నీల’ ను సృష్టించిన బ్రహ్మతో సమయం – మధురం!!
“సంఘమందు పుట్టి సంఘమందు పెరిగి
సంఘజీవి కాడే సాటి నరుడు…
సంఘ వృద్ధి లేక స్వాభివృధి లేదు
నవయుగాలకు బాట నార్ల మాట ”
అని పూర్వం నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పినారు.
మనం మన చూట్టు ఉన్న కమ్యూనిటీకి మన వంతుగా ఎదో ఒక విధంగా సాయం చెయ్యాలి. మామూలు మానవులకు కొంత భాద్యత ఉన్నా, రచయితలకు ఆ బాధ్యత మరి కొంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి భాద్యత ఎరిగి రచనలు చేసేవారు మనకు అదృష్టం కొద్ది తెలుగులో ఉన్నారు.
కొంత బాధ్యతతో రచనలు సాగిస్తే వారికి రంగులద్దటం అనాదిగా ఉన్నా, అలాంటి రంగులకు అందకుండా, నలుపు తెలుపులతో తమ వ్యాసాల రచనలను సాగిస్తూ, ప్రజా జీవితాలను దర్పణంలో చూపుతున్న వారిలో మల్లీశ్వరి గారు ముఖ్యులు .
ప్రజా జీవితాలలో పెనవేసిన వివిధ ఇజాలను గురించి తన మనసులోని మాటల మనకు చెబుతూవుంటారు. మన చుట్టూ ఉన్న సంఘంలో జరిగే అన్యాయాలకు, “గను వంటి పెన్ను” తో ప్రజా సమస్యలకు స్పందిస్తూ సాగుతున్నారు వీరు. ఆ స్పందన వ్యక్తిగతంగానే కాకుండా, సంఘటింపచేయ్యటానికి “ప్రజా రచయితల వేదిక” (ప్ర ర వే) ను స్థాపించటంలో, ముందుకు తీసుకువెళ్లటం లో కీలకపాత్ర పోషించారు. మొన్ననే వారి వార్షిక సమావేశాలు కూడా విజయవంతం గా నిర్వహించారు కూడా.
ప్రజాస్వామ్యంలో అలాంటి వేదికలు ప్రభుత్వానికి చెక్ పెడుతూ… ప్రజా ప్రక్షాన నిలబడే మిత్రులవంటివి. మొన్న వారు ‘అక్రమ అరెస్టుల’ మీద చూపించిన సంఘీభావాన్ని ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పలేదు మరి.
వారు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నా, ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉంటూ, మేంటోర్లా వారికి దారి చూపుతూన్నారు. వారు మొదలుపెట్టిన “గోడ పత్రిక” విజయవంతమైన ఒక సంవత్సర కాలం జరుపుకుంది కూడా ఈ మధ్యనే.
అన్నిటికి మించి వారు రాసిన “నీల”- తానా బహుమతి అందుకోవటం ఒక ఎతైతే, ప్రజల అభిమానం పొందటం వారికి తెచ్చిపెట్టిన మరో విజయం.
ఇన్ని విజయాల పరంపరలతో మునుముందుకు దూసుకుపోతున్న మల్లీశ్వరి గారిని నీల చదివిన ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. కలవాలని ఉవ్విళ్ళూరుతారు.
నేను కూడా ‘నీల’ను రాసిన ఆ చేతిని తాకాలని, ఆ మనసును దర్శించాలని చాలా కలలు కన్నాను. వైజాగ్ వెళ్ళి కలవాలని ప్లాన్ చేసుకున్నాను కూడా. కానీ, వారే సెమినార్ కోసం భాగ్యనగరం వచ్చి, వారిని కలిసే భాగ్యం నాకు కలిగించారు.
ఎవరినన్నా కలవటంకోసం నేను చాలా తక్కువ సార్లు ఉద్వేకంగా ఎదురుచూస్తాను. మల్లి గారిని కలవటానికి నేను చాలా తత్తరబిత్తర పడ్డాను. మా అమ్మాయితో ముందురోజంతా ఈ విషయం మట్లాడుతునే వున్నాను.
ముందు రోజు వారితో కలవటం గురించి ప్లాన్ చేస్తూంటే, ఆవిడ లంచ్ కు కలుద్దామన్నారు.
నాకు తెగని ఆనంద మేసింది. కొద్ది సేపైనా హాయిగా కూర్చొని, మనసు విప్పి మాట్లాడవచ్చని.
ఆ చెట్నీస్ దగ్గర వున్న మధ్యాహ్నం ఎండ కూడా వెన్నెలలా కాసిందనిపించింది నాకు.
వారు తలుపు తీసుకొని ఆ గదిలోకి ప్రవేశించినప్పుడు “సహజత్వానికి దగ్గరగా, విజయాల పరంపరలను అలవోకగా అందిపుచ్చుకొని, అభ్యుదయ వ్యక్తిత్వంతో అనిర్వచనంగా వెలుగుతున్న ఆ కాంతి” తో వెలిగిందో క్షణం ఆ గది నా దృష్టిలో. తనని చూసినప్పుడు నాకు కలిగిన భావాలు వర్ణనాతీతం.
నన్ను చూసి గుర్తుపట్టి దగ్గరకు తీసుకున్నారు తాను ఆప్యాయంగా. మేము మాట్లాడుకున్నంతసేపు మా మధ్యకు రాకుండా అక్కడి సిబ్బంది కూడా చాలా సహాయంగా ఉన్నారు.
మా మాటల జడివాన, అలా అలా నిముషాలను సాంద్రమైన సారవంతపు గంటలుగా మారుస్తూ సాగింది…
తప్పిపోయిన పాత మిత్రుల మధ్య
కబుర్లు ఎంతకీ తెగవు. మా పరిస్థితి అలానే వుంది నిన్న.
ప్ర.ర.వె. గురించి, నీల గురించి, వివిధ ఇజాల గురించి, సమాజపు రంగుల గురించి చాల విషయం పంచు కున్నాము.
అందులో ముఖ్యంగా ప్రతి వాదన లో కూడా హ్యూమనిజం గురించి విడమర్చి వివరించారు.
నిజమే, జీవితం లో ప్రతి మలుపులో ఒక సవాళ్లు ఎదుర్కొని, ఆ సవాళ్ళలోనే, సవాళ్లతోనే విజయం సాధించిన నీల గురించి మరింతగా ముఖ్యంగా ఎన్ని నియమాలున్నా అట్టగున్న కనీ,కనిపించక ఉన్నది మానవత్వమే కదా!!
‘కులాల రిజర్వేషన్స్ సరిఅయిన వారికి అందాలి, వాటిలో కొంత రిఫార్మేషన్ అవసరం’ అన్నారు.
అవును, మన రాజకీయాలలో కోరపడిన నిబద్ధత, మార్పు కోసం తాపత్రయం, ఉమ్మడి కుటుంబాలు తగ్గటం, ఎక్కువైన స్వార్థం,గే మ్యారేజెస్, ట్రాన్స్ జెండర్స్, స్వేచ్ఛ…..అన్నింటీని ఆ మధ్యాహం ముచ్చటించుకున్నాము…. స్త్రీ స్వేచ్ఛకై కలవరించిన చలంని కూడా పరామర్శించాము.
అన్ని అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకున్నాక నన్ను ఒక్కటి అడిగారు .
“నీల మూలంగానా నన్ను కలవాలని అనుకున్నది?” అని….
‘అవును’….
నీల ఉక్కిరిబిక్కిరి చేసిన నవలారాజ్యం….
నేటి సమాజానికి నికార్సయిన దర్పణం….
సమకాలీన సమాజములో ఆరవిచ్చిన నీలమణి….
స్త్రీలకు ఆశను పంచిన సూచిక….
అందుకే నన్ను బాగా కదిలించింది. వారి దాకా నడిపించింది.(అందులో నీల కు అంతా మంచే జరుగుతుంది, వాస్తవం లో అది కష్టమైన విషయం).
కొంత సేపు మా అమ్మాయి చదువు, యాక్టీవిజం, ఫెమినిజం, జెండర్ ఈక్వాలిటీ… ఇత్యాదివి మాట్లాడుకున్నాము….
నా ఆధ్యాత్మికత గురించి అడిగారు…. తన బిలీఫ్స్ గురించి చెప్పారు….
వారి పరిచయంతో సొగసైన మల్లె సువాసనల ధీర గంభీరం నా చుట్టూ పరచుకుంది.
రమ్మని వారి చరవాణి పలికింది….
ఇంకా తప్పక వెళ్ళాల్సిన సమయం వచ్చింది.
వారిని వారి వసతి గృహం వద్ద దింపి నేను సాగిపోయాను….
నిండిన హృదయంతో..
తన ఆటోగ్రాఫ్ చేసిన “నీల’ ను పొదిగి పట్టుకొని!! ఆ బొడ్డుమల్లెల సువాసన ఆస్వాదిస్తూ …
సంధ్యా యల్లాప్రగడ
భాగ్యనగరము




