కొందరు సౌందర్యాన్ని ఆరాధించి కవిత్వం చెబితే,
కొందరు సంఘం మీద తమ బాధ్యతను కవిత్వంలో పలికించారు.
ఏది ఏమైనా కవిత్వం కవి యొక్క జీవిత గాధ.. బాధ…
హృదయాన్నీ రంజింపచేసినా…
మనసును ఉరకలు పెట్టించినా ,
జనులను ఉద్యమింపచేసినా అది ఒక్క కవిత్వానికే సాధ్యం….
కవిత్వానికున్న బలం అది…
అది అడవులలో గీతమైనా…
రాజాస్థానాలలో వెలిగినదైనా…
కవిత్వం బలమైనది. అలాంటి కవే నిరంకుశుడు కూడా.
అలాంటి కవిత్వంలో కవి బాధ్యతతో
ప్రభుత్వాలను మార్చిన ఘనత చరిత్రలో కనపడుతుంది. గంభీరమైన విషయాలను చెప్పేటప్పుడు, ఘన సమాసాలు, భారమైన మాటలు అక్కర్లేదు.
అలాంటి సమాయాలలో మనకు కనపడే అరుదైన కవయిత్రి మెరెజ్ ఫాతిమాగారు. చిన్న చిన్ని మాటలతో నిగూఢమైన అర్దాలను నింపుతూ, సమాజంలో మన బాధ్యతను గుర్తుచేస్తూ, మన నిబద్దతను ప్రశ్నిస్తూ… సాగే కవిత్వం ఆమెది.
ఆకలి మీద ఎక్కు పెట్టినా,
స్త్రీ ల సమస్యలను చర్చించినా, చిన్నారుల బాల్యం గుర్తుచేసినా
పదునైన ఆ కలం చురుకుగా మన ఆలోచనలను కోస్తూ…
క్రొంగొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.
స్త్రీవాద కవిత్వమైనా పురుషులలో
పుణ్య పురుషులను మరవవద్దని హెచ్చరిస్తారు ఆమే.
భావుక సదస్సులో జరిగిన కవులను సన్మానించుకునే సందర్భాన, నేను ఆమె చెప్పిన కవిత విన్నాను.
కత్తి కన్నా పదునుగా, వాడిగా, వేడిగా వున్న ఆ కవిత ఆమె తన కంఠంలో చాలా గంభీరంగా పలికించింది.
ఆమెను అంతకు పూర్వం నేనెరుగను…. కవితలూ పెద్దగా చదవలేదు తనవి. అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నా..
ఆమే అంత ఆర్థ్రంగా… ఆర్తిగా…
నరనరాలు కరిగేలా… తన జాతి జనులు పాడుకోవాలని… మార్పు కోసం…తన వంతుగా కలం పట్టారేమో. ఆమే కవిత్వం సూటిగా వుంటుంది. స్పష్టంగా చెబుతారు ఆమె. మనందరి గడ్డ గట్టిన హృదయాలపై చన్నీరు జల్లి పూల వనం పెంచే బాధ్యతను తలకెత్తుకున్నారులా వుంది.
వారి ‘అంతర్వేదన’ వారి లోలోని మనసును కాగితం మీద పరచిన వనం.
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక శ్రీ.శ్రీ. ఒక తిలక్, ఒక కృష్ణశాస్త్రి కలసిన ఒక మెరిజ్ ఫాతిమా!!
వారి పుస్తకం చేతికందగానే నన్ను ఎక్కువ ఆకర్షించినది వారి రెండవ ప్రకరణం.
వారందులో కవిగా తన కలం నుంచి తన చుట్టూ వున్న సమాజానికి ఎంత మంచి పంచగలరో ఆర్తిగా వెతుక్కున్నారు. అంతగా కదిలించారు చదువరులను.
ఆకలి కేకలకు చలించే వారి కవితలు వాటి గురించి పదే పదే పదునుగా చెబుతాయి.
కొన్ని ఉదాహరణకు:
“ఆ చిన్న బొజ్జలను నింపటానికి ఏ అక్షయ పాత్రను ఆశ్రయించగలను…” అని వాపోతారు.
“ఓర్పు పడవ ఓటిదవుతొంది…
అయినా వివేకం పిల్లి మొగ్గలేస్తోంది….
లేమితనం మచ్చలా అచ్చు పడిపోయింది”….;
“బాల కార్మికులు ఉండరాదన్నారు, మరి బాల్యమే లేని నేను ఏ కోవకొస్తాను?…”
“పెదవి దాటని మాటలు గొంతులో విచ్చుకత్తులై గుచ్చుతుంటే విరాగమౌనికనై…..”
“మడుగుల కొద్దీ మౌనాన్ని మేస్తూ”….. అని తన అంతర్వేదనను పలికించారు.
ఆకలి గురించి అన్నదాతల గురించి చెప్పిన వారు “అందరూ కడుపు నిండా అన్నం తినే రోజు వస్తుంది” అన్న ఆశాదృక్ఫదంతో చెబుతారు.
“నీలో, నాలో సంస్కారం మెండుగా ఉన్నప్పుడు ఒకరినొకరు మన్నించుకొనేందుకు ఆలస్యమెందుకన్న “? అన్న ఆశను పంచినా…బాధ్యత తెలిసిన కవయిత్రి వారు.
అందరికి వున్నంతలో మంచి చెయ్యమని, మంచి పంచమని చెబుతూ
“మట్టి దుప్పటి కప్పుకోవలసిన మనిషి జన్మకి,
మంచి చేసి పోవాలనే ఆలోచన వస్తే చాలనుకుంటా” నంటారు.
తనలోన లోలోనికి వెళ్ళిపోయిన శోదన వుంది ఆమె కవిత్వంలో.
“ఆకృతి కోల్పోయిన నా మనస్సును కుదించి కుట్టేసుకున్నా”…. అన్న ఫాతిమా గారి కలం నుంచి వెలువడే ముత్యాలు రోజూ వారి ఫేస్ బుక్కు గోడ మీద ప్రతిఫలిస్తున్నాయి.
మెరాజ్ ఫాతిమా గారు మిమ్ములను కలిసుకోవటం నిజంగా మలయమారుతంలా వుంది.
పుష్పించిన పారిజాతపు చెట్టు క్రింద నిలబడి జలజలా రాలిన పువ్వుల సుగంధం లా…. మళ్ళీ అంతలోనే తట్టిన బాధ్యతలా వుంది.
మీరు కవితలతో ప్రజలలో మార్పుకై, మీ కలాన్నీ ఎక్కుపెట్టే వుండాలనీ…. మాలాంటి వారు కోరుతున్నది. మీరు కోరిన మార్పు తప్పక మనం చూస్తామని నా మనస్సు చెబుతోంది.
ప్రేమతో
సంధ్య.
అట్లాంటా.