కమనీయమైన ‘ఖమస్’

కమనీయమైన ‘ఖమస్’

ఈ ఉదయమంతా ఖమాస్ లో మనసు మూర్చనలు పోయ్యింది.
“పాడమని నన్నడగవలెనా.. పరవశించి పాడనా… నేనే పరవశించి పాడనా” అనే వీణ మీద చక్కటి పాట డా।। చక్రవర్తి లో పాట అది.
ఈ సందర్భంలో ఖమాస్ రాగము, అందులో మేము నేర్చుకున్న స్వరజతి, కీర్తనా గుర్తుకువచ్చాయి.

సర్వజతి ‘సాంబశివా యనవే రాజితా గిరి’ అన్నది. నేను చాలా త్వరగా నేర్చుకొని ఇష్టంగా వాయించేసేదాన్ని.

శ్లో।। నకారం ప్రాణనామానం దకార మనలం విదుః।।
జాతః ప్రాణాగ్ని సంయోగాత్తేన నాదోభిధీయతే।।(క్రొత్త సంగీత విధ్యాదర్పణం).

“నాద మను రెండక్షరములతో ‘న’ అను అక్షరము ప్రాణమని, ప్రసిద్ధమైయుండును. ‘ద’ అక్షరము అగ్ని రూపమని చెప్పబడింది. ఈ కారణం చేత ప్రాణాగ్నుల యొక్క సంయోగము వలన ‘నాద’ మను శబ్దమయ్యెను”.

ఖమాస్ రాగము మన రాగము కాదని ఉత్తర భారతము నుంచి వచ్చిన శుద్ద మధ్యమ రాగమని అంటారు. అది నిజము కూడాను.  28 వ మేళకర్త రాగమయిన  హరికాంభోజి రాగమునకు జన్య రాగము.

ఈ రాగము ఆరోహణా, అవరోణలు -వక్రషాడవము – సంపూర్ణము. వక్ర షాడవము అవటము వలన ఈ రాగపు అందము మరింతగా పెరిగింది. వక్ర మంటే ముందు వెనుక తారుమారుగా రావటం.
ఈ రాగ ఆరోహణ, అవరోహణలు చూస్తే అర్ధమవుతుంది.
ఆరోహణ: స – మ – గ – మ – ప – ద – ని – స
అవరోహణ – స – ని – ద – ప – మ – గ – రి – స.

పూర్వం ఈ రాగాన్ని జావళులకు వాడేవారుట. సరస శృంగార భావనలు వివరించటానికి పద్యాలు, శ్లోకాలు పాడటానికి ఈ రాగము ఎక్కువగా వాడేవారు.

ఈ రాగము హిందూస్తానీ సంగీతములో ‘ఖమూజ్’ అని పిలుస్తారు. ఈ ఖమాస్ రాగములోనే చాలా ప్రఖ్యాత పాట అభిమాన్ చిత్రంలోని ‘తేరే మెరె మిలన్ కీ’ అన్న పాటను కూర్చారు.

‘బ్రోచేవారెవరురా’ అన్న కీర్తన విననివారు వుండరు. ప్రఖ్యాతి గాంచిన ఆ కీర్తన ‘శంకరాభరణం’ చిత్రంతో సంగీతం వక్రీకరించి పాప్ లా పాడితే ఎంత బ్రష్టు పడుతుందో చూపిస్తారు దర్శకులు. ఆ కీర్తన రాసిన వారు మైసూరు వామదేవాచార్యలు. ఆ కీర్తన ఖమాస్ రాగములో రచించినదే.

ఖమాస్ లో మరి కొన్ని ప్రఖ్యాత కీర్తనలు;

ముత్తు స్వామి దీక్షితుల వారి ‘సరస దళ నయన’

త్యాగరాజ స్వామి వారి
‘సీతాపతే నా మనసున’

అన్నమయ్య ‘డోలాయమ్ చల డోలాయమ హర’

మయూరం విశ్వనాథశాస్తి గారి ‘జయతి జయతి భారత మాత’ అన్న ప్రఖ్యాత గీతం కూడా ఖమాస్ లోనె కూర్చబడింది.

తెలుగు చిత్రాలలో ఈ ఖమాస్ ను వివిధ సందర్భాలలో వాడుకున్నారు. అందులో కొన్ని

1.మల్లీశ్వరి చిత్రం లో ‘ఎందుకే నీకింత తొందరా’

2.గృహలక్ష్మి లో ‘ మేలుకోవయ్యా కావేటిరంగా శ్రీరంగా’

3. డాక్టరు చక్రవర్తి ‘పాడమని నన్ను అడగవలెనా పరవశించీ పాడనా’

4. మీనా లో ‘మల్లెతీగ వంటిది మగువ జీవితం’

5. అందమే ఆనందం లో ‘మధుమాసవేళ లో మరుమల్లె తోటలో’

హయిగా గమకాలతో సాగిపోయి వింటుంటే కోకిలలన్నీ కలసి పాడుతున్నట్లుండే  ఈ ఖమాస్ ఈ నాటి నా ఉదయాన్నీ కమనీయంగా మార్చింది.

Leave a comment