వసంత పంచమి

“యా కుందేందు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా

యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభి ర్దేవైస్సదాపూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా’

మాఘ శుద్ధ పంచమి న వసంత పంచమి జరుపబడును.

దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు.

దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు .

సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి.

సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. తెల్లని వస్త్రంతో, తెల్లని పద్మములో కూర్చొని, తెల్లని హంసను చెంత నుంచుకొని ఉంటుంది.

కుడి చేతిలో జపమాల , ఎడమ చేతిలో పుస్తకంతో , మిగతా రెండు చేతుల్తో “కచ్ఛపీ” వీణను వాయిస్తుంటుంది.

సరస్వతి బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది.

మేధకు, జ్ఞానానికి, బుద్ధికి, స్వచ్ఛతకు, ప్రశాంతతకు, సంతోషానికి, తెలివికి గుర్తు సరస్వతి.

మానవులు ఎంత ధనవంతులైనా, బుద్ధి, తెలివి లేకపోతే ఆ ధనము నిలవదు.

వారు జీవితం పండించుకోలేరు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ తల్లి దీవెన కావాలి. అలాంటి తల్లి జన్మించిన రోజు ఈ నాడు. అందుకే ఈ రోజు విద్యారంభం చేసుకుంటారు, వేడుకలుగా.

ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు.

సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు.

సత్త్వరజస్తమో గుణాలను బట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా పూజిస్తారు.

ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి.

ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు.

బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది.

ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది.

వాక్కుకు అధి దేవత కాబట్టి, మంచి వాక్కు కోసం కూడా ఈ తల్లిని కొలవటం సామాన్యం.

మాటలను త్వరగా రాకపోతే సరస్వతి ఆకు తినటము, పిల్లలకి సరస్వతి లేహ్యం పెట్టటం కూడా సామాన్యంగా వాడుకలో ఉన్నది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం.

నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది.

ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి.

ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని.

కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం.

సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటూ, ప్రయాగ లో ప్రకటితమౌతున్నది.

మానవ శరీరం లో ఇడ, పింగళ నాడుల మధ్య కనిపించకుండా ప్రవహించే సుషుమ్ననాడి సరస్వతికి రూపం.

మానవుని శరీరమందు “పరా,పశ్యన్తి, మాధ్యమా, వైఖరి” రూపములలో నిండి ఉంటుంది ఈ తల్లే!

“ప్రణవమందు వర్ధిల్లు ప్రణవ రూప జననీ

పలుకు సంకల్ప రూపముగ నుండు బిందురూపా ‘పరా’ వాక్కువు –

చలించిన భావముల రూపము ‘పశ్యంతి’ వాక్కువైతివి.

భావములైన వాక్కులు రూపము గాంచిన ‘మధ్యమా’!!

వ్యక్తమైతివి ‘వైఖరి’ వాక్కుగా వాగ్దేవి –

జీవుల నాల్కలందు వెలసితివి వాణిగా

ఆ ప్రణవమే రూపమై నిలచిన భగవతి’

సుషుమ్నలో తిరుగాడు అగ్నితత్త్వ అంతర్వాహిని

ప్రసరిస్తూ ప్రవహిస్తున్న జ్ఞానమయి”…

సరస్వతి అంటే జ్ఞానాన్ని కల్గించే కిరణమనే అర్థం కూడా ఉంది.

సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు.

ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు.

అందుచేత వసంత పంచమి నాడు విద్యాభ్యాసం మొదలెడితే జ్ఞానులవుతారు.

విద్యాభ్యాసమే కాకుండా శుభకార్యాలకు వసంతపంచమి మంచి రోజు అవుతుందని శాస్త్ర వచనం.

ఇలాంటి వసంత పంచమి నాడు మనం అమ్మను ధ్యానించి మనం చేయాలనుకున్న జ్ఞాన, బుద్ధి సంబంధించిన పనులు మొదలెడితే అవిఘ్నంగా సాగిపోతాయనటంలో సందేహంలేదు. —

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s