పూర్వపు కథలను కనుల ముందు నిలిపే ‘ప్రాచీన గాథాలహరి’

పూర్వపు కథలను కనుల ముందు నిలిపే ‘ప్రాచీన గాథాలహరి’

కొందరు రాసినవి ఎంత చదివినా అర్థం కావు. అది భాష కావచ్చు, అందులో చెప్పే విషయం కావచ్చు. కొంతమంది రచనలు వలిచిన అరటిపండులా మృదువుగా ఉండి, చకచకా చదింవించేస్తాయి.

కొందరి రచనలు గ్రాంధికంగా ఉన్నా కూడా కధనం, రచనా శైలి లో పట్టుతో, సస్పెన్సును చివరి వరకు నడిపించిన విధానముతో ఒక పట్టున చదివిస్తాయి. అలాంటి రచనలలో, అంటే గ్రాంధికంగా ఉన్నా, చదివించే రచనలు చెయ్యటంలో శ్రీ. పిలకా గణపతి శాస్త్రి గారి తరువాతే ఎవరైనా అనుకోవచ్చును.

శాస్త్రి గారు తూర్పు గోదావరి జిల్లాలోని కట్టుంగ లో జన్మించారు. సంస్కృత ఆంధ్ర భాషలో నిష్ణాతులు. వారు సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయులుగా పని చేశారు. కొంత కాలం పత్రిక సంపాదకులుగా కూడా పని చేశారు.

ప్రాచీన గాధాలహరి, హరి వంశం, విశాలనేత్రాలు, గృహిణి, హేమపాత్ర వంటి రచనలతో పాటు దేవి భాగవతం, మహాభారతం వచనంలో రాసి మనకందించారు. పౌరాణిక రచనలు వీరికి విశేష ఖ్యాతి తెచ్చిపెట్టాయి.

‘ప్రాచీన గాథాలహరి’ నేను 7 సంవత్సరాల క్రితం మొదటి సారి చదివాను.ఆ పుస్తకపు అట్ట చుస్తే ‘కథా సరిత్సాగరం’ కథ ను పోలి ఉంటుంది.

దీనిలోని కథలు సంస్కృత వాజ్మయ కథలకు అనుకరణ కావని మనకు ముందు మాట లోనే చెబుతారు.ఇవ్వన్నీ ఒక సంస్కృత శ్లోకమో, పద్యమో, చిన్న చిన్న సంఘటనలో తీసుకొని, వాటి నించి గణపతి శాస్త్రి గారు అల్లిన కథలు. శ్రీ శాస్త్రి గారు అల్లిన కథనము చదువుతూ వుంటే పాఠకులు ఊహా లోకాలలో విహరిస్తారన్నది అతిశయోక్తి కాదు.

ఇందులో మోత్తం 54 కథలు ఉన్నాయి. ఇవి ఆనాటి వార పత్రికలలో, అంటే 1962 ప్రాంతాలలో వచ్చాయట. తరువాత వీటిని 4 సంపుటాలుగా ప్రచురించారు.

ఇప్పుడు నాలుగు సంపుటాలు కలిసి ఒక పుస్తకంలా ఎమెస్కో 2011 లో ప్రచురించారు.

ఇందులోని అన్ని కథలు మణిమాణిక్యాలే . మనం పుస్తకం మొదలెట్టామంటే కథలు అన్నీ చదివి కానీ వదలము. గ్రాంధికం లో సరళము, సరళము లో మృదువత్వం తో ఏకబిగిన చదివించే కథలు అవ్వన్నీ.

ఒక్క కథ ఉదహరిస్తాను. కథ పేరు ‘క్షత్రియ మహిళ’.

ఈ కథ చిత్తూరు రాజా వారి వేట తో మొదలవుతుంది.

వేటలో మొదట్లోనే వీరంతా అడవి పంది వెంట పడి తరుముతూ ఉన్నారు. ఆ అడవి పంది వీరికి అందకుండా ముప్పతిప్పలు పెడుతూ పరుగెడుతూ మాయమవుతుంది.

వీరికి అది దొరికేదే .. ఎలా అంటే అది నిద్రపోతూ వుంటుంది వీరు చూసినప్పుడు.. మరి అప్పుడు దాన్ని చంపితే వీరి వీరత్వం ఉండదు కాబట్టి, ఆ అడవి పందిని అల్లరి చేసి లేపి వెంటపడుతారు వీరవరేణ్యులు” అనో ఒక వంగ్యపు ధ్వనితో వీరి మృగయావినోదం గురించి వర్ణిస్తారు రచయిత.

అక్కడ అడవి పందిని ఎందుకు వేటాడాలి, దాని ప్రాముఖ్యత వేటగాళ్ళకి ఎందుకు ఉందో కూడా పాఠకులకు వివరిస్తారు. సుక్షత్రియ వంశంలో వారు అడవి పందిని వేటలో చంపితేనే ‘బంటు’ అని.

ఆ అడవి పంది వీరికి దొరకకుండా పారిపోయింది. సాయంసమయానికి వీరు వెతుకుతూ ఒక జొన్న చేలు దగ్గరకు చేరుతారు.

ఈ ప్రారంభంతో మనకు క్షత్రియులలో వీరత్వం గురించి వివరిస్తారు. అలా అడవిపందిని కొట్టి కానీ వెళ్ళకూడదని వెంటాడుతూ జొన్న చేలు చేరిన ఈ బృందం చేను మధ్యలో ఉన్న మంచెమీద ఒక పడుచు పిల్లను చూస్తారు. ఆమె మంచె దిగి వస్తుంది వీరిని చూసి, పంది గురించి అడగటం, మంచే మీదే ఎక్కి చూసి నాలుగు మూలాలు పంపుతుంది వీరిని. వీళ్ళకు ఆ అడవి పంది చిక్కదు. ఈ యువతి నాలుగవ సారి మంచె ఎక్కి చేను కదలిక బట్టి బల్లెం విసురుతుంది. ఆ దిక్కుగా వెళ్లి చచ్చిన అడవి పంది చెవి పట్టుకు లాక్కువస్తుంది. ఆశ్యరంతో ఉన్న బృందానికి ఆ పందిని తీసుకో పొమ్మని దానం కూడా చేస్తుంది.

ఈ బృందం పైకి చెప్పకపోయినా అవమానం మనసులో కలిగి వెనక్కి వచ్చేస్తారు.

తిరిగి పోతున్నప్పుడు రాజు గుర్రం కాలికి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ కూడా ఆ యువతి విసిరిన బరిసె లోంచి వచ్చిన రాయితో. ఆమె వివరాలు తెలుసు కుంటారు. ఆమె ఒక సాధారణ సైనికుని కుమార్తె. ఈ సైనికుడు విశ్రాంతి (retired)తీసుకుంటూ ఉంటాడు.

అవమానంతో రాజు తిరిగి వెళ్ళిపోతాడు. అతనికి ఈ అవమానం విషయం మరుపుకు రాదు. “పంచకళ్యాణి కాలికి తగిలిన వడిసెల రాతి గాయం నాలుగైదు రోజులలో మానిపోయింది కానీ ఆ సంఘటనాఘతం వల్ల అతని హృదయంలో ఒక పెద్ద గాయమే ఏర్పడింది” అని వివరిస్తారు రచయిత.

మంత్రి తో ఆ అమ్మాయి తండ్రిని పిలిచి సంబంధం కుదర్చమంటాడు రాజు. కోటకు వచ్చిన సైనికుడు, పిల్ల కోసం ఇంటికి రాకుండా పిలిపించటం అవమానంగా భావించి తిరస్కరిస్తాడు.

వాళ్ళని వద్దంటే, నాశనం తప్పదని మంత్రి బెదిరిస్తాడు. సైనికుడు బెదరడు. పిల్ల కావాలంటె ఇంటికి వచ్చి సంబంధం అడగాలి కానీ, ఇలా కాదని అతని నమ్మకం. క్షత్రియ మర్యాద పాటించలేదు, సమానం కానివారితో సంబంధం అంత మంచిది కాదని కూడా అనుకుంటాడు సైనికుడు.

ఇంటికి వచ్చి భార్య తో చెబితే, ఆవిడకు ఈ నిర్ణయం నచ్చదు. రాజు కి ఇచ్చి పెళ్లి చెయ్యక గొడవ ఎందుకని దెబ్బలాడుతుంది భర్తతో. ఇంటికి వచ్చిన యువతి, ఆ రాజు సంబంధం వద్దని తిరస్కరిస్తుంది.

సైనికుడు సంబంధం కుదరదని చెప్పి వెళ్ళాక రాజు కు ఆ యువతి ని వివాహం చేసుకోవాలని కోరిక మరింత బలంగా అనిపిస్తుంది.

రాజు ఒక నాటి సాయంత్రం వాహ్యాళి కని బయలుచేరి జొన్న చేలకేసి వెడతాడు. ఇంటికి పాల కడవతో వెడుతున్న హీరా (యువతి ) కనపడుతుంది. వెనకగా వెళ్లి బెదిరించాలని అనుకుంటాడు. తెలివి గల ఆ యువతి చేతిలో మళ్ళీ చిక్కి గుర్రం మీదనుంచి పడుతాడు.

ఎత్తుకుపోతే నీ గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు రాజు.

దానికి ఆమె “మహాప్రభూ! పాలవంటి సుక్షత్రియ వంశంలో అవతరించిన చిత్తూరు రాజులకి పందిని కొట్టడమే బంటు తనమనుకున్న కానీ బాలికను అపహరించుకుపోవటం కూడా వారికొక బంటుతనం అనుకోలేదు!అయినా భయం లేదు. ఇదిగో కైజారు”

అంటూ కత్తి దూస్తుంది.

కొద్ది సంభాషణతో ఆమె తెలివినీ,

ధైర్యాన్నీ చూసి, కోట కొచ్చిన రాజు మరురోజు పురోహితులతో, మంత్రులతో సైనికును ఇంటికి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకుంటాడు. యువతి తో వివాహానికై అడగటానికి. అక్కడ సైనికుని కుటీరంలో రాజును స్వాగతించటానికి సిద్ధమవుతారు వారు.

కథ చివరి మాటగా

” ఆ సాయంత్రం హీరా విసిరిన వడిసెల రాయి చిత్తూరు కోటగోడపై ప్రతిష్టించిన సువర్ణ కలశానికే తగిలింది. అది అరగడియ వరకు ఖంగని మారుమ్రోగింది”. అంటూ ముగిస్తారు.

ఈ కథ లో రాజుల వీర్యమే కాదు, క్షత్రియులైన స్త్రీ లు చూపించే వీరం, ఆత్మ గౌరవం ప్రతిఫలిస్తాయి.

కథ మొదట ఆమె ధైర్యం అడవి పందిని కొట్టటంలో చూపిస్తారు రచయిత.

రాజుకు, హీరా తండ్రికి ఎట్టి సారూప్యం లేకపోయినా, ఎదురు తిరిగిన సైనికుని ఆత్మగౌరవం, తండ్రికి తోడుగా నిలపడిన హీరా ధైర్యం ఉన్నాయి.

ఆమెను మరల వచ్చి కలిసినప్పుడు ఆమె తెలివి తేటలు రాజుకు అర్థమయ్యాయి. ఆమె అవసరమైతే ఎంతటి తెగువ చూపిస్తుందో తెలిసాక తన తప్పు తెలుసుకొని, రాజమర్యాదలతో ఆమెను వివాహమాడటానికి నిశ్శయం చెయ్యబడుతుంది.

కోట గోపురం రాజుల గౌరవం. ఆ కలిశానికి తలిగినది చెప్పి ముగించటంలో ఆమె గెలుపు స్పస్టమవుతున్నది పాఠకులకు.

ఆద్యంతం పట్టి చదివించే కథనంతో, చక్కటి కధానికలతో, ప్రాచీన గాధాలహరి చదవరులను అలరిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s