వంటగదిలో ఆధునికత – ఎంత ఆరోగ్యము ?

పూర్వం, అంటే కట్టెల పోయి ఉన్నప్పుడు, బియ్యం నానబోసి రోట్లో దంచినప్పుడు, సర్వం కుంపటి మీదనో, మరో దాని మీదో వంట చేసే స్త్రీ లకు కిరసనాయిలు స్టవ్వు వచ్చినప్పుడు వంట త్వరగా అవుతున్న సంతోషమే తప్ప మరోటి కలిగి ఉండదు. కానీ అప్పటి రోజులలో కాఫీ, పాలు కిరోసిన్ స్టవ్వు మీద కానిచ్చి, ఆ స్టవ్వు తాలూకు వాసన గురించి కంప్లియెంట్ చేసేవారట. 
కుంపట్లో కాచమని కూడా గొడవ వుండేదని చెబుతారు పెద్దవాళ్ళు వుంటే. 
గ్యాస్ స్టవ్వు భారతీయ మధ్యతరగతి వంటగృహాలలోకి వచ్చినప్పుడు వంట త్వరగా అవటం వలన స్త్రీ లకు కలిగిన సమయంలో వాళ్ళు కూడా ఉత్పత్తి రంగంలోకి రావటం వైపు దృష్టి సారించగలిగారు. 

స్టవ్వు మీద పెట్టి కుక్కర్ లో వండే వంటను మొదట్లో పెద్దగా స్వాగతించలేదు. దాన్ని చాల కూలంకుషంగా పంచనామా చేసి, డిబేట్ పెట్టి, అవసరమా  మనకు అంటూ చాల రోజులు నాన్చారు.

 కుక్కర్ మూలంగా జరిగిన ప్రమాదాలు, సంఘటనలు కోకొల్లలు. 
మా కజిన్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక కుక్కర్ ఆక్సిడెంట్ నాకు గుర్తు వుంది. ఆ రోజు అమ్మ వెళ్లి వాళ్ల ఇంట్లో స్టవ్ ఆపింది. పిన్నికి దెబ్బలు తాకలేదు పెద్దగా. 
కానీ విజిల్ పైకి ఎగిరి, అన్నం పూర్తిగా రూఫ్ కి అంటుకుంట్లు గుర్తు. ఇది చాల చిన్నప్పుడు. 
అప్పుడు అమ్మ మాతో చెప్పింది, మూడు సార్లు విజిల్ రాగానే స్టవ్ ఆప్పాలి. లేకపోతె లోపలి స్టీమ్ కి వెయిట్ ఎగిరిపోతుంది అని. కుక్కర్ చల్లారాలి, అంతవరకూ ముట్టుకోకూడదు అని. 
ఇది నా మూడో తరగతో. అప్పుడు కుక్కర్ వాడటం గురించి ఇలాంటి కబుర్లు చాలా వినేవాళ్ళం.  
ఎంత ఆరోగ్యంకరమైనది  కుక్కర్ లో వంట అని. తరువాత అంతా అది స్టీమ్ మీద ఉడుకుతుంది కాబట్టి, చాలా ఆరోగ్యం అని తేల్చారు. 
అలా కుక్కర్ సర్వ సాధారణమైపోయింది. 
కానీ కొంత మంది మాత్రం కుక్కర్ వాడకం ఆపి, అన్నం డైరెక్ట్ గా వండితే పోషక విలువలు ఉంటాయంటారు. 
అందులో నిజం లేదు.  ఎందుకంటే, కుక్కర్ లో అన్నం నుంచి మనం గంజి వంచం, కాబట్టి ఆ బియ్యం ఇచ్చే పోషకాలు మనకు అన్ని అందుతాయి. 
పైపెచ్చు స్టీమ్ లో వండిన వంటకాలు పోషకాలు అలాగే ఉంటాయన్న రీసెర్చ్ కూడా మనకు ఉన్నది. 
ఇదంతా కూడా నిన్నటి విషయాలు.  
తరువాత వంట గదులలోకి  మిక్సీ రంగప్రవేశం చేసింది. పచ్చడి గబ్బుక్కున నూరుకోవటానికి, పొడులకు వాటికీ చాల సహాయకారిగా ఉంది, సమయం తగ్గించింది. 
దీనిలో కూడా ఆరోగ్యం లాంటి
సమస్య గురించి కన్నా రుచి గురించి మాట్లాడే పెద్దలున్నారు. 
మా అమ్మమ్మ కొబ్బరి పచ్చడి కానీయండి, మరోటి కానీయండి రోట్లోనే నూరేది. 
రోటి పచ్చడి రుచి గ్రైండర్ కు ఉండదని ఆవిడ వాదన. 
ఆమెలాంటి వారు మనకు కోకొల్లలు నేటికీ. అందుకే రోటి పచ్చళ్ళ మీద అంత పెద్ద  సమూహమే కనపడుతుంది.  

నేడు మార్పు మరింతగా మన వంటగది ని మార్చింది. 
అందునా ముఖ్యం గా అమెరికా లాంటి దేశాలలో ఉన్న ఈ మార్పు (నేను వచ్చిన 20 ఏళ్ళ నుంచి ఉన్నది) నేడు భారతీయ వంటగదులలో కూడా ప్రవేశించినది. అదే మైక్రోవేవ్. 
దానికన్నా ముందు ఫ్రిడ్జ్ వచ్చింది. నిలువ సరుకు పెరిగింది. అంటే ఒకసారి వండినది మిగిలితే, దాచి మరోరోజు తినటం మొదలైంది. అది తప్పు కూడా కాదు. 
దాన్ని వేడి చేసె క్రమంలో నేడు అన్ని చోట్లా మైక్రోవేవ్ అన్నది వచ్చేసింది. 
అంటే దాదాపు మోడరన్ కిచెన్ ప్రతి మధ్య తరగతి గృహంలో చూడొచ్చు నేడు. 

ఎలెక్ట్రి రైస్ కుక్కర్, ఇన్స్టంట్ పాట్ లాంటివి , ఎలక్ట్ర్ స్టవ్, మైక్రో వేవ్, కన్వెన్షనల్ ఒవేన్, ఫ్రిడ్జ్, కూలర్, గ్రైండరు లాంటి శక్తివంతమైనవి, వెట్ గ్రైండర్, కాఫీ ఎస్ప్రెస్సో, కాఫీ మేకర్, డిష్ వాషర్, ఇత్యాది వాటితో వంట గది అత్యాధునికంగా మారింది. 
ఇక్కడే కాదు, ఇండియాలో కూడా  నేడు ఇలానే ఉంటుంది. ఒక్క డిష్ వాషెర్ రాలేదు. ఇంకా మాన్యుల్ సహాయం అందుతోంది కాబట్టి కామోసు. 
ఇవ్వన్నీ స్త్రీ ల కోసం కాదు, వంటకు అవసరం. 
నేడు జీవిత వేగం మారింది. పూర్వంలా రోజంతా వంటగదికి అతుక్కుపోయే సమయం, ఓపిక ఎవ్వరికి ఉండటంలేదు. 
మనకు లక్షా తొంబై వ్యాపకాలు, పనులు. 
పూర్వంలా పనుల కోసం బయటకు వెళ్లకుండా ‘వర్క్ ఫ్రొం హోమ్’ వాళ్ళు ఒక ప్రక్క వంట చేస్తూనో, కూరలు తరుగుతూనో, ఆఫీస్ పని చెయ్యటం సాధారణం అయింది. 
అంటే మల్టీ టాస్కింగ్ లో మళ్ళీ అష్టావధానము.  మరి ఇలాంటప్పుడు వంట ఇలానే వండాలి, పచ్చడి రోట్లోనే నూరాలనే ఆలోచనలు కుదరవుగా. 
ఇవి అన్నీ మనిషి ఆధునికతకు కాదు, అవసరం కోసం.
ఒకొక్కళ్ళు చేసే తట్టెడు పని కోసం తప్పదు కదా!
ఇలాంటి సందర్భాలలో  వీటి వాడకం ఎంత ఆరోగ్యకరం అన్న ప్రశ్న సంధించి వదులుతున్నారు. 
మైక్రోవేవ్ వాడకం తప్పని కొందరు ఉద్యమకారులు వాడటం మానేశారు. 
మైక్రోవేవు వాడకములో పోషక పద్దార్థాలు పాడవవు. మామూలుగా వంటలో వాడే వేడి కన్నా తక్కువ వేడితో వంట సాగుతుంది కాబట్టి మైక్రోవేవ్ వంటలో పోషకాలకు కలిగే నష్టం వుండదు. 
దీని మూలంగా క్యాన్సరు వంటి జబ్బులు వస్తాయంటారు. ఎంత వరకు నిజము?
మైక్రోవేవు ను వాడవలసిన పద్దతిలో వాడితే దానితో మీకు కలిగే నష్టం ఏమీ వుండదని రిసెర్చు చెబుతోంది. 
ప్లాస్టిక్ సామానులా ఇది చాలా ప్రమాదకారి అని కొందరి ఉవాచ. 
దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. 
మరి పరిశోధనలు పూర్తి అయిన తరువాతేనే ఇవి బజారులోకి విడుదల చెయ్యవచ్చుగా?
అన్న ప్రశ్నకు ప్రభుత్వం అసలు పర్మిషను ఇవ్వదుగా వీటితో నష్టాలంటే అన్నది మనము ఆలోచించ వలసిన విషయము. కొత్తగా ఈ నినాదాలు ఎందుకో?

మార్పును స్వాగతించటానికి ముందు, దాని వ్యతిరేకత తప్పక వుంటుంది.
దాన్ని తప్పని నిరూపించే నిరసన వస్తుంది. తరువాతనే దాన్ని వప్పుకుంటారు ప్రజలు 
ఇది అలాంటిదే అనుకోవాలి.  నిజంగానే ఇది అనారోగ్యమా? 
ఇది వాడటం మూలంగా వంట గదిలో పూర్తి వంట కు పట్టే సమయము గణనీయంగా తగ్గిపోయ్యింది రెండు గంట వంట అరగంటలో చెయ్యవచ్చు. 

అసలు ఆరోగ్యం గురించి మాట్లాడితే, పచ్చి పళ్ళు దుంపలు తినొచ్చుగా అనే మరో సిద్ధాంతం ప్రతిపాదించినవారు ఉన్నారు. 
గుర్తు తెచ్చుకోండి, పూర్వం ఆది మానవుడు పచ్చివి తింటూ, వంట కనిపెట్టింది అరుగుదల కోసం. రుచి అదనపు బెనిఫిట్. 
కాబట్టి ఈ కొత్తవి అన్ని కూడా వంటగదిలో సాయానికే. వత్తిడి తగ్గించి వంట చేసే వారికి వత్తిడి తగ్గించటానికే. 
వంటగదిలో స్త్రీ లు పనిచేసే  సమయం బట్టి ఆ దేశము ఎంత డెవలప్ అయ్యిందో చెప్పే ఒక సిద్ధాంతం కూడా ఉంది. 
డెవలప్మెంట్ అన్నది పక్కన పెడితే ఇలాంటివి సహాయకారిగా ఉండి వంట గదిలో వాడే వారికీ వత్తిడి తాగిస్తాయన్నది నిర్వివాదం. 
కాబట్టి మార్పును స్వాగతించాలి. 
ఆరోగ్యం కాని వాటికి అనుమతి వుండదు కాబట్టి, అనవసర అనుమానాలతో సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోకూడదని నా అభిప్రాయం. 
అయినా ఇవ్వన్ని కనిపెట్టి వాడమని మన మీదకు వదిలి, మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యం గురించి ప్రశ్నలు లేపటం మర్యాదనా చెప్పండి!!!  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s