నేను భారతావనికి వచ్చిన వెంటనే ‘వీ.టీ సేవ’ వేసవి internsకు పర్యవేక్షకురాలిలా వెళ్ళిపోవటం జరిగింది.
ఆ మధ్యలో నేనో పని చేశా. అది… ఎన్నో వేల మందిని తన రచనలతో ప్రభావితం చేస్తూ, వివిధ భాషలలో వున్న అద్భుత కవిత్వాన్ని తెలుగు భాషాభిమానులకు పరిచయం చేస్తున్న తాత్విక, సాహిత్యవేత్త, ప్రతిరోజూ ఫేసుబుక్ ద్వారా వివిధ విషయాలను అలవోకగా అందిస్తున్న, పరిచయం అవసరం లేని చినవీరభద్రుడు గారితో మాట్లాడటం.
ఆయనకు నేను వెళ్ళే అల్లంపల్లి గురుకులం గురించి తెలుసు. అక్కడ్నుంచి వచ్చాక కలుద్దామన్నారు.
నా భాద్యత పూర్తిచేసుకు వచ్చి కలుద్దామని బయలుచేరాను.
నా దగ్గర వారి కబీరు వుంది కానీ, అది అట్లాంటాలో వుండి పోయింది. అందకని కోటీ లోని నవోదయా లో వారి వ్యాసాల కూర్పు నొకదానిని తీసుకొని వెళ్ళాను. నా అజ్ఞానము, హైద్రాబాదు ట్రాఫికు నన్ను అనుకున్న సమయానికన్నా ఒక గంట ఆలస్యంగా గమ్యం చేర్చాయి.
వారు నాకోసం ఎదురుచూస్తున్నారు. వెళ్ళగానే వారితో కలసి భోంచెయ్యమని అప్యాయంగా ఆహ్వానించారు. చెల్లికి ఆ మధ్యాహ్నపు భోజనానికి వస్తానన్నాను. కాని వారితో కొంతసేపు గడపచ్చన్న ఆలోచనతో, మొహమాటంగా వున్నా కానిచ్చేసాను. ఫలితంగా వారితో కొంత సేపు గడిపే అపూర్వ అవకాశము కలిగింది.
వారిచ్చిన సలహలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. నాలాంటి ఏదో రాసేయ్యాలనుకునే జిజ్ఞాస కలిగిన వారికి తప్పక పనికివస్తాయి.
– ప్రతి రోజూ తప్పక కొంత అయినా రాయాలి(రాసే అభిలాష వున్నవారు).
ప్రతి రోజూ తప్పక ఎంతో కొంత, రిలీజయస్ గా రాయటమనే పని చెయ్యాలి.
రాసేది ఎవరి కోసమో కాదు అని గమనించుకొని, మనలను మనము రూపొందించుకొనేందుకు ప్రక్రియగా
రాయాలి.
మనకు కలిగే ప్రతి ఆలోచనలలో కొంత కొల్పోయినా, కొంతైనా వొడసి పట్టుకోగలము ఆ విధంగా చేస్తే.
పోను పోనూ మనలను మనము నిర్మించుకొని, ఆ తరువాత ఆ ప్రక్రియలో పట్టు సాధించవచ్చు.
కొంత భయం, కొంత బద్ధకం వున్న నాలాంటి వారికి ఇది మంచి సలహాయే.
నేను వారిని సరదాగా “మీరు కాని సరస్వతి ఆకు తిన్నారా ఏంటి? ఇంత అలవోకగా ఎలా రాయగలరు?“ అని అడిగినప్పుడు -ఆయన తను చిన్నప్పుడు నిజంగానే సరస్వతి ఆకు పొడి కొన్ని నెలలు తెనెలో కలిపి తిన్నానని చెప్పారు.
మా చిన్నప్పుడు నాన్నగారు సరస్వతి లేహ్యం తెచ్చి తినమంటే తప్పించుకు తిరిగే నా చేష్ట గుర్తుకువచ్చి తెగ కష్టమనిపించింది.
భద్రుడుగారు మంచి చిత్రకారులు కూడా. ఆయన తనను తాను శాంతన పర్చుకునేందుకు ఎంచుకున్న మార్గం వాటర్ కలరింగు. నాకు మంచి పోస్టు కార్డు, వారి మరొక పుస్తకము బహుమతిగా ఇచ్చారు. ఆయనతో గడిపిన కాలము కొద్ది సేపు నాకు ఎంతో పవిత్రంగా అనిపించింది. నేను లలితా నామాలు చేస్తున్నందున, నాకు లలితోపాసన మీద కూడా ఒక పుస్తకము బహుమతిగా ఇచ్చారు.
హృదయం నిండింది వారి తో గడిపిన ఆ కొద్ది సమయము. వారి శ్రీమతి మంచి గుత్తి వంకాయ కూరతో, ఆకుకూర పప్పుతో చక్కటి తెలుగు భోజనము పెట్టి కడుపు నింపారు.
గిరిజగారితో భద్రుడు గారిని కలిశానంటే, పూర్తిగా చెప్పమని అడిగారు. గిరిజగారు ఇదండి జరిగిన విషయము!!
అంతే కాదు,ఆ రోజు నాకు నిజంగా చాలా వరప్రదాయమైన రోజు. నేను సాయంత్రం తిరిగి ఇంటి ముఖం పట్టినప్పుడు, విజయలక్మి గారు వున్నారేమో కలుద్దాం అనిపించి ఫోను చేశాను. జిల్లెళ్ళమూడి అమ్మ భక్తులైన విజయలక్ష్మి గారు నాకు మాతృసమానులు.
వారి కరుణతో నన్ను సదా కాపాడుతూ వుంటారు. ఫోనులో వచ్చెయ్యమన్నారు. శంకరమఠం లో పని చూసుకు వారింటికి వెళ్ళాను. ప్రేమ గా దగ్గరకు తీసుకొని ఆదరంగా నాకు ఎంతో ఇష్టమైన ఉప్పుడుపిండి ఫలహారం పెట్టారు.
వారు చూపించే ఆప్యాయతలో మనం మనలను కోల్పోతాము. మాకు సమయం తెలీలేదు. డ్రైవరు పిలిచే వరకునూ. అతను పిలిచాడని నేను ఇక వదలలేక, కదలలేక, తప్పక బయలుదేరి వచ్చేశాను. ఆ విధంగా మొన్న అమ్మవారు వాగ్దేవి రూపాన నాకు ఆప్యాయతను, కడుపునూ నింపింది.
ఇంటికి వస్తూంటే ‘తపమేమి చేసితినో తెలియ’….. అన్న త్యాగయ్య కీర్తన మనసున మెదిలింది.

