బ్రహ్మకపాలము ::
బ్రహ్మకపాలం గురించి అంతా వినే వుంటారు.
నాకు తెలిసినంత వరకూ దాని గురించిన కథ ఈ విధంగా సాగుతుంది. పూర్వం బ్రహ్మ గారికి ఐదు తలలుండేవిట. ఏదో విషయములో ఆయన రుద్రునితో విభేదించటం, మహాదేవుడు తన చిటికనవేలుతో తల కొట్టేయ్యటం జరిగాయి. తెగిన తల రుద్రునికి గోరుకు అంటుకుపోయ్యింది.
బ్రహ్మ హత్యా దోషము కూడా తోడైయ్యింది. బ్రహ్మగారి తల కపాలంలా కూడా మారింది. రుద్రుడు ఆ కపాలంతో బిక్ష చెయ్యటం కూడా చేసాడుట. ఆయనకు ఆ విధంగా కపాలముతో బిక్షచేసిన ఆది బిక్షువు అని పేరు కూడా పొందాడు.
ఆయన ఏమీ చేసినా గోరుకు అంటిన కపాలము పూడిపడింది కాదు.
నారాయణుని సలహా ప్రకారం బదిరి ఆవల అలకనందలో మునిగిన వెంటనే ఆయన చేతికంటిన కపాలం వూడటం, రుద్రుడు సంతోషపడటం జరిగి, ఆ ప్రదేశం పరమ పావనమైనదిగా మారిందిట. అందుకే ఆ ప్రదేశాన్ని ‘బ్రహ్మకపాలం’ అంటారు.
బ్రహ్మ కపాలం బదిరి కి ‘మనా’ కి మధ్యన అలకనందా నదికి వున్న ఘాటు.
ఆ ప్రదేశములో పిండప్రధానము చేస్తే పితృదేవతలకు శాశ్వత స్వర్గ ప్రాప్తి అంటారు. అటు తర్వాత వారికి ప్రతి సంవత్సరము చేసే తద్దినము చెయ్యకూడదని చెబుతారు.
స్వర్గంలో శాశ్వత స్థానములో వున్న పితృదేవతలను మళ్ళీ పిలిచి పొరపాటు చెయ్యకూడదని అలాగంటారు.
బదిరినాద్ కు వెళ్ళిన వారు తప్పక ఆచరించే ఈ సంప్రదాయము నన్ను ఆ రోజంతా కలచివేసింది.
అది ఎట్లాగంటే:
నేను బదిరికి చేరిన రోజు సాయంత్రము అయ్యింది. ఆశ్రమ అర్చకస్వామి రాఘవ నన్ను బదిరినారాయణ ను దూళీ దర్శనము చేసుకోమ్మని హడవిడిగా కోవెలకు కొనిపోయారు. ఆయనే నాకు క్షేత్రం పరిచయం చేస్తూ బ్రహ్మకపాలము అదిగో అంటూ అక్కడే అని అన్నింటితో పాటు చూపారు.
నాకు బ్రహ్మాకపాలం గురించి, పెద్దలకు పిండప్రధానం గురించి విని వుండటము వలన, ఆవిషయము చూడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.
నేను చదివిన దాని బట్టి బ్రహ్మకపాలం ఎక్కడో హిమాలయాలలో నదీ జన్మస్థానంలో వుంది. నేను అంత లోపలి హిమాలయాలకు వెళ్ళానని అక్కడ చూచేంత వరకూ అర్థం కాలేదు.
నిజానికి నేనక్కడకు వెళ్ళానన్న విషయము అవగతమవగానే ఆనందం కలిగింది.
బదిరి నారాయణ అనుజ్ఞ లేనిదే ఎవ్వరూ అక్కడదాక వెళ్ళలేరు అన్నది నిజము.
అమ్మను,నాన్నాగారిని కోల్పోయిన దురదృష్టం నన్ను వెన్నంటే వుంది. అక్కడకు వెళ్ళాను కాబట్టి అమ్మ నాన్నగార్లకు ఎమైనా చెయ్యాలన్న నా కోరిక సహజం. సహేతుకం.
అందుకే నే వెళ్ళిన రెండోనాడే నేను బ్రహ్మకపాలం వరకూ నడచుకు వెళ్ళి అక్కడి ఈ తతంగం చేస్తున్న బ్రామ్మలను అడిగాను.
వారు నేను స్త్రీ ని కాబట్టి నాకర్హత లేదని, పురుష సంతానమే అది చెయ్యాలని, పురుష సంతానము లేని చోట అల్లుడు చెయ్యవచ్చని కాబట్టి నే చెయ్యగలిగినది లేదని కరాకండిగా చెప్పారు. నేను కొంత ఎక్కువ డబ్బులిద్దామనే ప్రయత్నం కూడా అక్కడి వారు పట్టించుకోలేదు. అలా నేను బ్రహ్మకపాలమెళ్ళినా అమ్మా, నాన్నగార్లకు ఏమీ చెయ్యలేకపోయాననే విషాదము నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
శ్రీవారికి నా కష్టం చెప్పి ఆడపిల్లలు మాత్రం వాళ్ళ పిల్లలు కాదా ఏంటి ఈ పద్దతులు…. అని నా విచారం చెబితే… పద్దతులని పెట్టారు.. నమ్మితే పద్దతిగా చెయ్యాలి, లేకపోతే అసలు ఇవ్వనీ నమ్మకు… సగం సగం గా ఊగిసలాడ వద్దని స్వాంతన పర్చ ప్రయత్నం చేశారు.
నేను సమాధాన పడలేదు. ఇలాంటి కర్మకాండలకు స్త్రీలను దూరంగా వుంచి పూర్వీకులు చాలా అన్యాయం చేశారని నా బలమైన భావన. ఇందులో నేను ఎవ్వరితోనూ వాదులాడ దలచుకోలేదు. నేను స్త్రీవాదమని మరో వాదమని నన్ను అల్లరి పెట్టువారికి నా సమాధానము ఓక నమస్కారమే కానీ, నా భావన మాత్రం అచ్చంగా ప్రపంచములో స్త్రీని second grade citizen గా చూస్తారన్నది వాస్తవం.
మన సనాతన సాంప్రదాయలలో కూడా ఇదే..
నేటి మారిన కాలములో స్త్రీ సంపాదన పనికివస్తుంది. స్త్రీ కుటుంబం కోసం క్రొవత్తిలా కరగటం పనికి వస్తుంది. ఇందులో మాత్రం పనికిరాదు. అర్థం పర్థం లేని అవకరవేషాలు. దీని గురించి కలిగిన ఖేదం లో నేను తమ్ముడికి మెసేజ్ ఇచ్చా.
“మహనుభావా తమరు తప్ప ఇతరులు పనికిరారట. ఇటుగా వచ్చి ఆ పనేదో చూడమంటూ’.
దానికి వాడు ‘ఆ బ్రహ్మ సంకల్పము కుదిరినట్లు బ్రహ్మకపాలంకి వస్తాలే, నీవు జాగ్రత్త!!’ అంటూ సెటైర్ వేశాడు.
మనసులో కలిగిన కష్టం ఆశ్రమ నిర్వహుకలలో మాతృమూర్తి సమాన కోటేశ్వరమ్మ పిన్నిగారు గమనించి ఊరడించారు.
రాఘవ స్వామి ఆ అష్టాక్షరీ క్షేత్రంలో అన్నవితరణ చేసి అమ్మ నాన్నగార్ల కు నాకు చేతనైనంత బుణం తీర్చుకోవచ్చని సలహా ఇచ్చారు.
ఈ మహాలయ పక్షాలు అందునా అమ్మ తిధి కూడా అచ్చంగా అప్పుడే… అందుకని అన్నదానంకి కట్టి చేసేది ఇంక ఇంతేనని కన్నీటితో నమస్కరించాను బ్రహ్మకపాలానికి. గంగమ్మకు.
బదిరిలో ఎందరో సాదుసంతు లున్నారు. వారిలో కొందరు స్త్రీలు కూడాను. ఒక స్త్రీ సన్యాసిని నాతో మాటలు కలుపుతూ “స్త్రీ లకు ఆత్మజ్ఞానము గురించి భారతీయ సనాతన ధర్మం చేసిన నిరాదరణ గురించి మాట్లాడింది. ఆమె వివరణ
‘ఎంత సేపూ స్త్రీ కి భర్త, పిల్లలు, వారి సంరక్షణనే జీవిత ధ్యేయంగా నిర్దేశించము అన్యామని… పరమాత్మ కోరితే ఎవ్వరూ ఆపలేరని…ఉదా: మీరాబాయి అని నాతో చెప్పటం నన్ను ఆలోచనలలో పడేసింది. ఇవీ బ్రహ్మకపాల విశేషాలు.
బ్రహ్మ కపాలము వెళ్ళాలనుకునే వారు బదిరినాద్ క్షేత్రం లో పాండాలను కుదుర్చుకుంటే వారే మీ పనులు చూసి పెట్టగలరు.