు పూర్వం అమ్మవారి దగ్గర ఉండి, మన కోసం దేవలోకం నుంచి వచ్చి సంగీతం వినిపిస్తున్నారు కాబోలు.వీరిని గురించి వివరించటానికి మాటలు చాలవు.
ఇంక ఎలా పొగడగలము.ఆయన వ్యక్తిగా నిగర్వి… మన ఇంట్లో మన సొంత తమ్ముడో, అన్నో ఉంటే ఎలా ఉంటారో … అచ్చంగా అలా ఉంటారు.అంత అసామాన్యమైన ప్రతిభ …ఇంత సామాన్యంగా ఉండటం… ఇది సృష్టిలో మరో వింత…
మాతో కలిసిపోయి, మా మనసులు గెలిచిపోయి… అట్లాంటా సంగీత ప్రియులను తన సంగీత రుచిని అందించి… వశీకరించి.. మనసులు గెలిచిన ఫణి నారాయణ వైణికులకు సాహో….
“అట్లాంటా లో ఇలాంటి సంగీత విభావరి జరగలేదు ఈ మధ్యకాలంలో” అని రసజ్ఞులు సెలవిచ్చారు.
వారు మా అట్లాంటా తిరిగి రావాలని, మమ్ములను మళ్ళీ అద్భుత సంగీత లోకాలక విహరింప చేయ్యాలని కోరుకుంటున్నాము…