“కొన్ని సినిమాలు చూసినప్పుడు అలా వుంటుందా? అన్న అనుమానము కలుగుతుంది”.
నేటి హడవిడి చిత్రాల గురించి కాదు, మన కాశీ విశ్వనాథ గారి చిత్రాల లాంటివి.
“ఒక సంగీత విద్వాంసులు…. కొబ్బరాకుల నుంచి జాలుగా జారిన నీరెండ నీడలు… మంద్రంగా శ్రుతితో తంబూర….. రాగం… వంట ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు వండుకుంటూ ఆ మంద్ర సంగీతాన్ని ఆస్వాదించటము…”
ఇలాంటివి వుత్త కథలలో, విశ్వనాథ సినిమాలలోనే అని నాకో అనుమానముండేది.
ఫణి గారు మా ఇంటికి రాక మునుపు వరకూ…..
మాకు శ్రీ ఫణి నారాయణ గారికి అతిధ్యం ఇచ్చే సదవకాశము కలిగింది.నా ఆలోచనలలో మార్పు వచ్చింది.
వారి సరస్వతీ ఉపాసనతో మా ఇంటి ప్రతి గోడా, తలుపులు పునీతం అయ్యాయి.
సంగీతము, గానముగా, నాదముగా ప్రవహించింది వారున్న పది రోజులు.
ఉదయము నిద్ర లేచింది మొదలు వారు ఏదో రాగాలపానతో సదా గడుపుతారు. ఆ నాదము శ్రుతి తప్పకుండా వుండటానికి శ్రుతి సదా వినపడుతునే వుండేది.
పాటలు కంపోజు చెస్తున్నా, రిక్డాడింగులు చేస్తున్నా ఆ వీణానాదం లయ బద్దంగా వినిపిస్తూవుండేది.
వారు ప్రతి ఉదయము దేవుని ముందు కూర్చొని మూడు నాలుగు కీర్తనలు గొంతెత్తి మధురంగా ఆలపిస్తారు.
అసలు ఆ పాడటంలో మొక్కుబడిగా కాదు తన హృదయము ఆ శారదాంబ పాదాలకడ పరుస్తారు. మరో సారి రాముని ప్రేమగ పిలుస్తారు. ఇంకో మారు అన్నమయ్య పదాలు పలువరిస్తారు.
ఎంతో మధురంగా సాగే ఆ గానలహరికి ఆ పరమాత్మ పరుగున వచ్చేస్తాడని శ్రీవారు ప్రతిరోజు నాతో చెప్పేవారు.
ఫణిగారు ఎంతో బిజీ సంగీత విద్వాంసులైనా, వైణికులుగా ఎంతో ఉన్నత స్థానములో వున్నా ఆయన ఎంతో నిగర్వి.
చాలా సాధారణ జీవన శైలితో సదా సంగీతములో మునిగి తేలుతుండేవారు.
వారి పని నుంచి ఆటవిడుపుకు నాతో చదరంగము, మా శ్రీవారితో షటిల్ ఆడుతుండేవారు.
చాలా కలవిడిగా వుంటూ మా ఇంట్లో మనిషిలా కలిసిపోయారు ఈ పదిరోజులలో.
మాతో పాటు ఆడుతూ, నాకు వంటలో సాయంగా కూరలు తరుగుతూ కూడా రాగాలాపన చేస్తూ మా మధ్య తిరిగుతూ వుంటే నాకు చాలా సార్లు విశ్వనాథ వారి చిత్రం కళ్ళ ముందుకు కదిలొచ్చినట్లుగా వుండేది.
వారికి వీణ మీద బహు గొప్పనైన పట్టు అనే కంటే వారు పూర్వజన్మలో ఏ నారదులో, తుంబురులో అయి వుండ వచ్చనిపిస్తుంది.
ప్రతి రాగము, పాట విన్న వెంటనే అలవోకగా వీణ మీద మీటేవారు.
భారతీయ సాంప్రదాయ రాగాలే కాదు, మా శ్రీవారు వినిపించిన కొన్ని వెస్టర్న్ నోట్సు కూడా విని అలవోకగా మీటగల ఉద్ధండులు వారు.
వీణ మీద ఎంత పట్టో,వారి గానము అంతే మధురము.
మావూరిలోని దేవాలయాన్ని చూడాలని కోరారు.
మా వూరి బాలాజీ దేవళం ఆగమ శాస్త్ర పద్దతిలో, మరో తిరుపతో, పిటస్స్ బర్గులాగాను వెలుగుతూ వుంటుంది.
అందు వెంకటేశ్వరులు ఆరు అడుగులతో కళకళలాడుతూ వుంటాడు.
ఆ కలియగ దైవము దగ్గరకు వెళ్ళాము శుక్రవారము సాయంత్రం.
గుడి పెద్దలకు ముందే తెలిపినందుకు గుడి నిర్వహకులు వచ్చి వున్నారు. స్వామి ముందే తివాచి పరిచారు వీరి కోసము.
మృదంగము సహకారము శ్రీ సుభా ఇచ్చారు.
రెండు గంటల నాద సేవ రెండు నిముషాలలా జరిగింది.
వారి గంభీర స్వరముకు, వారి గానానికి గుడిలోని పెద్దలు, అర్చక స్వాములు ఆనందములో మునిగిపోయారు.
భక్తులు ఆగి కూర్చుండిపోయారు కదలక.
వారంతా ఫణిగారి కార్యక్రమములు టీవిలో చూసారట.
గుడికి మళ్ళీ రావాలని, కచేరి చెయ్యమని వారిని అంతా మనస్పూర్తిగా కోరారు.
తరువాత ఫణిగారికి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
వారి గానము అద్భుతమైనా, వీణ మీటలేదని నాకు కొంత వెలితిగా అనిపించి అడిగితే, వారి సమాధానము ‘పాట మొదలెట్టాక వారికి ఇక ఎమీ తోయలేదని ఆ స్వామిని చూస్తుంటే సర్వం మరిచారనియు’.
మరి కలియగ దైవము ముందు మన ఆలోచనలు ఏమి సాగవుగా.
వారిని ఆ శనివారము మాకు దగ్గరగా వున్న ‘ఆనికొలొలా వాటరుఫాల్స్’ కు తీసుకు వెళ్ళాము.
వారు అట్లాంటా పరిసర ప్రాంత ప్రకృతిని చూసి చాలా సంతోషించారు. అలాగే ‘లెక్ లేనియరు’ కు వెళ్ళినప్పుడు కూడా ఆ నీటి హోరుకు జోరుగా అన్నమయ్య పదము గానము చేశారు.
హనుమానుమందిరములో ఆది వారం సాయంత్రం వారి వీణా నాదము వీనులవిందుగా సాగింది.
ఫణి గారు తోటి వారి పై ఎంత శ్రద్ద చూపుతారంటే, మా హనీ వారి విభావరికి ముందే వూరు వెళ్ళిపోతోందని ఆ ముందు రోజు సాయంత్రం దాని కుర్చుండబెట్టుకొని తన కిష్టమైన పాటలు అడిగి, అడిగి ఆ పాటలు వీణ మీద మీటారు.
పిల్ల పాత సినిమా పాటలు అడుగుతుంటే ఆశ్చర్యపోయారు ఆయను.
‘ఇక్కడ (అట్లాంటాలో) పెరిగిన అక్కడి (భారతదేశపు) ముత్యం’ అని హనీ గురించి పొగిడారు. స్వచ్చమైన దాని తెలుగు భాష విని చాలా సంతోష పడ్డారాయన.
పది రోజుల తరువాత వారు అట్లాంటా నుంచి ఆయన ప్రయాణమయ్యారు.
ఆ పదిరోజులు ఒక పాటలాగా సాగిపొయాయి మాకు. వారిని సాగనంపుతుంటే మా ఇద్దరి హృదయాలు బరువెక్కాయాయి.
మా గృహములో ఆ పదిరోజులు సంగీత సరస్వతి సాదరముగా నెలకొంది. వారు ఎక్కడుంటే అక్కడ ఒక అందమైన కృతి. ఆయన ఆస్టిను వెళ్ళిపోయాక, మా ఇంటి గోడలు ఒక్క సారిగా మూగబోయాయి.
మా ఇల్లాంతా చాలా నిశబ్దంగా మారిపోయింది.
నిజానికి వారి ప్రతిభ అసాధారణము. వారు మనతో కలసి ఆడి, పాడి మనము వారు ఒకటే అన్న భావము కలగచెస్తారు. ఆయన సత్సంగము మాకు లభించిన వరం.
వారు మరింత వున్నత శిఖరాలధిరోహించాలని జగదంబను మనఃపూర్తిగా కోరుకుంటూన్నాము.
– సంధ్యా యల్లాప్రగడ




