మనకు చిన్నప్పుడు వేరు వేరు కారణాల వలన వంటగది ప్రవేశం నిషేధమయితే తరువాత చాలా ఇబ్బంది పడతాము. అందుకే మన పిల్లలకు చిన్నప్పుడే వంట కాకపోయినా, కనీసము వంట సరుకులన్నా పరిచయము చెయ్యాలి.
ఈ వంట సరుకుల పరిచయము లేక గందరగోళపు, తిక్క శంకరయ్యలాంటి వంటలు చేసి పరులకు హాని చేసే అవకాశాలు బహు మెండుగా వుండటము సామాన్యమే కదా మరి!!.
నావరకూ నాకు, చిన్నప్పటి నుంచి వంటగది ఆక్సిడెంట్లు ఎక్కువ. అసలే మనము కస్టర్డ్ పొడితో దోశలు వేసిన ఘన చరిత్ర కలవారము.
ఒక సారి ఇంట్లో ఎవ్వరూ లేక వున్న అమ్మ వంట చెయ్యలేక, తమ్ముడుకి వండటము, తినటమూ రెండూ రాక నామీద నమ్మకముతో పప్పు వండమని చెబితే ఎల్లో కలరు పప్పుతో రోజంతా వండినా వుడకని చెక్కలు వేసుకతిన్నామని ఇప్పటికీ సాదిస్తాడు. అది కంది పప్పు కాదని అలానే వుండే శనగపప్పని తెలిసే సరికే నా పెళ్ళి అయిపోయ్యింది.
ఇడ్లీ కోసం రవ్వ అని ఉప్మా రవ్వ నానబెట్టి , ఇడ్లీలు పీసం గాచేసి వడ్డిస్తే, శ్రీవారు “ఏదోలే కడుపులో పడితే అన్నీ ఇదే షేపు” అని మారు మాట లేక తినిపించిన కీర్తి గడించాను.
చింతపండులేని పులుసు, ఉప్పు వేసి వండిన పప్పు, వంకాయ కాల్చి రుబ్బటమెందుకని….రుబ్బి ఆ ముద్దని వేయించమూ…..ఒకటా రెండా….. ఎన్ని చెప్పినా…చేసినా మరో ఆలోచన తళుకుమంటూనే వుంటుంది.
మరి ఒక ఐడియాతో జీవితం మారిపోతుందిగా’…..
అయినా ఉపాయం లేని వారిని ఉళ్ళో నుంచి తరిమెయ్యమన్నారు.
ఏది ఏమైనా ముందస్తుగా సరుకులు పిల్లలకి పరిచయం చెయ్యాలి. మనలా మన పిల్లలూ బాధపడకూడదు గదండీ.
మా అక్కయ్యగారి అబ్బాయి అమెరికా రాగానే వాడికి ఎడారిలో ఉద్యోగం పడింది. వెళ్ళి జాయిను అయ్యాడు. అక్కడ ఒక మనిషే కనపడదు. అందునా భారత సంతతి వారు అసలు లేరు. ఇక ఇండియన్ హోట్లళ్ళు ఎలా వుంటాయి. తిండికి ఇబ్బందితో స్వయంపాకం తప్పలేదు. వాడి వంటకు పైగా ఫోనులో నా దగ్గర ప్రవేటు తరగతులు.
పూర్వం ఏదో సామెతలా…. నాకే నా వంట మీద డౌటు. ఇంక వీడికి క్లాసులు. ఆ వంట ఎలా తగలడిందో… హేమిటో…
అలాగని పిల్లల దగ్గర బయటపడముగా మనము…
మూడు నెలల తరువాత నన్ను రమ్మనాడు. నేను నేర్పిన వంటతో పిల్లాడు ఎలా వున్నాడో చూడ వలసిన బాధ్యత కూడా మరి మనదే కదా.
వచ్చేటప్పుడు తిరిగి అందరము కలసి కారులో వెనక్కు వచ్చేయ్యాలని. నేనూ మా పిల్లా బయలుచేరాను.
అన్నము పప్పు వండి రెడీ చేస్తాను రమ్మన్నాడు.
ఎయిర్ పోర్టుకు రావటము, మమ్ములను తీసుకు వెళ్ళటము లో ఏ తేడా లేదు.
సంతోషమేసింది.
‘అవసరమూ అన్నీ నేర్పుతుందని’.
బోజనాల దగ్గరే ఏదో తేడా….
అన్నము ప్రియా పచ్చడి, పప్పు.
ఆ పప్పు కొద్దిగా కాదు బాగా తేడాగా వుంది. కానీ శనగపప్పు కాదు.
‘ఏంటిరా బాబు ఇది’ అంటే వాడు తన పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించటానికి దొరికిన మమ్ములను వదులుతాడా?
“తిని చెప్పు పిన్ని! నీవు చెప్పినట్లే చేశాను”(మళ్ళీ నాకే గొడవ…నా పాపంలా తిరిగి తిరిగి నా దగ్గరకే వచ్చి వాలుతోంది)
‘ అదేమి పప్పురా’
అన్నా ఆ ముక్కా చెక్కాని చూసి.
నా చిన్ననాటి అనుభవాలు మెదడులో విమానాల కన్నా వేగం గా అటు ఇటు పరుగెడుతుంటే….
వీడికింత పిన్ని పోలిక వచ్చి వుంటుందా అన్న అనుమానము తొలచివేస్తుంటే.
“మూంగ్ దాల్ తో పిన్ని! తిను “ అన్నాడు చిన్ని నాయన.
పాపం వాడికి నేనంటే తగని ప్రేమ.
కానీ
నేను మూంగ్ దాల్ పప్పు నేర్పలేదు. అందునా మూంగ్ దాల్ (పెసరపప్పు) ఇంత గట్టిగా వుండదు. నీళ్ళలో వేసి వండగానే తెగ మెత్తపడిపోతుంది …వెన్నలా, నా మనసులా….
కానీ, ఇది తేడాగా వుంది. బాబు ఏ బ్రాండుదిరా ఇంత ఘట్టిగా ‘వీకోవజ్రదంతి’ తో తోమ్మిన పళ్ళు కూడా పటపటా మని వూడవలసినదే లా వుందే అంటే….
వాడు వాడిన కవరు చూపించాడు…..
కళ్ళు తిరిగి పగలే నక్షత్రాల తో పాటు పండు వెన్నెలలు కనిపించాయి.
వాడు వాడినది “హల్దీరాము వాళ్ళ మూంగుదాల్ స్నాకు”.
నన్ను మించిపోయిన వాడి తెలివికి నేను కళ్ళు తిరిగి పడ్డానన్న మాట!!
అందుకే మన పిల్లలకు వంట సామాను, వండుకునేందుకు వీలు పడేవీ, పడనివి అనీ నేర్పాలి.