గుడిలో పులిహోరలా మనము చేసే పులిహోర వుండాలంటే?
వైష్ణవ దేవాలయాలు ప్రసాదానికి ప్రసిద్ధి.
అందునా పులిహోర.
మనము మన పండుగలకు ఎన్ని చేసినా పులిహోర లేకపోతే పండగే కాదు.
దక్షిణ భారత దేశపు వంటకాలలో ఎంతో ప్రముఖమైనది, పవిత్రమైనది పులిహోర.
పులిహోరలు ఎన్నో రకాలు చెయ్యవచ్చు. చింతపండు, నిమ్మకాయ, దబ్బకాయ,మామిడి కాయ పులిహోర ఇత్యాదిని.
గుడిలో చాలా మటుకు చింతపండు పులిహోర ప్రసాదంగా ఇస్తారు. అది రుచిలో కొద్దిగా తేడాగా మనము ఇంట్లో వండే పులిహారలా వుండదు.
ఎంతో రుచిగా వుండటమే కాదు, దిన్ని తయారీ పద్దతి కూడా కొద్దిగా వేరు.
అందుకే గుడిలో పులిహోర ప్రత్యేకమైనది.
గుడికి వెడుతుంటే మరో వంట లేకుండా అక్కడి పులుహోరతో మనము మన భోజనము కానివ్వ వచ్చు. అంత రుచి, కడుపు నింపే ఆహారం మనకు ఇంకోటి ఉండదు.
సరే మరి ఈ పులిహోర ఎలా చెయ్యాలో, కావలసిన వస్తువులు ఏమిటో చూద్దాము.
రెండు కప్పులు అన్నానికి ఈ కొలతలు ఉజ్జాయింపుగా తీసుకోండి.
అన్నం వండేటప్పుడు, అందులో ఒక చిన్న చెంచా నూనె వేస్తే కనుక అన్నం పొడిపొడిగా వస్తుంది. పులిహోరకు అన్నం పొడిపొడిగా ఉండాలి. మెత్తగా గుజ్జుగుజ్జు గా ఉంటే అది దద్దోజనానికి బాగుంటుంది.
కాబట్టి మనము అన్నం వండేటప్పటినుంచి జాగ్రత్తగా ఉండాలి.
అన్నం ఉడుకుతూ ఉండగానే మీరు అన్నంలో కలుపుకోవటానికి పులిహోర మిక్స్ రెడీ చేసుకోండి.
అసలు వండాలనుకున్న ఒక గంట ముందుగా చింతపండు ముద్ద నానబెట్టుకోవాలిగా. అలా నానబెట్టినది ఉడకేసుకోవాలి. అలా ఉడకేసుకుంటే చింతపండు నుంచి రసం పూర్తిగా వస్తుంది, పులిహోర నిలువ కూడా ఉంటుంది రెండు రోజులు. రుచి కూడా ఉడకేసిన చింతపండుతో మరింత పెరుగుతుంది.
1/2 కప్పు వేరు శనగపప్పు,
2 చెంచాలు నువ్వులు,
3 చెంచాలు ధనియాలు,
1/2 చెంచా మిరియాలు,
4 చెంచాలు ఎండు కొబ్బరి
ఇవ్వన్నీ కలిపి డ్రై గా వేయించుకోవాలి.
ఈ వేయించిన మిశ్రమాన్ని మెత్తగా పొడి చేసుకొని అలా ప్రక్కన ఉంచుకోండి. ఇది కొంచం ఎక్కువ చేసుకు రెడీ గా ఉంచుకుంటే భవిష్యతులో పనికి వస్తుంది.
బాణలి లో 4 చెంచాల నూనె వేసి కొద్దిగా కాగాక శనగపప్పు, మినప పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండు మిరపకాయ, వేసి వేయించాలి. కావాలంటే ఈ మిశ్రమానికి కొంచం జీడిపప్పు, వేరుశనగ కూడా కలుపుకోవచ్చు.
దానికి తరిగి పెట్టుకున్న 2 పచ్చి మిరప, 2 రెమ్మల కరివేపాకు కలపాలి.
ఈ తాలింపులో 1 చెంచా పసుపు వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా రెడీ గా ఉంచుకున్న చింతపండు పులుసు పోసేయ్యాలి.
చింతపండు పులుసు కొంచం పలచగా చేసుకుంటే ఎక్కువసేపు కాగుతుంది. పచ్చిమిరప ఆ పులుసులో కాగి, పుల్లగా మారి తింటున్నప్పుడు రుచిగా పంటికిందకు బాగుంటుంది.
ఈ మిస్రమానికి తగినంత ఉప్పు కలపాలి. ఒక చెంచా బెల్లం పొడి కూడా వేసుకోవాలి. ముందుగా సిద్దంగా వుంచుకున్న పొడి ఒక చెంచా కలిపి సన్న సెగ మీద అలా కాగనివ్వాలి.
ఈ మిశ్రమం దగ్గర పడటానికి 5 నిముషాలు పడుతుంది. మిశ్రమం అంతా దగ్గరగా వచ్చినప్పుడు ముందుగా వండుకున్న అన్నం లో ఉండలు లేకుండా చేసి కలుపుకోవాలి.
మీకు బాసుమతి రైస్ ఇష్టమైతే మీరు అన్నం బాసుమతి రైస్ తో తయారు చేసుకోండి. లేదండి సోనా మసూరి తో కానియ్యవచ్చు.
మీకు ఇంకా రుచిగా కావాలంటే, తిరగమాతకు కొద్దిగా ఎక్కువగా నూనె కానీ, నెయ్యి కానీ వాడాలి. అప్పుడే రుచి బాగుంటుంది.
ఇలా కలిపిన అన్నాన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. తరువాత మీకు ఇష్టమైతే రైతా తో కానీ, పులుసుతో కానీ వడ్డించండి.
ఈ పులిహోర గుడిలో చేసే పులిహోర లా ఉండి, తిన్నవారు మిమ్ములను మర్చిపోరు.
కావాలని మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారు.
ఇది రెండు రోజులు పోయినా రుచి మారదు.
అసలు చల్లపడినా మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు.
ఇదే గుడి పులిహోర మసాల రహస్యం. ఇది నేను చేసిన ప్రతిసారి హిట్టవుతుంది. అంతా ఇష్టంగా తింటారు. మీరూ ప్రయత్నించి చూడండి.
