జ్యోషీ మఠము -కల్పవృక్షము
మనము చేసే యాత్రలలో ఒకోసారి మనకు తెలియకుండానే కొన్ని అద్బుతాలను అపూర్వ ప్రశాంతతను అనుభవిస్తాము. అది మనము ఊహించనప్పుడు కలిగితే ఆ ఆనందం వర్ణానాతీతం.
నా జ్యోషిమఠ్ సందర్శనము అలాగే జరిగింది. నేను కేవలం గంగ వడ్డున కొంత కాలముండాలన్న కోరికతో 2016 రిషీకేషుకు వెళ్ళినప్పుడు కొందరు తోటి యాత్రికుల నోట “జ్యోషిమఠ్” అని విన్నా. ఆ పేరు నాకెందుకో బాగా గుర్తండి పోయింది. ఆది శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు మఠాలలో ఒకటి అక్కడ వుందని చదువుకున్నా నాకు ఆ క్షణాన గుర్తుకు రాలేదు.
నేను రిషీకేషులో వున్న ఆ సమయంలో నాకు జ్యోషిమఠ్ ను సందర్శించే అవకాశం కలిగింది.
ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలలో ఉత్తరాది మఠము గా జ్యోషిమఠ్ వుంది. మిగిలిన మఠాలతో పోలిస్తే జోషీమఠ్ లోని శంకరులు స్థాపించిన మఠము యొక్క కార్యక్రమాలు తక్కువ.
దక్షణాదిన వున్న మన శంకరమఠముతో గానీ కంచి కామకోటి మఠం తో గానీ పోలిస్తే దాదాపు మృగ్యం.
అక్కడి మఠానికి వెడితే కాళీ గదులు ఒక సాదు సంత్ మాత్రం దర్శనమిచ్చారు.
ఆయన ఆ మఠముకు పర్యవేక్షకులు. నాకు టీ ఇచ్చి తోటకాచార్యల వారి గది అని ఒక గది చూపెట్టారు. అక్కడ వున్న శంకరభగవత్పాదుల వారి విగ్రహం ముందు నాకు ధ్యానం చేసుకొన అనుమతి ఇచ్చారు.
జ్యోషిమఠం లోని యోగ నారసింహుడు ప్రసిద్ది. ఆయన కుడి చెయ్యి అరిగిపోతూ వుంటుంది. రెండవ చేతితో కలిపి చూస్తే తేడా స్పష్టం కనిపిస్తూ వుంటుంది. ఉదయము అభిషేకంలో మనం ఆ తేడాను చూడవచ్చు. ఆ చెయ్యి వూడినప్పుడు బదిరి మాయమవుతుందని చెబుతారు.
బదిరి ఆరునెలల మూసిన సమయములో బదరీ నారాయణ పెరుమాళ్ళును జోషీమఠ్ లోనే వుంచుతారు.
ఇవ్వనీ కావు నన్ను అక్కడ్కి లాగినది,అన్నింటికన్నా నన్ను విశేషంగా ఆకట్టుకున్నది అక్కడి ‘కల్పవృక్షము’.
నేను వెళ్ళింది కూడా దాని కోసమే.
శంకరభగవత్పాదుల వారు 2500 సంవత్సరముల క్రిందట తపస్సు చేసుకున్న ప్రదేశము ఈ వృక్షరాజ్యము క్రిందనే. అందుకే అది కల్పవృక్షము. నన్ను అన్ని మైళ్ళ దూరము లాగి తన వద్దకు పిలుచుకున్న ఆ మహావృక్షాన్ని నేను ఆ సాయంత్రపు వేళ సందర్శించాను. నీలపు ఆకాశం నారింజగా మారుతున్న వేళ నిర్మానుష్యంగా వున్న ఆ నిశ్చల సాయంత్రం నేను అక్కడ పరిపూర్ణ మైన శాంతాన్ని రుచి చుశాను. చాలా సేపు దాహం తో పరిగెత్తిన వాళ్ళకు మంచినీరు దొరికినట్లు నాకు అత్యంత అద్భుతమైన ప్రశాంతత లభించింది ఆ చెట్టు నీడన. ఆ లోయలలోకి మౌనంగా చూస్తూ నేను ఒక అరగంట గడిపాను. నాకేమీ ఆలోచనలు లేవు. దిగుళ్ళు లేవు. కోరికలు లేవు. మౌనం. కేవలం మౌనము నేను రుచి చుశాను. జగద్గురువులు తపమాచరించిన చోట మరి అంత అద్భుతంగానే వుంటుంది. అందులో ఆశ్చర్యమేముంది.
అలాంటి అనుభవము కోసం తప్పక గురు భక్తులు జ్యోషీమఠం వెళ్ళాలి అని నా అభిప్రాయము. కొందరు భక్తులు గలగల మంటూ వచ్చినందుకు నేను కదిలాను. లేచి వచ్చేయ్యటం జరిగింది. ఆ మౌనం మనసులో అలా నిలబడి పోయ్యింది. బదిరికి అక్కడ్నుంచి కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. బదిరి వెళ్ళే దారిలో తప్పక ఆగవలసిన, దర్శంచ వలసిన క్షేత్రాలలో ఇదీ ఒకటి.
“సదాశివ సమారంభం
శంకరాచార్య మధ్యమం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం!!”
జై గురుదేవ!!!