మొన్న నా ఇండియా ట్రిప్పులో నా డిగ్రీ స్నేహితురాలు కలిసినప్పుడు నన్ను చూసి ‘నీ కాటను చీరల పిచ్చి, శ్రీ శ్రీ మీద ప్రేమ తగ్గలేదులా వుంది. అమెరికాలో వుంటున్నా ఇలా కాటనే కట్టుకు తిరుగుతున్నావు’ అంది నాలో మార్పుకై వెతుకుతూ.
అవును! ఇన్ని సంవత్సరాలైనా నా కాటను చీరలపై మక్కువ తగ్గలేదు. నేత చీరల ఇచ్చే అందం కానీ, హుందాతనము కానీ మరో రకం వస్త్రాలకు రాదు. దీన్ని కొద్దిగా మైనుటైను చెయ్యాలి కాని ఈ చేనేత వస్త్రాల తరువాతే ఎమైనా.
నేను హైద్రాబాదు వెళ్ళిన ప్రతిసారి పోచ్చంపల్లి తప్పక వెడతాను. అక్కడకు వెళ్ళకపోతే నాకు వెలితిగా వుంటుంది. హైద్రాబాదు కు ఒక 50 కి.మీ. వుంటుందేమో. ఎన్నిసార్లు వెళ్ళినా చేనేత వారిని చూసే అవకాశం కానీ, మగ్గాలను చాసే అవకాశం కానీ రాలేదు. అక్కడ మేయిన్ రోడ్డు మీద షాపులలో, లేదా వారి సొసైటి లోనో మాకు నచ్చిన చీరలు, చూడిదారులు, దుప్పట్లు, బ్యాగులు, ఒకటేమిటి సర్వం వివిద రంగులలో తెచ్చుకోవటం అలవాటు.
అలాగే కళంకారి కూడా మా ఇంట్లో 20 ఏళ్ళ నుంచి వుండేవి. తెనాలి వెళ్ళి నప్పుడు మంగళగిరి వెళ్ళటము అనవాయితీ. అలా మా చేనేత చీరల, వస్త్రాలపై మక్కువలో మార్పు లేదు.
మొన్ననే భానుమతి మంథా గారి ‘అగ్గిపెట్టలో ఆరుగజాలు’ చదివినప్పుడు ఇవ్వన్నీ గుర్తుకు వచ్చాయి కూడా.
నాకు నా భారత్ యాత్రలో ‘నారాయణపేట’ వెళ్ళే పని పడింది. నా చిన్ననాటి మిత్రులు అక్కడ వున్నారు. చాలా సార్లు కాదన్నా ఈ సారి తప్పించుకోలేక వెళ్ళాను. వెళ్ళినందుకు నాకు అద్భుత చేనేత ప్రపంచము చూసే అవకాశము కలిగింది.
నారాయణపేట చేనేత, పట్టు లకు చాలా ప్రసిద్ధి. ఆ పట్టు చీరలు నేను కర్ణాటక మిత్రులు కట్టుకున్నప్పుడు చాలా సార్లు చుశాను. ( మాకు ఇక్కడ కర్ణాటక మిత్రులు వున్నారు).
నారాయణ పేట వస్త్రాలు అనాది నుంచి వున్నాయి. నారాయణపేట హైద్రాబాదుకు దాదాపు 300 కిమీ దూరం లో వుంటుంది. అది కర్ణాటక, తెలంగాణా సరిహద్దులో వుంది. ఆ వూరు తరువాత కర్ణాటక రాష్ట్రం మొదలవుతుంది. నారాయణపేట ఓ రెవెన్యూ డివిజను. మేము మధ్యహ్నం లంచ్ తరువాత చీరలు చూడటానికి వెళ్ళాము.
మేము ముందుగా వెళ్ళిన భవనము దాదాపు 150 సంవత్సరాల చరిత్ర వుంది. కర్ణాటక నుంచి వచ్చి, అక్కడ సెటిలయిన వారు మగ్గాలతో చీరలు నేస్తూ వ్యాపారము చేస్తున్నవారు. ఆ రెండతస్తు మేడలో 12 మగ్గాలు వున్నాయి.
కార్మికులు కాకుండా వారికి ఇంజనీయర్ల విభాగము, మార్ఫింగు విభాగము వున్నాయి. నేసిన చీరలు వాళ్ళు హైద్రాబాదు కు పంపుతారు. నారాయపేటలో వారికి రిటైల్ అమ్మకపు విభాగము లేదు.
ముందు దారం వడికిన తరువాత, దానికి రంగులు అద్ది, గంజి పెడతారు. ఆ ప్రక్రియను మార్ఫింగు అంటారు. అలా వచ్చిన దొంతరలను చెక్క కండెలకు చుట్టి మగ్గాలకు కలుపుతారు.
ఇంజనీయర్లు డిజన చెయ్యటము కూడా చాలా గమ్మత్తుగా వుంటుంది. ప్లాస్టిక్ అట్టలకు రంధ్రాలు చేస్తే ఆ రంధ్రాలలో దారము అల్లుకొని డిజను వస్తుంది. ఆ డిజ్యన్ చెయ్యటము లో క్రియేటివిటీ వుంటుంది. ఈ అల్లిక నాకు నవారు మంచాల అల్లికను గుర్తుకు తెచ్చింది.
నారామణపేట చీరలలో ఇక్కత్, మంగళగిరి, గద్వాల ఇలా ఫ్యూజన్ చేస్తూ ప్రయోగాలు ఎన్నో ఆ కేంద్రంలో చేపడు తున్నారు. ఏది ఆదరణకు నోచుకుంటే అది కంటిన్యూ చేస్తారుట.
ఒక సారి మగ్గం మీద మొదలు పెడితే 6 చీరలు తీస్తారు.
పట్టు చీరకు దాదాపు రెండురోజులు, అదే భూటా వస్తే నాలుగు నుంచి పది రోజులు పడుతుందట. పది రోజులు పట్టిన చీర జ్వాక్వాడు చీరలు 15000 వరకూ వుంటుంది. నేత చీర రోజుకు ఒకటి చొప్పున చేసేస్తారు. మగ్గాల వద్ద చీర ధర చాలా తక్కువగా వుంటుంది. అక్కడ చీర కు హైద్రాబాదులో చీరకు దాదాపు రెండు నుంచి మూడు రెట్లు ధర తేడా వుంది.
మగ్గాల వద్ద ట్రైనింగు కూడా వీరే ఇస్తారని చెప్పారు.వీరి వంద సంవత్సరాల చేనేత వస్త్రాల బిజినెసులో ఇప్పుడు పరిస్థతుల గురించి అడిగితే ఫర్వాలేదనే చెప్పారు.
నా మిత్రులకు, చుట్టాలకు అందరికి తలో నేత చీర వుంటుందని, వచ్చేది కారులోనే కదా అని, అందునా ఆ ధర విని బోర్లా పడి ఓ పాతిక చీరలు తెచ్చుకున్నాను.
వచ్చిన వెంటనే మా ఇందు రమ్మంటే కాదనలేక ఒక చీర తీసి కట్టుకు వెడితే, అక్కడ తళుకులిడు పట్టు చీరల మధ్య నా చేనెత చీర ఏం ఆనుతుందని దడిసినా, అందరూ అదరహో అనటం, అదీ చేనేత చీరల మజా… అనుకోవటం తుది మెరుపు.
అలా నారాయణపేట చేనేత చీరలతో సందడి చెయ్యటము జరిగింది 2018లో.