ఈ రోజు కొలువుకు పేరంటానికి వెళ్ళాలి. బొమ్మలకొలువంటే నన్ను చిన్నతనానికి తీసుకువెళ్ళే వారధి. ఏ విషయాలు చిన్నతనంలో చేస్తామో అవి తలచుకోవటాన్నీ “good old golden days” అంటారేమో మరి.
నా ‘Good Golden childhood’లో, తెలంగాణాలో నేను పెరిగిన ఆ చిన్న పట్టణంలో సంక్రాంతికి బొమ్మలకొలవు పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు, మేము తప్ప.
మాకు సంక్రాంతి పండగకు కొలువు, భోగినాడు భోగి పళ్ళ పేరంటము తప్పక వుండేది. అసలు ధనుర్మాసము ఆరంభం నుంచే మొదలయ్యేది మాఇంట్లో హడావిడి. ప్రతి రోజు ఆ చలిలో పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు తప్పక పెట్టవలసినదే.
ఈ బొమ్మల కొలువు పెట్టేందుకు మాకు ఒక వారం రోజుల ముందునుండే హడావిడి మొదలయ్యేది.
ఇంట్లో బొమ్మలు పెట్టటానికి మెట్లు వుండేవి కావు. అమ్మ నాన్నాగారు కలసి టేబులు, చెక్క పెట్టెల వంటివి కలపి ఒక 5 మెట్లు చేసేవారు. అమ్మ వాటి మీద దుప్పటి పరచి, అందంగా వుండటానికి తన చీరతో కప్పేసేది. దీనికే చాలా టైం పట్టేసేది. దాదాపు ఒక రోజంతా అన్నమాట.
ఇక అసలు సరదా బొమ్మలు అమర్చటం అని మా అక్క అభిప్రాయం. మా ఇంట్లో రామ పరివారము, శివుడూ పార్వతి, దుర్గాదేవి ఇలాంటి బొమ్మలు పెట్టెలలో వుండేవి. అవి తీసి జాగ్రత్తగా తుడిచి అక్క ఆ మెట్లమీద సర్దేది. అవన్నీ మట్టి బొమ్మలు. అందుకని మమ్ములను తాకనిచ్చేవారు కారు. చెయ్యిజార్చి పగలకొడతామని. కొన్ని కొండపల్లి బొమ్మలు కూడా వుండేవి. తల వూపుతూ వుండే అమ్మాయి బొమ్మ బలే సరదాగా వుండేది.
నాకు మంచి ఫన్ మాత్రం
తమ్ముడుతో కలసి మా వూరు రిప్లికా చెయ్యటం . అమ్మ, అక్కయ్య బొమ్మలు పెట్టాక,
మేము ఆ వూరు చెయ్యటానికి బయటనుంచి ఇసుక తోడి తెచ్చేవాళ్ళం. రెండు మూడు తట్టలు తెస్తే సరిపోయేది. మా సరదా చూసి పక్కింటి రమా, సూరి కూడా మాతో పాటు తిరిగేవారు మాకు హెల్ప్ చేస్తామంటూ.
ఆ ఇసుకంతా పరచి, మా వూరు లో వున్న గుట్టమీద వెంకటేశ్వర స్వామి గుడి ని తీసుకొచ్చేవాళ్ళం.
మా దగ్గర జంతువుల బొమ్మలు చిన్నవి వుండేవి. అందుకని వూరులో లేని ‘జూ’ ని ఇటు పట్టుకొచ్చి పెట్టేవాళ్ళం. మరి స్కూలు తప్పని సరి. ఆసుపత్రి, పోస్టాఫీసు సరేసరి. ఇలా చిన్న చిన్న బొర్డులు చేసి ఇళ్ళ బొమ్మలకు అగ్గిపుల్లతో కాంపౌండు పెట్టి ఈ బోర్డు తగిలించేవాళ్ళం. మా వూరిలో రాజవీధి చాలా విశాలంగా వుండేది. ఆ వీధిని తెచ్చేవాళ్ళం. కానీ రాజకోటకు కావలసిన కోట బొమ్మ లేదు. కాబట్టి దాన్ని వదిలేసేసి వున్నవాటితో అడ్జస్టు చేసి సర్దేవాళ్ళం. సంతను కూడా అమర్చేవాళ్ళము.
చివరకు వాటికి దీపాల తోరణం అమర్చేవారు నాన్న.
అమ్మ భోగిరోజు ఉదయం బొమ్మలకొలువుకు దీపారాధన చేసి పాయసం నైవేధ్యంగా పెట్టాక, అప్పుడు బయటవారు చూసేందుకు అనుమతి లభించేది.
ఆ పేరంటము, కుంకుమ, చందనము అద్దటము,పసుపు రాయటం, సెనగలతో వున్న తాంబూలము ఇవ్వటం చెసేవాళ్ళం. మొత్తం 10 రోజులు వుంచేవాళ్ళం. వూర్లో చాలా మంది వచ్చి అడిగి చూసి వెళ్ళేవారు. పిలచినా పిలవకపోయినా వచ్చేసేవారు బొమ్మలకోలువుకు.
ఆనాటి బొమ్మలకొలువు జ్ఞపాకాలు ఈ రోజు ఏ పేరంటానికి వెళ్ళినా నాకు గుర్తుకువస్తాయి.