మా చిన్నప్పుడు సాలారుజంగు మ్యూజియం వెళ్ళినప్పుడు, వింతగా చూస్తుంటే చెప్పారు ఇవ్వన్నీ ఒక్కళ్ళు సేకరించిన సరుకు అని. అన్ని సేకరించటానికి ఎంత ఇంటరెస్ట్ , సమయము ఉండాలో నా చిన్న బుర్రకు అర్థం కాలేదు.
అమెరికాలో ఇలాంటి కలెక్షన్, కలెక్టు చేసే వారు చాలా మంది ఉంటారు. వారికి గ్రూప్లు, విషయాలు పంచుకోవటం, ఊరు ఊరు తిరగం,మాల్స్. ఫిల్టు మార్కెట్లు , ఆక్షన్ కేంద్రాలు, ఓహో అదో మహా లోకం…. మనకు తెలియని ప్రపంచం.
ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అది అతి పెద్ద మార్కెట్, మహా గ్రంధాలు. తరతరాలుగా వచ్చే వస్తువులకు, పురాతనమైన వాటికి అత్యంత విలువ ఉంటుంది ఆ మార్కెట్ లో. ఎంత పాత బడితే అంత విలువ అక్కడ.
నిజ జీవితంలో నేను అలాంటి వారిని కలవలేదు ఇప్పటి వరకూ. అలాంటి వస్తు సేకరణ మీద అభిలాష, మక్కువ ఉన్న శ్రీ. సుబ్రహ్మణ్యం వల్లూరి గారిని కలవటం చాలా యడ్డుచ్చికం గా జరిగినా, చాలా సంతోషం కలిగింది. నేటి కాలపు సాలారుజంగ్ గారిలా అనిపించి అద్బుతంగా వుండింది.
వారు నాకు ఫేస్బుక్ లో తెలుసు. గత నెల గిరిజ గారు మా ఇంట చుసిన ఇత్తడి కాఫీ ఫిల్టర్ ను పురాతన వస్తు సముదాయంగా పరిచయం చేస్తున్నప్పుడు వారు మాట్లాడారు. ఆ విషయములో వారి పరిజ్ఞానం లోతైనది. వారి కలెక్షన్ చూడటానికి అశోకనగరు లోని వారి గృహానికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానించినా నిన్నటి వరకు నాకు వీలు కలగలేదు.
వారి గృహమొక మ్యూజియము.
నిన్నటికి వారి ఒక కలెక్షన్ చూడగలిగాను.. అక్కడ కూడా వారి పూర్తి కలెక్షన్ కాదట, మొత్తం లో ఒక 10% అయుండొచ్చు.
ఇత్తడి పాతపడిన కొద్దీ, పుత్తడి కన్నా ప్రియం. అందునా ఆ పురాతన విగ్రహ సౌందర్యం కానీ, వాటి సొగసు కానీ మనం వర్ణించలేము. అది చూడవలసినదే.
వారి వద్ద గణపతులు కోకొల్లలు.
ముందు ఇంట్లో ప్రవేశిస్తూనే నటరాజు స్వాగతం చెప్పాడు. ఆ మూర్తి 4 శతాబ్దాల వెనకటిది అని చూడగానే తెలుస్తుంది. ఆ నటరాజు స్వామి ఉన్న పీట కూడా అందమైన చెక్కులతో, తన వైభవం చాటుతోంది. సోఫా సెట్ కి ముందు వారు ఉంచిన కాఫీ టేబుల్, ఒక భోషాణం. చూడగానే గత శతాబ్దపు వెలుగులతో మెరుస్తున్నది. మా ఇంట్లో బోషాణం నాకు తెలుసు కానీ ఎప్పుడు నేను విప్పి చూడలేదు. ఆయన ‘సింధు’ అంటూ వారి అమ్మాయని పిలిచారు. ఆ పాప వచ్చి నాకు అది వివరంగా చూపింది. తెరిస్తే అరలు, అరలు గా నిగూఢమైన విలువైన ఎంత సంపద తనలో దాచింది కానీ, అందమైన అరలతో దర్శనమిచ్చింది. వారు అప్పుడు చెప్పారు ‘బోషాణం ఎప్పుడు తీసి లోపల ఉన్న అరల సౌందర్యం చూడాల’ని. మా ఇంట్లో నాన్నమ్మ ముట్టుకోనిచ్చేది కాదు భోషాణాన్ని మాకేల తెలుస్తుంది అలా ఉంటుందని.
గదిలో ఒక మూల గ్రాండ్ ఫాదర్ గడియారం. నేను ఇండియా లో వారింటనే చూశాను,.
వారి డైనింగ్ టేబుల్ ఒక ప్రక్క మడచి ఉంది. దానికి నగిషీలతో ప్రత్యేకంగా వుంది.
ఇంకో మూల చెస్ కాయిన్స్ చూడగానే రా రమ్మని, ఆడమని మనలని ఆహ్వానిస్తూ, రాజులూ రాణులు బంటు శగటు పిలుస్తూన్నాయి. ఇత్తడి ఆ పరివారం బావుంది.
వారి అలమారలలో పింగాణి వస్తువులు, అందమైన నగషీలు, అంచులు చెక్కుళ్ళు ల రంగులు కన్నులకు మైమరపుగా కనిపిస్తున్నాయి.
ఇక ఇత్తడి గణపతులు బారులు, బారులుగా.
ఇత్తడి పాత గిన్నెలు, బాండిలు, చెంబులు, మరచెంబులు… గ్లాసుల దొంతరలు ఒకవైపు, లక్ష్మీ దీపాలు మరోకవైపు…. ఇలా చెబుతూ వెడితే ఆ లిస్టు ఆగదు.
ఇంకా చాలా వారి అటుక మీద, వారి గెస్టుహౌసులో వున్నాయని చెప్పారు.
ఉప్పల్ లోని వారు ఇంట్లో కొద్ది సంవత్సరాలకు పూర్వం దొంగలు పడి వారి చాలా కలెక్షను ఎత్తుకు పోయారుట. పోలీసులు కూడా పట్టుకోలేకపోయారని వివరించారు. వారికి ఈ అలవాటు చాలా చిన్నపట్నుంచి వున్నా, మధ్యలో ఆపినా మళ్ళీ తిరిగి పునః ప్రారంబించామన్నారు.
సుధ వారి శ్రీమతి స్నేహంగా పలకరించారు. వెచ్చటి తేనీరిచ్చారు. ముచ్చటైన వారి పిల్లలు సుమేధ, సింధు.
వారు నాకొక ఇత్తడి మరచెంబు ఒక చిన్న గణపతిని బహుమతిగా ఇచ్చారు.
నాకు పురాతన వస్తువులు సేకరించేవారి గురించి విన్నాను కానీ ప్రత్యక్షంగా కలవటం ఇదే మొదటిసారి. చాలా ఉత్సుకతగా అనిపించింది. వారి కలెక్షను చూడటం, వివరాలు తెలుసుకోవటం సంతోషం కలిగించింది!!
సంధ్యాయల్లాప్రగడ