మన రుషులు దర్శనంతో గ్రహించి అందించిన జ్ఞాన సంపద అనంతము,అపారం. అందులో మన కర్మను బట్టి మనకు కొంత ఆ జ్ఞానము లభిస్తుంది.
సృష్టికి పూర్వం సత్చిత్ స్వరూపము ఒకటున్నది. ఆ సత్చిత్….అంటే ఎలాంటి చలనము లేక, నిశ్చలంగా, సదా ఆనందంతో, తనలో తాను రమిస్తూ వున్న ఆ స్వరూపమునకు పేరు లేదు. ఆ పదార్థంని “పరా” అన్నారు. అది పూర్తి సచ్చితానంద స్వరూపము.
ఆ పరా లో చాలా కొద్ది భాగము (కేవలం 1% అనుకోవచ్చు) కదిలింది.ఆ కదలాలనే కోరికనే మహాకోరిక.
ఆ కదిలిన భాగము శక్తి.
అప్పటివరకూ లేని కాలమన్న మహా ప్రమాణం, ప్రయాణం మొదలైయ్యింది. భగవత్గీతలో కాలమే పరమాత్మ గా, తానుగా భగవానుడు విరచించాడు.
అందువల్లనేగా కాలమును మనం శక్తి స్వరూపిణిగా, జగదంబగా తలుస్తాము.
అలా కదిలిన శక్తి సర్వ ప్రపంచానికి ‘హేతువు, కారణం, లేదా తల్లి’ అయ్యింది.
ఆ కదలిన శక్తి నుంచి సర్వ ప్రపంచము ఉద్భవించినందు వలన ఆ శక్తి ని “శ్రీ మాత” గా సర్వ ప్రపంచము కొలువ నారంబించారు.
“శ్రీ మాత్రేనమః”
‘పరా’ నుంచి వ్యక్తమైన శక్తి కాబట్టి ‘పరాశక్తి’ అయ్యింది.
‘పరా’ మహా కామేశ్వరుడుగా, వ్యక్తమవ్వాలన్న కోరిక మహ కామము(మహా కోరిక)గా,
వ్యక్తమైన శక్తి మహా కామేశ్వరిగా పిలువబడ్డారు.
శ్రీ మాతగా వ్యక్తమైనది విశ్వమాత ఎదో ఒక క్షేత్రం నుంచి సృష్టి మొదలెట్టవలెను కదా. అలా మొదలెట్టి క్షేత్రం పరమపావనమై, శక్తి పీఠాలలోనే తలమానికమైనది. అలా అమ్మ యోని రూపమున వెలసిన క్షేత్రం సర్వ శక్తి వంతమైన క్షేత్రంగా, సర్వ రకములైన ఆచారాలకు, పద్దతులకు నెలవైనది.
వామాచార, దక్షిణాచార,శిష్ఠాచార, కౌళాచార పద్దతులకు అఘోరీలకు, తాంత్రిక విద్యలు సాదన చేయు వారలకు… అందరికి తప్పక దర్శించవలసిన క్షేత్రమయ్యింది. ఎలాంటి పద్దతులు తెలియని వారు సైతం ‘మాతా’ ‘శ్రీ మాతా’ ‘అమ్మా’… ‘మాయి’ అని ఆర్తితో పిలిస్తే పలికి…. జీవన సాపల్యం అందించు క్షేత్రం మది. సాదకులన్న వారు తప్పక దర్శించ వలసిన ఆ క్షేత్రం ప్రాగజ్యోతిష్యపురమున,
నీలాంచల శిఖరాన వెలసిన కామాఖ్య క్షేత్రం.
ఈ క్షేత్ర దర్శనం కోసం నేను చాలా తపించి పోవలసి వచ్చింది. ఎందుచేతనో కుదరలేదు నేటివరకునూ.
ఇన్ని రోజుల నా ఆర్తికి సమాధానంగా నేటికి దర్శించగలిగాను. నా హృదయాన్ని దోసిటిలోకి చేర్చి నా కళ్ళు నుంచి ధారాపాతంగా కన్నీరు కురుసుండ నా నొటికి వచ్చిన సిద్ధకుంజిక జపిస్తూ ఆ గర్బాలయంలోకి ప్రవేశించిన క్షణం నేను మరువలేనిది.
“అమ్మా నేటికి కరుణించావా తల్లి ‘అని నా అణువణువు వేయ్యి కంఠాలతో అమ్మను పశ్నించినట్లు నాకు గగుర్పాటు కలిగింది.
గర్బాలయం ప్రవేశించే ముందే ఓక రకమైన ఇరుకు వరసల దారి. మనం నెమ్మదిగా ప్రవేశించే ఆ అంతర్మందిరము ఓక బావి అయి వుండవచ్చు.10 మెట్లు దిగుతాము ముందు. అడ్డంగా గోడ వుంటుంది. చీకటి తో నిండిన ఆ ప్రదేశంలో రెండు నూనె దీపాలు నిరంతరం వెలుగుతుంటాయి.
ఆ గోడను దాటిన తరువాత మెట్లు మరింత ఇరుకు. మరి నాలుగు మెట్లు దిగి కొద్ది చదును ప్రదేశం వరకూ వచ్చాక అక్కడి లోతైన ప్రదేశాన….. పూర్తిగా వస్త్రం కప్పి మధ్యలో కొంత ఎత్తుగా….. పుష్పాలతో కప్పిన ప్రదేశం దర్శిస్తాము. సదా నీరు ప్రవహించి ఆ ప్రదేశం జగన్మాత సృష్టి బహిర్గతమైన ప్రదేశం.
అక్కడ వున్న నీరు మనం గ్రహించి అమ్మ అనుగ్రహానికై ప్రార్థించి బయటకు వస్తాము.
ఆ ప్రాంగణములో మన జపతపాలు చేసుకోవచ్చు.
సాదకులు తప్పక దర్శించు ఆ క్షేత్రం గురించి పుంకానుపుంకాలుగా కథలున్నాయి. బలులు కూడా చాలా సామాన్యంగా జరిగుతాయట.
నేను వెళ్ళిన రెండురోజులు అసలలాంటివి నేచూడలేదు.
పండాలు వున్నా పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మన జపం మనం చేసుకోవచ్చు. దర్శనమైన తరువాత ఆ ప్రాంగణంలో యదేచ్చగా తిరిగవచ్చు. మనకు నచ్చిన చోట కూర్చొని అమ్మను ప్రార్థనచేసుకోవచ్చు.
“అమ్మలఁగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మకడుపాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మినవేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ”
అలాంటి అతి కరుణ జూలువారు అమ్మను దర్శించి నాలోని అహం అమ్మ పాదాల కడ నే సమర్పించిన బలి….
ఈ పవిత్ర శ్రావణ మాస బహుళ అష్టమిన లోకాన చెడును తుంచ శ్రీకృష్ణుడు ఉదయించిన అద్బుత ఘడియల పుణ్య సమయాన ‘నేను’ అన్న మాట తుంచి సర్వం జగదంబ అన్న ఎరుక ఇవ్వమని…అమ్మను ప్రార్థిస్తూ మిత్రలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
(గౌహాతి అందమైన ప్రదేశం…ప్లాస్టిక్ జబ్బు….కాలుష్య అంటువ్యాది ఇంకా అంటని హరిత వనము…)