శ్లో।। ఓం కారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవః ।
అకారోకారమాకార ఏతే సంగీత సంభవాః ।।
ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము పుట్టెను. అందులో అకార, ఉకార, మకారముల వలన సంగీతము సంభవించినదని అర్థం.
సంగీతము భాషా భేదాలు లేకండా సమస్త ప్రాణులను అలరించే గుణం కలిగి వుంది.
అలాంటి మధురమైన సంగీతము లో శాస్త్రీయ సంగీతము తల్లి వేరు వంటిది. శాస్త్రీయ సంగీతమే మూలముగా వివిధ సంగీత రూపాలకు ప్రాణముగా విరాజిల్లుతోంది. మన శాస్త్రీయ సంగీతమును 72 మేళకర్త రాగాలుగా విభజించారు.
ఏ రాగమైనా ఈ రాగాలనుంచే వస్తుంది.
ఈ రాగాలను ఆలంబనగా చేసుకొని మన చిత్ర సంగీతము కూడా పూర్వం నిర్మించబడింది. (ప్రస్తుత సంగీతము కాదనుకోండి. ఇప్పుడు రిథమ్ బేసు సంగీతము)
అందుకే మన పాత చిత్రాల నుంచి వచ్చిన సంగీతము అంత మధురముగా వుండి, నేటికీ వినసొంపుగా, మనసుకు స్వాంతన నిస్తుంది.
అలాంటి సంగీతాలలో ‘శ్రీరాగము’ గురించి ఈ రోజు కొన్ని వివరాలు పంచుకునే ప్రయత్నం.
శ్రీ రాగము కు, శుద్ధ మధ్యమ రాగమైన ఖరహరప్రియ రాగము జన్యం.
శ్రీ రాగము ఔడవము. అంటే ఐదు స్వరములున్నది. శ్రీరాగముకి “స, రి,మ,ప,ని, స – స, ని, ప, ద,ని,ప, మ, రి,గ,రి,స” ఆరోహణ, అవరోహణలుగా కలిగి వుంది.
శ్రీ రాగము భక్తి, కరుణ, శాంత రసాలకు చక్కగా సరిపోతుంది. ఈ రాగమును అన్ని వేళలలో పాడుకొనవచ్చు. అన్ని లయలకు సరిపోయే రాగము. హరికథలలో, పౌరాణిక పద్యాలలో వెల్లువిరిసిన రాగమిది. అలాగే పూర్వం అన్ని సంగీత కచేరిలలో చివరగా శ్రీరాగముతో కచేరినీ పూర్తి చేసె సంప్రదాయము కూడా వుండేది.
శ్రీరాగ మెంత ప్రముఖమైన హాయి కలిగించే రాగమంటే శ్రీ త్యాగరాజ స్వామి వారు తన ఘన పంచరత్నాలలో ఓకటి గా ఈ రాగాన్నీ స్వీకరించారు. అసలు శ్రీ రాగ మనగానే మనకు వెంటనే త్యాగరాజ స్వామి వారి ప్రఖ్యాత “ఎందరో మహానుభావులు” గుర్తుకు వస్తుంది. అంత సహజ సుందరమైన భక్తి తొణికిసలాడు రాగమిది.
త్యాగరేజే కాకండా శ్యామశాస్త్రి,(కరుణచూడు నిన్ను నమ్మిన వాడు కదా..అంబ)
అన్నమయ్య,( వందే వాసుదేవం)
ముత్తుస్వామి దీక్షితారు (శ్రీ వరలక్ష్మీ)
వారు గూడా ఈ శ్రీరాగములో చేసిన ఈ రచనలు ప్రసిద్ధి చెందాయి.
సంగీతము నేర్చుకునే వారు శ్రీరాగములో తప్పక ఒక్కటైనా గీతము( మీనాక్షీ..జయ కామాక్షీ), కుదిరితే ఒక వర్ణము (స్వామీ నిన్నే కోరి)నేర్చుకుంటారు.
మన పాత చిత్రాలలో రాగమాలికలలో శ్రీరాగము తప్పక వాడేవారు.
తిరువీదులలో మెరసీ దేవదేవుడు – శ్రీరాగము
పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు – అన్నమయ్య
శ్రీ రాగములో కూర్చిన కొన్ని ప్రముఖ చిత్ర పాటలు :
1. అల్లూరి సీతారామ రాజు లో వస్తాడు నా రాజు ఈ రోజు –
2. గోరింటాకులో, గోరింట పూచింది కొమ్మ లేకుండా
3.శ్రీవారికి ప్రేమలేఖ లో తొలిసారి మిమ్ములను చూచింది మొదలు
4. బుల్లెమ్మ బుల్లోడు లో కురిసింది వాన నా గుండెలోన
5. జగదేకవీరుని కథ లో వరించి వచ్చిన మానవ వీరుడు
6.పదహారేళ్ల వయస్సు లో సిరిమల్లె పువ్వా,
7. భక్త కన్నప్ప లో ఆకాశం దించాలా
8. కార్తికదీపం లో. ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
కొన్ని ప్రముఖ రాగమాలికలలో:
1.మల్లీశ్వరీ – నెలరాజా వెన్నెల రాజా
2. గిరిజాకల్యాణం – అవధరించవయా
ఈ రాగము పాడటము, బాగా వినటము వలన థైరాయిడ్ లో హెచ్చుతగ్గులు మాయమవుతాయని అంటారు.
సంధ్యా యల్లాప్రగడ