స్వర్గసీమ
నా చిన్నప్పుడు – అంటే 1980 ప్రాంతాలలో… మేము ఉన్న ఇల్లు నాలుగు గదులతో…ఒకే వరసలో రైలు పెట్టలని తలపిస్తూ ఉండేది. పూర్వపు వారికి ఒకే వరసలో 7 ద్వారాలు ఏర్పాటు చేసిన తరువాత మార్చాలనే ఒక నియమం ఉండేదట.అందుకే ఆ ద్వారాలు అలా వుండేవి. అవి కూడా గోడకు మధ్యలో ఉండేవి. అలాంటి ఇళ్లలోనే అంతా పెరిగారని కాదు కానీ, నా మిత్రులు చాల మంది ఇళ్ళు దాదాపు అలానే ఉండేవి.
ఇది తెలంగాణ లో నేను పెరిగిన మా ఊరిలో ఇల్లు.
ఇలాంటి ఇంటికి ఎలా సర్దినా కంటికి ఇంపుగా ఏమీ ఉండదు. దానికి తోడు ఒక లెక్కా పత్రం లేని సామాను మా ఇంట్లో వుండేవి. కాబట్టి కూడా ఎంత శుభ్రం చేసినా నా కంటికి మాత్రం నచ్చేది కాదు.
పరిశుభ్రం అన్నది ఎంతగా ఉన్నా కంటికి నజరుగా అనిపించాలి ఇల్లంటే.
రోజంతా బయట పని చేసుకోవటానికి వెళ్ళి, తిరిగి ఇంటికి వచ్చాకా, రోజు పడిన శ్రమ తగ్గిపోవాలి. ఇల్లంటే అలా గుండాలని నా బలమైన అభిప్రాయం.
నేను వంటి నే కాదు, ఇంటిని కంటికి ఇంపుగా ఉంచుకోవాలి అన్న విషయంకు చాల ప్రాముఖ్యత ఇస్తాను.
నేటి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక, రెండు, మూడు బెడ్ రూమ్ ల ఫ్లాట్లతో మన మధ్యతరగతి ఇళ్ళ స్ట్రక్చర్ ను మార్చేసింది.
1990 కి పూర్వం లాగా నేటి పట్టణాలు లేవు. చిన్నా, పెద్ద పట్టణాలలో అంతటా ఈ రైలు డబ్బాల ఇళ్ళ స్వరూపం కూడా మారింది. ఈ మార్పుతో ఇల్లు అందంగా అమర్చుకోవటం కొంత కూడా సులువైంది.
ఏ వస్తువుకు ఆ వస్తువుగా ఒక నిర్దిష్టమైన పద్దతిలో కట్టిన ఇంట్లో సర్దటం తేలిక. వాడకం దారులకు ఆ ఇళ్ళు అందగా అమర్చుకోవటం కూడా సులువే కదా!
అలా ఇంటి ని అమర్చుకునే పద్దతిలో ఎవరి అభిరుచి ని బట్టి వారు గదులు అమర్చుకోవటం అన్నది నేడు సర్వ సాధారమైన విషయం కూడా కదా.
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు’ అని మనకు సామెత కూడా ఉంది.
మన పరిసరాలు శుభ్రత గురించిన సామెత ఇది. అసలు ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటే, ఏ ఏ సామాను ఎక్కడ ఉందొ తెలిసి అవసరానికి అందుబాటులో ఉంటుంది.
లేకపోతె, అన్నీ ఉన్నా…. అల్లుడి నోట్లో శని లాగా ఏదీ సమయానికి దొరకదు. అప్పుడు ఇంట్లో దిబిడి దబిడే , కనుక కూడా కొంత ఆర్గనైజ్డ్ గా ఉండాలి.
ఇంటి నిండా బూజ్జు, దుమ్ము, గుట్టలుగా బట్టలు, సోఫాలలో అడ్డదిడంగా బట్టలు, మురికితో జిడ్డుగా వున్న గలీబులతో దిండ్లు, అలమరాలో మట్టి కొట్టుకు పోయిన వస్తువులు, దుమ్ముతో పుస్తకాలు,కిచెన్ లో గుట్టలుగా అంట్లు ఉంటే ‘మహాలక్ష్మి’ కాదు, మనమూ పారిపోతాము.
64 కళలలో ఇల్లు అందంగా అమర్చుకోవటం అన్నది కూడా ఒక అద్భుతమైన కళ. అసలు వస్తువులు అందుబాటు లో ఉంచుకునే లా సర్దుకోవాలి.
చాలా మందికి తడి టవలు పరుపుమీద పడవేసే అలవాటు ఉంటుంది. తడి టవలు ముతక వాసన, పరుపు తడిసి పోయి పాడయ్యే అవకాశం మెండుగా ఉంటుంది. నిద్రలేచిన వెంటనే పరువు మీద దుప్పట్లు సర్దుకుంటే ఎక్కడిక్కడ ఆ పని అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది.
విడిచిన బట్టలకు ఒక ప్రత్యేక స్థానం సేదా బుట్ట ఉంచితే గుట్టలుగా విడిచిన బట్టలు వుండవు. ఆరిన బట్టలను గుట్టగా పారవెయ్యకుండా వెంటనే మడతపెట్టి అలమరాలో సర్దుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముందు అసలు మనకు ఉన్న బట్టలు ఏంటో తెలుస్తాయి. ఎలుకలు కొట్టేసే అవకాశం ఉండదు. గుట్టలుగా బట్టలు పడేసుకుంటే ముడతలు పడి వేసుకున్నా అందం ఆనందము కరువు. మనకి చిరాకు మిగులుతుంది తరువాత.
దండ్యాలు కట్టి, వాటి నిండా బట్టలు వెయ్యటం ఒకటి సర్వ సాధారణం. దండెం అలవాటు చాలా వుంటుంది మన పెద్దవాళ్ళకు. ఇలానే మా మావగారు ఎక్కడకొస్తే అక్కడ దండాలు కట్టి తువాలు ఆరవేసేవారు. బ్యాక్ యార్డులో అలా చెస్తే మా ప్రక్క ఇంటివారు కంప్లెంటు చేశారు. ఇంట్లో నెమో శ్రీవారు వూరుకోలేదు. ఆయన క్లోజెట్ లో దండం కట్టి సంతోషపడ్డారు.
కట్టిన దండం మీద ఒక టవలు కాదు, గుట్టలుగా బట్టలు కొందరి గృహాలలో చూస్తాము.
అసలు అలా గుట్టలుగా బట్టలు అవసరమా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అనవసరమైన బట్టలు ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. లేని వారికి దానం చెయ్యటం వలన సహాయం చేసినట్లుగా ఉంటుంది, ఇంట్లో అనవసర సరుకులు ఉండవు.
వంటగదిలో కూడా కొందరు వండితే సామాను అంతా చుట్టూ పరచుకుంటారు. తిరిగి వెనకకు వెంటనే పెట్టుకోరు. ఇలాంటి వాటి మూలంగా వంట గది చిత్తడి…చిత్తడి… అవుతుంది. సామాన్లు ప్లాటుఫారం మీద ఉంచుకుంటే, వంట చెయ్యటానికి అసలు వెసలుబాటు ఉండదు. ఉన్నవి లేనివి ఏమిటి వాడుకునే వారికీ అర్థం అవ్వవు. మిక్సీయే వాడి అలానే వదిలెయ్యటం, వండిన తరువాత వాడిన సామాను సింకు లోనో, వాషింగ్ చోట పెట్టకుండా వదిలెయ్యటం, ఎంగిలి కంచాలు డైనింగ్ బల్ల మీద ఉంచెయ్యటం ఇలాంటివి కామన్ గా చేసే బద్దకపు పనులు. అలాంటివి ఇంటికే కాదు, మన ఆరోగ్యానికి కూడా అంత మంచివి కాదు.
కొందరు టవల్స్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద కుర్చీల మీద ఆరవేస్తారు. అదీ మంచి అలవాటు కాదు.
ఇలానే ఒకసారి మా చుట్టాల ఇంటికి వెళ్ళాము. వారి ఇంటిని చూసి మారు మాట్లాడక అదేరోజు హోటల్ రూమ్ కి వెళ్లిపోయారు శ్రీవారు. మన ఇల్లు సరిగా లేక పొతే చుట్టాలు ఉండరు.. చుట్టాలలో పేరుప్రఖ్యాతలు కూడా మెండుగా వస్తాయి. మా చుట్టాలలో ఉన్నారు అలాంటి వారు… వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు టైంకు దొరకదు. ఎప్పుడు చూసినా మురికగా ఫర్నిచర్, మురికి దుప్పట్లు, నూనె మరకలతో దిళ్లు. ఇంక మనం ఉండమన్నా ఉండలేము అలాంటి చోట్ల.
ఇక అలమరాలో సామాన్ల సంగతి. అలమారా తెరిస్తే కిందికి దుమికెలా ఉంచుకుంటే కష్టపడేది వాడుకునేవారే…
ఇక్కడ అలమరాలు ఆర్గనైజ్ చెయ్యటమన్నది ఒక ప్రత్యేక డిపార్టుమెంటు. ఇల్లు సర్దుకొని అందంగా పెట్టుకోవటం ఒక ఎత్తు అయితే, అలమారలు, కోసెట్స్ సర్దుకోవటం మరో ఎత్తు.
అందుకే ఈ క్లోసెట్ సర్దటం అన్నది ఇంటీరియర్ డిజైనర్లలో ప్రత్యేక విభాగం గా వుంది. వారు మనకు వస్తువులు అలమరాలో ఏ విధంగా మనకు అనువుగా సర్దుకోవచ్చో చూపిస్తారు.
మనకు తెలిస్తే మంచిదే.
అసలు వాడిన వస్తువులు ఎక్కడివి అక్కడ వెంటనే కనుక సర్దుకుంటే అనేక హైరానా, ఆగము ఉండవు.
ఏదైనా వస్తువు ఒక ఏడాది పాటు వాడక పొతే వదిలేసెయ్యమని చెబుతుంటారు ఆర్గనైజింగ్ లో మెళుకువలు తెలిసిన వారు. ఇక్కడ సంవత్సరానికి రెండు సార్లు అలా ఇల్లంతా శుభ్రపరచి, వాడనివి డొనేట్ చేసే కల్చర్ ఉంది. మనం వాళ్ళకి కబురు చేస్తే చాలు, ఇంటికి వచ్చి మరీ తీసుకుపోతారు. ఇలా చెయ్యటం మూలంగా ఎప్పటి కప్పుడు వదిలించుకోవచ్చు అనవసరపు సామాను.
మనం వద్దన్నా కొన్ని సామాన్లు పెరుగుతూ ఉంటాయి. మన సావనీర్లు, కలెక్షన్, ఇత్యాదివి. వాటిని భద్రపరచుకోవాలి. కానీ ఏవి మనకు కావాలో, వద్దో తెలుసుకొనే జ్ఞానం ఉండాలి కదా.
నాకు వారానికి ఒక సారి ఇల్లంతా దులిపి శుభ్రం చెయ్యటం అలవాటు. ఆలా చేసిన రోజున మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పటానికి మనకు ఏ ‘ఫెంగ్ సుయి’ అవసరంలేదు.
ఇల్లు పరిసరాలు శుభ్రతతో మనని పట్టి వుంచే ఎన్నో అనవసరపు బంధాలు కూడా విడుదలవుతాయి. మార్పు లేక జీవితంలో కొట్టుకునేవారు సామాను మార్చి అటు ఇటు సర్దితే మార్పు వెంటనే వస్తుంది.
శుభ్రమైన ఇంటి వాతవరణం మన సంబంధాలను బలంగా వుంచుతుంది.
ఇల్లు అతి శుభ్రంగా ఉంచుకోవటం, సర్దినవే సర్దటం, Obsessive–compulsive disorder (OCD) అన్నా, శుభ్రంగా ఉంచుకోవటం, ఉండటం అందరి కనీస కర్తవ్యం!
కొంచెం టైం పెట్టి ఇల్లు తీరుగా సర్దుకుంటే, ఆ ఇంట్లో సదా భోగభాగ్యాలు నిలయము. అదే స్వర్గసీమ కూడా కదా!