గంగా నమో నమః!!
ఆకాశమునుంచి పరమ శివుని శిరసు మీదకురకంగా
గలగలా పరవశముగ మని పారంగా
శిఖిఫించుని పాదములను బదిరిలో కడగంగా
పంచ ప్రయాగలను పవిత్రంగా కలపంగా
హరి హరియని తలవంగా
హరిద్వారమున హారతులను అతిశయముగ అందుకొని మురవంగా
ఆదరంగా ఆ గంగా
మనమున నమ్మి మునగంగా
పాపము బాయును ఆదరంగా
వాగులు వంకలు వచ్చి కలవంగా
హెచ్చుగ నాగరికత విరవంగా
చరిత్రను దర్పణంగా చూపంగా
జీవాధారమై నడవంగా
ఆనందాలుగ మానవాళి మురియంగా..
మన గంగా!!
కాశీ మహాదేవుని చేర్చంగా
మోక్ష మార్గమది చూపంగా
గలగల మని పారింది ఈ గంగా….
తదాగతుని తలపులలో జ్ఞానమై వెలగంగా
ప్రపంచానికి భౌద్ద శాంతి మంత్రం విరియంగా,
పాతాళమున బూడిదను పవిత్రంగా మార్చంగా
సాగర తనయులకు మోక్షమై వొసగంగా…
ఈ గంగా!!
భారతచిత్రపఠాన జలతారు ఈ గంగా
సర్వకాల సర్వావస్థల పరమ పవిత్రమో మన గంగా….
ఆధ్యాత్మీకత పట్టుకొమ్మగా విరియంగా
అమ్మలా ఆదరించునీగంగ
జగదంబ కు ప్రతిరూపమై వెలసిన మన గంగ!!
సంధ్యా యల్లాప్రగడ