సత్సాంగత్యము –
‘క్రియా’ అంటే పని అని కదా అర్థం. నిఘంటువు అర్థం కూడా అదే. యోగా అంటే ధ్యానము, ఔషధము; అపూర్వవస్తుప్రాప్తి అని అర్థం చెబుతారు.
ఈ రెండు కలిపి “క్రియా యోగ” అన్న మాటకు అర్థం ధ్యాన మన్న పని అనుకున్నా దానికి పరమార్థం మాత్రం సమస్తం, ఫలితము అనంతం.
అసలు ‘క్రియాయోగా’ అన్న మాట మనకు “ఒక యోగి ఆత్మకథ” లో పరిచయం చేయబడుతుంది. ఆ పుస్తకం ప్రపంచానికి చేసిన మహోన్నతమైన మేలు అదే.
ఒక క్రియ ద్వారా జీవిత పరమార్థం కనుగొను, యోగం సంభవించటం అన్నది తెలుసుకోవటం ఎంతో సాదన తరువాత కాని మనము తెలుసుకోలేము. అలాంటిది కేవలము ఆ పుస్తకం ద్వారా మనకు తెలియటం మన అదృష్టమే కదా!
అలా మేము (నేను, శ్రీవారు)కూడా కొద్దీ సంవత్సరాల క్రితం క్రియ యోగ కు పరిచయం కావించబడ్డాము. నేను శ్రీవారు క్రమం తప్పక అది ప్రాక్టీస్ కూడా చేసేవారము. దాదాపు ఒక సంవత్సరం తరువాత గామోలు, మేము చేసే ‘క్రియ’ తప్పని మాకు చెప్పారు. అలా మేము క్రియ యోగను వదిలేశాము.
తరువాత ఇక నేను అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదు.
నేను వివిధ రకాలుగా సాధన మార్గాలలో ప్రయత్నం సాగిస్తూ, సాగుతూ, ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుకుపోతున్న తరుణంలో అమ్మ పాదాలు ఆశ్రయించి, ఇలా నామావళీ కదంబంలో సాగుతూన్నప్పుడు… సత్ పురుషుల దీవెనలు, సత్సంగం అనాయాచితం గా దొరకటం…. అంతా అమ్మ కృపగా ఎరక , ఈ జీవితం అమ్మ గుణ నామ కీర్తన చేయ్యటాని కున్న పనిముట్లన్న స్పృహ కలిగినది.
హైదరాబాదులో నన్ను అభిమానంతో, ఎంత స్నేహంతో కలిసే మిత్రుల అపూర్వమైన అభిమానం అమ్మ ప్రసాదం ….
అభిమానంగా కలుదామన్న శశి కుమారు గారి ఆత్మీయ ఆహ్వానం కాదనలేక వారి ఇంటికి వెళ్ళాను రెండువారాల క్రింద.
వారి ఆదరణ అపూర్వం. వారి శ్రీమతి, వారి తల్లిగారు ఏంతో కరుణగా నా బాగోగులు విచారించారు. మా మాటల సందర్భంగా వారి గురువుల గురించి, లహరి మహాశయ గురించిన విషయం వచ్చినప్పుడు, మేము క్రియ గురించి, అనుభవాల గురించి మాట్లాడుకున్నాము.
ఆ సందర్భంలో వారు అసలు సిసలైన క్రియ పొందటానికి చేసిన ప్రయత్నాలు అందులో కలిగిన అనుభవాలు , తరువాత గురు కృప గురించి చెబుతూ ఉంటే అలా వింటూ సమయం కూడా గుర్తించలేదు. ఒక ఫోటో తీసుకోవాలన్న స్పృహ కూడా మాకిద్దరికి కలగలేదు. అసలు ఎంతో కాలం తరువాత కలిసిన మిత్రుల మధ్య ఉండే విశేషాలు కబుర్లులా మా సంభాషణ సాగింది.
నాకు తిరిగి క్రియ మీద ఆసక్తి కలిగింది ఆయనతో మాట్లాడాక.
నాకు వారి క్రియను బోధించే గురువు గారి వివరాలు కావాలని తీసుకున్నా.
వారింటి నుంచి బయటకు రాగానే గురువుగారితో మాట్లాడాను. ముందు ఓక ఆదివారం సత్సంగుకు రావాలసినదిగా వారు ఆహ్వానించారు. తరువాత, ఈ క్రిందటి వారం నాకు “క్రియ” ను అనుగ్రహాయించారు.
జీవుడు తన జీవిత రహస్యాలను తెలుసుకోవటానికి, అంతర్ముఖంగా మారి, నెమ్మదిగా సాగి, పరమాత్మ పాదాల వద్ద ఐక్యమై పోవటానికి క్రియ ఒకానొక సహాయకారి.
జీవితాన్ని పండించుకోవడానికి ఒక అద్భుత సాధనం. ఎలాంటి సాధకులైన క్రియ యోగులన్నది కొంత కాలానికి ప్రతి సాధకులకు అర్ధమయ్యే విషయం.
ఈ శరీరంతో అమ్మ పాదాలనాశ్రయించిన తరువాత, హైదరాబాదు వచ్చాక శశి గారి ద్వారా పిలుపు నిచ్చి, చాలా దూరం వెళ్ళుతున్నాను …. ఎందుకో అని నాలో నేను ఆశ్చర్యపడి…. అయినా వెళ్ళినందుకు….. నాకు అంటే ఈ జీవితానికి మార్గం ఎక్కడ ఉందో చూపటానికి రప్పించి, క్రియ ను తిరిగి అనుగ్రయించి, నడిపినది అమ్మ కరుణే.
ఆ తల్లి అపూర్వ కరుణా, అణువణువులో దర్శనమిచ్చి, ఈ జీవితాన్ని తిరిగి తిరిగి తల్లి పాదాల వద్దకు లాగుతున్నది కూడా అమ్మే కదా!
ప్రేమగా పలకరించ వచ్చి, కూడా ఉండి, క్రియ గురించి ఎంతో చెప్పిన స్నేహశీలి రమా శాండిల్యా’ గారి స్నేహ సౌశీల్యం అసమానం. వారు నాకు క్రియ గురించి తప్పక నేర్చుకోవాలని మరొక్కమారు నొక్కివక్కాణించారు.
ఎలాంటి పరిస్థితి వచ్చినా చాలా కూల్ గా ఎదుర్కొంటూ క్రియ యోగి ఎలా ఉండాలో స్వయంగా ఆచరణలో చూపుతున్న ఆ క్రియాయోగికి వందనాలు.
జీవితమనే ఈ అతి పెద్ద ఫజిల్ లో ఎవరు ఏ ముక్కను పూరించి, జీవితాన్ని ఏ మలుపు తిప్పుతారో, సాధనకు ఈ రంగు పులుముతారో తెలియటానికి మనకున్న హస్వదృష్టి ఎలా సరిపోతుంది? అమ్మవారి ఈ క్రీడలో మనం మన వంతు పని చేసి అమ్మ అనుగ్రహం కోసం కాచుకు కూర్చో వలసిందే….మనకున్న కొద్దిపాటి సమయం జాగ్రత్తగా ఆ తల్లి నామ చింతనతో గడపటానికి మించి మరో మార్గం లేదు తరచి చుస్తే.
నాకు కలిగిన ఈ సత్సంగం ఆ జగన్మాత నామాలు రోజు తలచినంత మాత్రానే కలిగింది….. మరి నమ్మి కొలిచిన సమస్త భక్తకోటికి కలుగు పుణ్య ఫలితం ఎంతో కేవలము వారికీ….. ఆ జగన్మాతకు మాత్రమే తెలుసును……..
మనము మనకు కలుగు అనుభవాల మాలలను పునరాలోచించిన అమ్మవారి కున్న అతి కరుణకు మనము మైనములా, వెన్నలా కరిగి తల్లి మీద ప్రేమ భక్తితో మనలను మనము పూర్ణంగా సమర్పణ చేసుకుంటాము. అందుకు ఇలాంటి సత్సాంగత్యము తప్పక సహాయకారి.
అందుకే జగన్మాతతో పాటు సమస్త భక్త కోటికి, సత్సంగానికి సదా…. మనసా శిరసా ప్రణామాలు….
“సత్సాంగత్యే నిసాంగత్యం
నిసాంగత్యే నిర్మోహత్యం…..జీవన్ముకి” (శంకరభగవత్పాదుల వారి మోహముగ్దరం)
శ్రీ మాతకు భక్తితో
సంధ్యా యల్లాప్రగడ🙏🏽🙏🏽