ఆలోచిస్తూ కుర్చున్నాను. గుత్తి వంకాయ కూర చెద్దామా? బెండ కాయ పులుసా? తేల్చుకోలేకపోతున్నా….
నాకు రెండూ వచ్చు. వచ్చు అంటే అలా ఇలా కాదు…స్వర్గానికి వెడుతున్నా నే వండిన వంకాయ కూర … అటు ప్రక్క వుంటే, వెళ్ళటము ఆపి బైటాయిం చేస్తారు దేవతలైనా మరి.
వీసా రాని మా పిన్నిగారి కొడుకు నే చేసిన ఈ కూర తిని కొంత తీసుకుపోయి వాళ్ళకిచ్చి వీసా చటుక్కున పొందాడు. అంత ఘనమైన కూర నే చేసే గుత్తి వంకాయ కూర.
తింటే… మనసు కల్మషం వుంటే నిర్మలమైపోతుంది. అందరూ బావుందని మెచ్చుకొని మరల మరల వేసుకుతింటారు ఇదే.
అన్ని మంచి విషయాలు సజావుగా వుంటే దేవునితో పని ఏముందని’ – సామెత కదా! అలా ఇంత కమ్మని ప్రఖ్యాతి చెందిన నా వంకాయ కూరకు దిష్టి తగిలినట్లుగా వుంది. మాములుు దిష్టి కాదు…కేసిఆరు ను చూసి చంద్రన్న కు కలిగినంత దిష్టి. చైనాను చూసి అమెరికావోడు గిలగిల కొట్టుకుంటుంన్నంత దిష్ఠి.
అందుకే ఈ మధ్య ఒక విషాద సంఘటన…. అప్పట్నుంచి కొద్దిగా బెరుకుగా వుంటోంది నాకు.
నేను సదా ఎదో ఒక డైటులో వుండి నేను వండే తిండి తినకుండా జాగ్రత్త పడటము మాములే. ఎప్పుడూ శ్రీవారే తిన్నలి వండినదంతా. తినకపోతే నేను ఫ్రీజరులో దాచి దాచి వడ్డిస్తాను కానీ పారేసుకోము బాబు ఇండియాలో లా….
ఇంక వారము తరువాత కూడా తినరంటే అప్పుడు మా క్లీనింగు గ్రైండరుకు (సింకుకు వుంటుంది) సమర్పిస్తాను.
సరే వంకాయ కదా… చెప్పేది.
ఈయన మిత్రుడు ఒక శ్వేత జాతీయుడు వచ్చాడు.
సరే వచ్చినవాడు పని చూసుకుపోతే కథేమి వుంది.
గ్రహాలన్నీ వరుసగా బాదితే ఎటు నుంచి ఏదో వచ్చి తగుతుందిట. అలా మావారు ఈయన్ని భోజనానికి పిలిచారు.
సరే పిలిచి వూరుకున్నారా?
నాకు ఈ వంకయ గుత్తి, జీరా రైసు అని మెనూ కూడా ఆర్డరు.
నాకు అది కుడిచెయ్యి వాటము. అంటే నేను ఎడమచెయ్యి వాటము. అందుకే ఇలా చెప్పానన్నమాట.
“సరే” అన్నా.
మా ఇంటి ప్రక్క వున్న కూరగాయల కొట్లో వంకాయలు తీసుకొని వచ్చి పనిలో పడ్డాను. ఆ వంకాయలు తినము కదా ముందే. చక్కగా మసాలా పెట్టి వండాను. జీరా రైసు, కూర చూడగానే ముద్దుగా వెంటనే ఆవురావురని తినేయాలనంత అందముగా వున్నాయి. మిస్ వరల్డు, మిస్ యూనివర్స్ లను మిస్ అవ్వచ్చు కానీ ఇంత అందమైన వంకాయ కూరను కాదు కదా!!
డిష్ లలో సర్దిన ఆ కూర రారమ్మని అందంగా అతిధిని చేతులు సాచి స్వాగతిస్తుంటే మరీనూ.
వచ్చాడు అతిధి మా వారితో పాటు.
పిచ్చాపాటి కబుర్ల తరువాత… బోజనానికి లేచారు.
‘ఆహ! ఓహో’ అంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని షాకైయి నిలబడి పోయాడు. ప్రపంచములో లేని రంగులు ఆయన ముఖములో.
కళ్ళల్లో నీరు. సంతోషముతో కాబోలనుకున్నాము.
వీళ్ళు అన్నింటికీ ‘ఆహా! వావ్!’ అంటూ కళ్ళంబడి నీరు పెడతారు కదా!!!
మావారు ఆయన ఆనందముతో అలా మూర్చిల్లాడని మరింత వంకాయ వడ్డన. ఆయన ముద్ద ముద్దకు వైను , నీళ్ళు కలసి కలపక… తికమకగా… మకతికగా…. త్రాగుతూ … వంకాయను గుటు గుటు మంటూ తింటూ మింగుతూ ….వడ్డున పడ్డ చేపలా కొట్టుకుపోయాడు.
నన్ను అదోలా చూడటము కూడాను మధ్య మధ్య.
మావారికి, నాకు సూర్యడు తూర్పున ఉదయిస్తాడనంత నమ్మకము నా వంకాయకూర మీద.
అతిధి చూపులలో మెచ్చుకోలు లేదు కానీ నాకర్ధమైనంతలో ఆయన మూర్చకు ముందు స్థితిలో తేలియాడుతున్నాడని.
నేను నిద్రలో నుంచి లేపి అడిగితే చెంప పగలకోడతా కానీ ఈ కూరగాయ చెడగొట్టను.
మరి ఎమైయ్యిందో అర్థం కాలేదు. కారమేమైనా ఎక్కవైయియందా అని ఒక అనుమానము మొచ్చినా..ఆ ట్రంపుకు మెక్సికన్లలంటే ప్రేమ పుట్టొచ్చు కానీ నా కూర పాడవదని వీర నమ్మకముగా వున్నానుగా. పైపెచ్చు ఈ తెల్లోళ్ళ మీద ఒకలాంటి ఫీలింగు నాకు కొంచము ఓవరు యాక్టింగు అని. ఇంతకు ముందు నాతో చదివే నా కాలేజి మేట్లు ఇలానే వచ్చి వండినవన్నీ తిని ఏంటో మాకు ఈ కారము కష్టం అంటూ వంకలలో డొంకలేరుతూ పోయారు. నాకు చెడ్డ చిరాకు వచ్చేసింది అప్పుడు.
“సరే అతిధి వచ్చిన దారిన్ -ముఖమంతా ఎర్రగా చేసుకు విచిత్రంగా పోవున్” అని వూరుకున్నా. ఆయన్ని పంపిన తరువాత….మావారు తిండికి ఉపక్రమించి ముద్ద నోట్లో పెట్టికొని భరతనాట్యం, కధాకళి లతో జుగల్‌బందీ చేస్తూ… ‘ఇది విందా నీ బొందా… తిన్నాడు గోవిందా’ అని ఏఫెల్ల్ 1 విడుదలలో.. దివాకరములా చిందులు వేశారు.
మరురోజు ఆయన మిత్రున్ని చల్లపరచటానికి పరుగు పరుగునవెళ్ళిపోయాడు అనుకోండి.
అసలు విషయం ఏమంటే వంకాయలు చేదుగా వున్నాయట. అదీ కాకరంత చేదట. నాకు తెలియదు. అసలు వంకాయ అంతలా చేదుగా వుంటాయని నాకు ఆనాటి వరకూ తెలియదు.
ఇది జరిగి రెండు వారాలే అయ్యింది.
అందుకే నవనవలాడుతూ రారమ్మని కన్నుకొట్టి పిలచినా వంకాయలను కొద్దికాలము దూరంగా వుంచుదామని ఆలోచన చేస్తున్నాను. కాళ్ళకడ్డము పడుతున్న చిన్న పిల్లలను తల్లి తప్పించుకొని వంటగదిలో పని చూసుకోవటానికి వెళ్ళిన తల్లి చందానా ఆ ముద్దుగా వున్న చిన్న వంకాయలను ప్రక్కకు తోసి ఇదిగో ఈ సాబుదాను కిచిడి చేశాను.
సరే సరే నాకు తెలుసు… నకము నుంచి జారి ఏదో లోయలో పడ్డమేనని. యాక్సిడెంటు అయ్యాక స్టీరింగు పట్టుకుంటే కొంత కాలము ఇలాంటి బెరుకు సహజమే. అందుకే కొన్ని రోజులు సేఫ్ గా ఆడే క్రికెటర్‌లా కొంత నిదానము ప్రదర్శించాలనే ఈ వేషాలన్నమాట.
సాబుదాను/ సగ్గుబియ్యం రుచి బావుంటుంది. చేదు రాదు.
ఒక గంట ముందుగా సగ్గుబియ్యం మునిగేలా నీళ్ళలో నానబెట్టాలి.
నానిన సాబుదాన్ పొడి పొడిగా వుంటాయి.
ఒక బంగాళాదుంప సన్నగా తరుగుకొని ఒక పొంగు వచ్చేలా వుడకెయ్యాలి.
బాండిలో కొద్దిగా నూనె వేసి, మినపపప్పు, జీలకఱ్ఱ, కొద్దిగా ఇంగువ, కరేపాకు, పసుపు వేసి తాళింపు రెడీ చేసుకోవాలి.
ఆ తాళింపు వేగాక ఈ కొద్దిగా వుడికిన దుంప ముక్కలను వేసి కలుపుకోవాలి. కొన్ని సన్నగా తరిగిన పచ్చి మిరప కూడా వేసుకోవాలి. దీనికి నానిన సాబుదాన్ కలిపి వుప్పు వేసి మూతపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ, అంతా కలసి కొద్దిగా వుడికి వేగి చక్కటి బంగారు రంగులోకి వచ్చాక కొద్దిగా పల్లి పొడి చల్లుకొని పోయ్యి మీదనుంచి దింపుకోవటము.
వడ్డించటమూ.
దీన్నీ పెరుగు పచ్చడితో తింటారు.
ఉపవాసము తరువాత దీనిని ఎక్కువగా వాడుతారు ఉత్తరాన. ఇందులో వుల్లిపాయ వుండదు కాబట్టి పూజలకు, ఉపవాసములో పనికి వస్తుంది.
సగ్గుబియ్యం తేలికగా అరుగుతుంది. అందుకే గా మనము జర్వం పడ్డవారికి దీనితో జావ కాస్తాము. కాబట్టి పెద్దవారికి కూడా ఇబ్బంది వుండదు.
రాత్రిళ్ళు తిన్నాకూడా.
రుచికి రుచి, కమ్మగా వుండే ఈ పలహారము తేలికగా చేసుకోవచ్చు.