బౌద్ధ సింహళం

ప్రయాణాలు చెయ్యాలంటే ముందుగా చాలా ప్లాన్ చేసుకుంటాము. బడ్జెట్, హోటల్, టికెట్స్, చూడవలసిన ప్రదేశాలు, కలవవలసిన మనుష్యులు ఇత్యాదివి.
కొందరు మా అమ్మాయిలాంటి అతిగా ప్లాన్ చేసేవారు ఒక లిస్ట్ చేసుకు ఉంచుకుంటారు. నిముష నిముషానికి ఎక్కడ ఉండాలి, ఏమి చెయ్యాలని. ఆలా చేసి, బడ్జెట్ను తక్కువగా చూపించి, అప్రూవలు  చేయించుకొని ఇప్పటి వరకు 20 దేశాలు తిరిగేసింది తను.
కొందరుంటారు ‘డైనమిక్’ గా ప్రయాణాలు సాగిస్తారు. వీకెండ్ వచ్చిందంటే ‘చలో’ అనుకోని, రైల్లో బసో చూసుకొని వెళ్లి టికెట్ కొనుకొని ఎక్కి ఎదో ఒకచోటోటికి వెళ్లి వస్తారు.
అలాంటి వాళ్ళు సడన్ గా చుసిన వాటికే వారికి కంఫర్ట్ ఉంటుంది. మూడు నెలల ముందు ప్లాను చేసుకోవాలంటే – ‘అయ్యా బాబాయి’ అనేస్తారు.
మా తమ్ముడొకడు అలానే వీకెండ్ వస్తే, కారు తీసుకొని  ఎదో ఒక దేవాలయమో, ఒక పుణ్య క్షేత్రంలో చూసి, టిక్ కొట్టేసుకుంటూ ఉంటాడు. అలాంటివి బానే ఉంటాయి. దీనికి ముందు ప్రిపరేషన్ అక్కర్లేదు. నాలుగు రోజులు సెలవలు వస్తే చాలు… ‘చెలో’ అనెయ్యటం…… ఒక కొత్త ప్రదేశానికి ‘హలో’ చెప్పేయటం. ఇది మరో రకం.

ఏది ఏ రకమైన చేసిన యాత్ర మూలంగా కొంత ఆనందం, కొంత విజ్ఞానం ఉండాలి కదా!!
మాకు అలా శ్రీలంక యాత్ర మూలంగా విజ్ఞానం, మా అమ్మాయిని చుసిన సంతోషం, (తాను అక్కడ రీసెర్చ్ చేస్తోంది ప్రస్తుతం) డైనమిక్ గా  ప్లాన్ మార్చి కొత్తవి చేర్చి ఏవో కొంతలో కొంత చూసామన్న సంతోషం కలిగించినది.

శ్రీలంక లో మొదట మనం కాలు పెట్టగానే గమనించే విషయం హరితం, శుభ్రం. ఆ దేశం చాలా పరిశుభ్రం గా ఉంటుంది. ప్రపంచ దేశాలలో సింగపూర్ తరువాత రెండో స్థానానికి శ్రీలంక పోటీపడుతోందిట! మరి ఎంత శుభ్రంగా ఉంటుందే  మనము వూహించవచ్చు.
ప్రజలు చాల స్నేహంగా ఉన్నారు. టూరిజం వాళ్లకు ప్రముఖ ఆదాయం అందించే ఇండస్ట్రీ.
వాతావరణం కొంత మన చెన్నై, వైజాగ్ ను పోలి ఉంటుంది. మేము ఉన్న నాలుగు రోజులలో ముందు మా అమ్మాయి, శ్రీవారు కలసి రెండు ముఖ్యమైన స్థలాలు చూసి రావాలని ప్లాన్ చేశారు. అందులో ప్రముఖమైనది, నేను కోరుకున్నది త్రికోమలీ.
త్రికోమలీ శ్రీలంక తూర్పుతీరం లో వున్న శక్తి పీఠం. అమ్మవారు అక్కడ శాంకరి దేవి అవతారం. ఆ దేవాలయ ప్రాగణం చాల పెద్దది కానీ డచ్ వాళ్ళు ఆక్రమణలో చాలాభాగం నాశనము చేయ్యబడింది. ఒక్క ముఖ్యమైన గుడి మాత్రమే ఉన్నది. చూట్టూ చిన్న చిన్న కొట్లు మాత్రమే ఉన్నాయి. అసలు ఆ గుడి ఉన్న భూభాగం సముద్రం లోకి చొచ్చుకు పోయి, మూడు వైపులా సముద్రం తో  పెద్ద చెట్లతో కూడి చాలా సుందరముగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. జింకల విచ్చలవిడి గా తిరుగుతూ, సామరస్యం  చూపిస్తూ అద్భుతంగా ఉంది. మేము అక్కడికి చేరిన రోజు రాత్రి ధూళి దర్శనం చేసుకున్నాము. మరురోజు ఉదయం 7గంటలకు కి వెళ్ళాము. 8 గంటల కు పూజ అన్నారని వెయిట్ చేశాము. మన దేవాలయాలలో లాగా మన పేరు తో అర్చన చెయ్యలేదు వారు. మేము ఇచ్చిన పళ్ళను అమ్మవారికి నివేదించి ప్రసాదం మాత్రం ఇచ్చారు.

అసలు కొలంబో నుంచి మేము ఒక క్యాబ్ తీసుకొని త్రికోమలీ రావాలి. చివరి నిముషంలో నాకు ‘అనురాగపురం’ కూడా చూడవచ్చని అనిపించి, దాన్ని కూడా కలిపి ప్లాను చేశాము. దానికి ఆ వాహన చోదకుడు 5000 శ్రీలంక రూకలు ఎక్సట్రా ఇవ్వమన్నాడు. సరే కానియ్యమని బయలు చేరాక అర్థమైంది మా డ్రైవర్ చిలకమర్తి వారి గణపతి కి తమ్ముడిని. ఇంకా మా రెండురోజుల ప్రయాణం లో కావలసినన్ని నవ్వులు  పూశాయి అతని అమాయకత్వానికి వాహన ప్రేమకి, వెర్రికి.

శ్రీలంక లో బౌద్ధం వెల్లివిరుస్తోంది. ఎక్కడ చూసినా బుద్ధా విగ్రహాలే. ప్రముఖ కూడలిలలో, పర్వతాలలో, గుహాలలో, చరిత్రలో. అనురాధపురం లో కూడా చాలా చైత్రాలు, స్తూపాలు, బోధి వృక్షాలు, మహా బోధి ఇత్యాదివి ఉన్నాయి. అనురాగపురం వారి పూర్వ రాజధాని.
1 వ శతాబ్దపు ఆ బుద్ధ ఆరామాలు అక్కడంతా.
మహా బుద్ధుడు ఆ ఆరామములో చాల కళగా ప్రశాంతంగా ఉన్నాడు. మహా బోధి వృక్షం , తధాగతుడు జ్ఞాన దీపం వెలిగిన వృక్షము నుంచి కొమ్మ తెచ్చి నాటిన చెట్లు. బౌధులకు పరమ పవిత్రమైనది. దాన్ని సమీపించటానికి కూడా రాదు. మాకు అక్కడి సెక్యూరిటీ వాళ్ళు కొన్ని ఆకులు దయతో ప్రసాదించారు.
అక్కడి ఆ పుపాతన కట్టడాలు చాలా బావున్నాయి. బుద్ధ స్తూప, చైత్ర, భోది ఇత్యాదివి దర్శించి బయలుచేరాము.
మేము అక్కడ్నుంచి త్రికోమళీ దేవాలయానికి.
త్రికోమలీ అమ్మవారి దర్శనం తరువాత మా ప్రయాణం క్యాండీ కి. దారిలో సిరిగిరి వున్నా 3000 మెట్లు ఎం ఎక్కుతాం లే అని దమ్బూలా వద్ద ఆగాలని నిర్ణయించుకున్నాము. మూడు గంటలు పట్టింది మాకు ఆ130 కిలోమీటర్లకీ. దంమ్బూలా పంచ గుహల ఆరామాలు, చైత్రాలు. ఎక్కడ చూచినా బుద్ద దేవుని విగ్రహాలే. 5 గుహలకీ కలపి మొత్తం 1000 బుద్దుని చిత్రాలు, 500 మూర్తులు.
మహపరి నిర్యాణ బుద్దుడు, (మరణించిన బుద్ధుడు) నుంచి శయనించిన బుద్ధుని వరకూ వేరు వేరు మూర్తులు.
అర్ధ నీలి నేత్రాలతో, వికసించిన పెదవులతో, తలపై జ్ఞాన పద్మముతో, కరుణ నింపిన కరి ముద్రలతో, అనంతమైన శాంతిని తో కూడిన  అనంతమైన ప్రేమను ప్రపంచానికి పంచిన ఆ తదాగతుని సమక్షములో నమ్రతగా శిరసు ఆన్చి, మా ప్రణామాలు, తెచ్చిన కమలాలు సమర్పించి, కొంత ధ్యానించి వచ్చాము.

క్యాండీ కి చేరే సరికే మధ్యహానము మూడు. క్యాండి పర్వతాలపైన వున్న పెద్ద పట్టణం. కొలొంబో తరువాత క్యాండీ పెద్దది. చాలా మంది యాత్రికులతో , టూరిష్టు నగరమని చూడగానే అర్థమవుతుంది.
తదాగతుని స్తూపము చాలా ప్రముఖమైనది. బుద్ధుని పంటి మీద నిర్మించిన ఆ స్తూపము వారి పరమ పవిత్రమైనది. ఈ దేవాల ప్రాంగణం విశాలంగా వుంది. బౌద్ధ మంత్రాలు సదా వినవస్తూన్నాయి. స్తూపము బంగారముతో చేసి వుంది. చాలా నగలు కూడా తగిలించారు దానిపై.
ద్వాలయం లో నగిషీలు, కొమ్మ బూర తో సంగీతము బావున్నాయి. మంచి శాకాహార భోజనము, దొశల వంటి వి దొరుకుతాయి. అక్కడ ఒక రాత్రి వుండి మరురోజు కొంత షాపింగు చేసిక్యాండి నుంచి రైలులో కొలంబో వచ్చేశాము. శ్రీలంకలో ఈ రైలు ప్రయాణానికి మంచి పేరు వుంది. రైళ్ళు కూడా చాలా పరిశుభ్రంగా వున్నాయి. సమయపాలన కూడా ఎన్న తగ్గది.

శ్రీలంకలో టీ పొడి, జెమ్ స్టోన్స్ తప్ప మరోటి తయారుచెయ్యరు. అన్నీ భారతం నుంచి కానీ, చైనా నుంచి కానీ దిగుమతి చేసుకుంటారు.
కొలంబో లో కానీ మరో చోట కానీ తేలిక గా తిరగటానికి ఆటోలు (టుకుటుకు అంటారు) వున్నాయి.
తమిళం తెలిస్తే చాలా సులువు. ఇంగ్లీషు కూడా వాకే.
సింగళీకులకు, తమిళులకు మధ్య కనపడని క్లాసు భేదం వుంది. అది మనకు కనపడుతుంది చూచాయగా.

సింహళీలు తాలీ అన్నం చుట్టూ వివిధ పదార్థాలు వడ్డించి ఇస్తారు. మనలా విడివిడిగా వుండవు. వారి ఉదయపు అల్పాహారము పాలు కలిపిన అన్నము. మాంసాహారం ఎక్కువ. అంత బౌద్ధం వెల్లో విరిసినా కూడా విరివిరిగా చేపలు కలిపి తింటారు. మనం చాలా స్పష్టం గా చెబుతూ వుండాలి శాకాహారము గురించి.
వారి వస్త్ర ధారణ చీర తిప్పి కట్టుకోవటం. మనం కుచ్చెళ్ళు  విసనకర్రలా పరుచుకుంటాము. వాళ్ళు పైన కొద్దిగా కుచ్చులులా పరుస్తారు. అసలు చీరను లుంగీలా చుడతారు.

అలా మా శక్తిపీఠ దర్శనము, శ్రీలంక పర్యటన పూర్తి కావించుకొని హైద్రాబాదు వచ్చేశాము.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s