తెలుగు సాహిత్యాన్ని ఎందరో మహానుభావులు సుసంపన్నం చేస్తూ, అద్భుతమైన సాహిత్యాన్ని పండిస్తున్నారు.
సాహిత్యంలో ప్రేమ కథలు హృదయానికి అతుక్కుపోయి, చదువరులను చదువుతున్న రచనతో అనుసంధానం చేసి, తమ కథే అది అన్న భావన కలిగిస్తాయి.
అలాంటి ప్రేమ కథలు,హృద్యమైన శైలితో ,చదివే వారిని ఊహాలోకాలు తీసుకు పోయే రచనలు, రచయితలూ మనకు చాలా మంది ఉన్నారు. వారిలో అత్యంత చిన్న వయస్సులో రచనలు మొదలు పెట్టి, తెలుగు హృదయాల్ని హోల్ సేల్ గా దీపావళి ధమాకా లో కొట్టేసిన రచయిత్రి మాత్రం ఒక్కరే ఉన్నారు. వారే బొమ్మదేవర నాగకుమారి.
రెండు నెలల క్రిందట వారిని కలిసినప్పుడు చాలా సంతోషం వేసింది. వారూ ఎంతో అభిమానంగా పలకరించారు నన్ను. ఎంతో మృదువుగా, చాలా స్పష్టంగా తమ భావాలూ చెప్పగలిగే నాగకుమారి గారితో ఒక సాయంత్రం గడపటం నాకు కలసి వచ్చిన దీపావళీ అదృష్టమే కదా!! మొన్నోరోజు సాయంత్రం వారి కార్యాలయంలో ఇద్దరము కలసి మనసులు విప్పి మాట్లాడుకున్నాము.
వారి రచనా ప్రస్థానం నుంచి… నేటి స్త్రీ వాద రచనల వరకు, బాలా నందం నుంచి అట్లాంటా వరకు మా సంభాషణ సాగింది.
నాగకుమారి గారి మీద వారి అమ్మగారి ప్రభావం చాలా ఉంది. తల్లిగారు ఒక గొప్ప సాహిత్య అభిమాని. వారి ఇల్లు ఒక గ్రంధాలయం. అందుకే నాగకుమారి గారు చాలా చిన్న వయసులో తిలక్ అమృతం కురిసిన రాత్రి వంటి కవిత సంపుటి నుంచి వివిధ సాహిత్యం ప్రక్రియలు,నవలలు చదవటం అలవాటు అయ్యింది.
వారు ఒక బాల మేధావి. తన 5 వ తరగతిలో వున్నప్పుడు, వారి మొదటి కథ బాలానందం లో వచ్చింది.
ఆనాడు పట్టిన కలం దించలేదు మరి. నేటికీ వారి కలం నుంచి జాలువారిన ప్రేమను పాఠకులు ఆరాధిస్తూనే ఉన్నారు.
భాష మీది చక్కటి పట్టు వారిని రేడియో టాక్ షో కి అవకాశం కలిగించింది.
ఆనాడు కాలేజీలకు వివిధభారతి వంటి రేడియో వారు వచ్చి విద్యార్థులతో కళాశాలలో కార్యక్రమాలు జరిపే వారు. అలాంటి ఒక సందర్భంలో వీరి బాషను చూసి టాక్ షో కి పిలవటం, అప్పట్నుంచి నాగకుమారి గారు రేడియో షో లో పాల్గొనటం మొదలయ్యింది. నేడు వారు టీవి టాక్ షో లలో కనిపించే ప్రముఖ వ్యక్తి.
వనితా మహావిద్యాలయం లో డిగ్రీ చదివిన ఆ రోజులు వారికి ఎంతో ప్రముఖమైన రోజులు. ఎందుకంటే వారు డిగ్రీ 2 వ సంవత్సరంలో ఉండగా ‘ఆంధ్రభూమి ‘ లో ధారావాహికంగా వారి మొట్ట మొదటి నవల వచ్చి, అశేష తెలుగు హృదయాలను దోచి,నేటికీ వారిని అభిమానులతో కలుపుతోంది. అదే నవల నన్ను వారితో ఈ సాయంత్రం గడిపేలా చేసింది మరి.
ఆ నవల గురించి నాగకుమారి ఇలా చెప్పుకుంటూ వచ్చారు….. “కవిత్వం ప్రతి వారిని చాలా త్వరగా కనెక్ట్ చేస్తుంది… అదీ చిన్న వయసులో ప్రేమ కవిత్వం అయితే మరీనూ…” అలా చాలా కవిత్వం రాశారు నాగ కుమారి.
భావ కవిత్వం మీద వారికున్న పట్టు కూడా మనను వారి నవలలకు దగ్గరచేసింది. నవలలో చక్కటి చిన్న చిన్న కవితలతో నవలంతా ఒక భావ కవిత్వపు సంపుటిలా వుంటుంది.
ఆ నవల రాయటానికి పూర్వం,
ఆంధ్రభూమి లో వచ్చే సెంట్రల్ పేజీ కోసం ఒక వాస్తవమైన కథ రాయటానికి నారాయణగూడ లోని వట్టివేళ్ల కార్మికుల జీవిత ప్రస్థానం రాశారు. దానికి ఫోటో ల కోసం టాక్ షో ల నుంచి వచ్చిన డబ్బు వినియోగించారు. ఆ ఫోటో లు, కథా, ఒక కవిత, ఒక చిన్న కథా ఇత్యాదివి తీసుకొని ఆంధ్రభూమి ఆఫీస్ కి వెళ్ళారు. ఆనాడు ఎక్కిన ఆ మెట్లు ఆవిడను అందలానికి తీసుకు వెళ్లిన మెట్లు.
ఆనాడు ఆఫీస్ లో అవి తీసుకొని, పంపించేశారుట. కొన్ని రోజులు ఎదురుచూసినా పబ్లిష్ కాలేదని నిరుత్సాహపడటం, ఆరు నెలల తరువాత వరసగా చకచకా అన్ని పబ్లిష్ కావటం జరిగింది. అలా వచ్చాక ఇంకా చిన్న చిన్న కవితలు ఇస్తూ ఉంటె, ఎడిటర్ కనకాంబరరాజు గారు నవల రాయమని సలహా ఇచ్చారుట. మొదట నాగకుమారి భయపడ్డారు. ఎడిటర్ గారు ధైర్యం చెప్పి వప్పించాక మన ముందుకు వచ్చింది వారి మొట్ట మొదటి నవల
“పయనమే ప్రియతమ”.
ఆ నవల పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేసింది. అది ఒక కవిత్వం…. ఒక భావ కవిత్వం…. ఒక జీవితం…. ఒక అమ్మానాన్మ ప్రేమ కథ…. సున్నితమైన శైలితో, హృదయాన్ని తడుతూ, తడుపుతూ సాగె ఆ నవలకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు…
కొన్ని వారాలలో నాగకుమారి గారి ఫోటో కవరుపేజీ లా వచ్చేంతగా.
నాటి నుంచి నేటి “హృదయం ఎక్కడ ఉన్నది” వరకు నాగకుమారి గారి కలం నుంచి జాలువారిన వసి వాడని పారిజాతాలు ఎన్నో.
సుగంధాలు విరజల్లుతూ… సున్నితమైన సొగసులను అలవోకగా అందిస్తూ మనలను మరో ఊహ ప్రపంచానికి తీసుకుపోయే సాధనాలు వారి నవలలు. మృదువుగా సాగే జలతరంగిణి వారి శైలి.
స్త్రీ వాద సాహిత్యం, ఫెమినిజం గురించి చాల సింపుల్ గానే అయినా స్పష్టంగా చెప్పారు. అందుకే వారి నాయకలు కూడా చాలా క్లియర్ గ సింపుల్ గా అయినా చాల స్ట్రాంగ్ గా అభిప్రాయాలూ చెబుతూ ఉంటారు. “మాటల తూటాలు, కాదంటే రోడ్డుమీదికి వెళ్ళటం కాదు స్వేచ్ఛ అంటే, మనకు కావలసినవి ఏమిటో తెలుసుకోవటం , వాటిని స్పష్టంగా పొందటం స్వేచ్ఛ…”
అని చక్కటి నిర్వచనము చెప్పారు. వారు టీవిలలో కూడా చాలా విషయాలను వివిధ సందర్భాలలో సుస్పష్టం చేస్తూనే వున్నారు.
స్త్రీ స్వేచ్చకు ప్రాముఖ్యత గురించి వారికి స్పష్టమైన, నిర్దిష్టమైన అభిప్రాయం మనలను ఆనందపరుస్తుంది.
మూస విధానాలను వారు చాలా సార్లు ఖండించారు కూడాను. మార్పును సహృదయంతో స్వాగతించారు. విచ్చలవిడి విశృంఖలతను వ్యతిరేకించటానికి సందేహించరు కూడా.
వారి సమయ పాలన మరో అద్బుతమైన విషయం. మృదువైన వారి హృదయం మబ్బులచాటు చంద్రునిలా తళుకు లిడుతూ స్నేహాన్ని అందిస్తూ నే వుంది. వారు ఇలాంటి ఆహ్లాదకరమైన రచనలు మరిన్ని అందిస్తూ విజయ పరపరంలో సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
సంధ్యా యల్లాప్రగడ