బదిరికి చేరిన విధంబెట్టిదనిన:
బదిరిలో వుండి కొంత జపం చేసుకోవాలన్న నా కోరిక పూరతనమైనది. అంటే – అనాదిదేమీకాదు గానీ నాకు బదిరి మొదట(2016లో) రాఘవ స్వామి చెప్పి చెప్పిన నాటి నుంచి నాలో మొలకెత్తి నేటికి సాకరమైనది.
ఏదైనా జపము, తపము, హోమము, దానము….మంచి కానీ చెడు కానీ ఒకటికి 100 రెట్ల ఫలము బదిరిలో లభ్యం. అది నారాయణుడు ఇచ్చిన మాట.
ఉత్తరాచల రాష్ట్ర మంతా తమది దేవభూము యని ప్రకటించు కుంటారు. హిమాలయములంతా అదేగా. దేవతలు తిరుగాడిన, తిరుగాడుతున్న మహోన్నతమైన భూమిక.
అందునా కేధారము, బదరీ మోక్షభూములు.
అందుకే అక్కడ జరిపే జపతపాదులకు అంత విలువ, ప్రాముఖ్యతను.
అంతేకాదు అక్కడ ఒకరి గురించి తప్పుగా తలవకూడదు. చెడు మాటలు గట్రా కూడా ఎవరిని అనటము అదీ చెయ్యకూడదు. దానికి వ్యెయి రెట్లు పాపం వస్తుందిగా మరి.
అక్కడ ఒక విధమైన పవిత్రత వాతావరణములోనే వుంది. అది అనుభవించవలసినదే కానీ చెప్పలేము. సదా హృదయము పరమాత్మతో అనుసందానింపబడి వుంటుంది.
నా అనుష్టానముకు అందుకే బదిరి ని ముఖ్య భూమిక గా ఎంచుకున్నాను.
నేను మా శ్రీవారు క్రిందటి సంవత్సరము కనీసము రెండు ధామాలన్నా సందర్శిద్దామనే పయనమయ్యాము కానీ కొండల్ చాలా జర్వం పడ్డారు. అందుకే కేదారేశ్వరము సందర్శించి వెనకకు మళ్ళాము. అలా గత రెండు సంవత్సరాలుగా బదరిలో నాకు ప్రవేశము కలగలేదు.
ఈ సారి నేను కృతనిశ్చయముతో వున్నాను. నాకు బదరిలో నెల రోజులన్నా వుండాలన్న కోరిక. అక్కడ మన జియ్యరు స్వామి వారి మఠము కూడా వున్నది.
శ్రీ పరమహంస పరివ్రాజక పెద్ద జియ్యరు స్వామి వారిచే 1949 లో మొదలెట్టిన ఈ మఠము తెలుగువారి అవసరాలు తీరుస్తూ, మంచి తెలుగు బోజనముకు, వసతికి పేరు పొందింది.
శ్రీ చిన్నజీయ్యరు స్వామి వారు ఆ క్షేత్రంలోని ఆ మఠాని మరింత అభివృద్ధి చేశారు.
నాకు నెలకు ఆశ్రయము కావాలంటే స్వామి వారితో పరిమిషన్ తెచ్చుకోమన్నారు అక్కడి అర్చకస్వామి రాఘవ. నేను హైదరాబాదులో మా interns తో పాటు ఈ వేసవిలో స్వామి ని కలిసినప్పుడు నా బదిరి వెళ్ళి వుండాలన్న కోరిన శ్రీశ్రీ స్వామీజీ కి వినవించుకున్నాను.
స్వామి నవ్వి అలాగే వుండమన్నారు, కానీ అక్కడి చలి గురించి ప్రేమగా హెచ్చరించారు. వారు ముందుగానే చెప్పారు “మీ అట్లాంటా లా కాదండి. చలి కి హీటర్లు కూడా వుండవు మరి జాగ్రత్త” అని!
స్వామి వారి మంగళాశాసనములు దొరికాక ఇంక ఘంటాసురుడు(బదిరి క్షేత్ర పాలకుడు) కూడా ఆపలేడు నన్ను అని నేను మురిసాను. అది సత్యం కూడానూ.
అలా గత మూడు సంవత్సరాలుగా కుదరనిది మరి ఈ ఏటికి కుదిరింది.
నా ట్రావెల్ ఐటనరీ వివరాలు:
నేను రిషికేషు కు చేరుకోవటానికి డెహ్రాడును కు హైద్రాబాదు నించి ఇండిగో వారి విమాన సర్వీసును వాడుకున్నాను.
డెహ్రాడూను చేరే సరికి సాయంత్రం 6 దాటింది.
అక్కడ్నుంచి రిషికేషు జియ్యరు మఠము కు చేరటానికి 45 నిముషాలు పట్టింది. ఎయిర్ పోర్టు ట్యాక్సీ లో రిషికేషు చేరాను. మఠము మేనెజరుకు ముందుగా ఫోను చేసి వున్నాను కాబట్టి, ఆయన నా కోసము ఒక గది వుంచారు. ఆ రాత్రి కి అక్కడే వున్నాను.
రిషికేషు లో ఎన్నో మఠాలు, హొటల్స్ కూడా వున్నాయి. (మేము మన స్వామి వారి మఠమంటే మా పుట్టిల్లు అన్నంత సౌకర్యంగా ఫీలవుతాము కాబట్టి మఠానికే వెడతాము)
ఆనాటి రాత్రి కుండపోత వాన.
మరురోజు నేను గంగా నదికి నా వందనములు సమర్పించి ఉదయమే బయలుచేరాను.
వాన కారణమున మెనేజరు గారు బదిరి బయలుచేరటం రిస్కు అన్నారు. నేను చూద్దాములెమ్మని బయలుచెరాను. నాకు ఆయన జాగ్రత్తలు చెప్పి ట్యాక్సి ఎక్కించారు. రిషికేషు నుంచి బస్సులు వుంటాయి. గ్రూపుగా వెళ్ళెవారికి ఒక సొంత ట్యాక్సి తీసుకోవటం చాలా స్వౌకర్యవంతముగా వుంటుంది. నాకు బస్సు వెత్తుకుకొని ఎక్కే వోపిక లేదు. అందునా మఠానికి ఎదురుగా ట్రవల్స్ అతను వీళ్ళకు బాగా తెలిసిన అతడే. అందుకే ఒక్కదానైనా బయలుచేరాను ట్యాక్సీ లోనే. నాకు ఒక జీపు టైపు బండి పంపారు ఆయన. ఎక్కడ మట్టిలో ఇరుక్కుపోకూడదని.
ఏ ఇబ్బంది లేకుండా అందమైన ఆ హిమాలయ పర్వతాలలో ఆ రోజంతా నా ప్రయాణం సాగింది.
రిషికేషు నుంచి అలకనంద జన్న స్థానం వరకూ వదలకుండా కొండల మీదుగా, లోయలలో ఆ దారి సాగుతుంది.
దారి పొడగునా గంగ ప్రక్కనే గలగల మంటూ తోడుంటుంది.
అద్భుతమైన పంచ ప్రయాగలు దర్శన మిస్తాయి.అవి దేవ ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, విష్ణు ప్రయాగ లు.
ఆ సౌందర్యం కన్నులతో చూసి, హృదయంలో నింపుకొని మురవాలి తప్ప వర్ణించరాదు మనకు. కేవలం కాళిదాసు కానీ పెద్దన్న కాని కొంత న్యాయం చెయ్యకలరు.
మధ్యలో శ్రీనగరు చాలా పెద్ద వూరు. అక్కడ మెడికల్ క్యాంపసు చాలా విశాలమైనది. గంగ మీద తెహ్రి డ్యాము కట్టారు. మనకు దారిలో. కనపడుతుంది.
పర్వత ప్రాంతపు పంటలను కూడా దారి పొడవునా చూడవచ్చు.
చూసేకొద్ది చూడాలనిపించే అందం హిమాలయముల సొంతం.
ఎంత చూసినా తనివి తీరని, కొంత మిగిలిపోయే వైనమది.
చుట్టూ హరితము. జలజల జలపాతాలు. గలగల గంగమ్మ.
కొండ పైన సాగుతున్నా, లోయలో నైనా ఆపుకోలేని అతిశయించిన ఆ సౌందర్యం మనకు బాహ్య స్పుహను కోల్పోయేలా చేస్తుంది.
మనసు ఆనందముతో దిగంతాలను స్పర్శిస్తూ సాగుతుంది. హృదయము శుద్ది పొంది మనము బదిరిలో ప్రవేశింప అర్హులమవుతాము.
అలా నేను ఆనాటి సాయంత్రపు సంద్యా సమయాన పవిత్ర అలకనంద రిషిగంగాల విష్ణు ప్రయాగ సంగమాన శ్రీ మహావిష్ణువు నారాయణునిగా వెలసిన బదిరికా వనంలో ప్రవేశించాను.
~~~~~~~~
పద్మాసనములో నున్న పద్మనాభుడు
చిలిపి కన్నులతో చూచు అల్లరి కృష్ణుడు
భక్తజనులకు జపమాల చేతికిచ్చు జడధారి
క్రీడావనిని తపోభూమిగా మార్చిన ముని పుంగముడు
ప్రథమపాదము మోపిన చరణపాదుడు
నరునకు మంత్రానిలఉపదేశించిన గురుమూర్తి
నన్ను అనుగ్రహించి అనుమతించాడు నారాయణడు బదిరి లోనికి!!
హరి ఓం తస్సత్!!