కుదిపేసిన గొల్లపూడివారి సాయంకాలము

మంచి పుస్తకానికి ఉన్న లక్షణం  పాఠకులను ఏకధాటిగా చదివించటంలోనే కాదు, చదివాక దాని ప్రభావంలో చదివిన వారు కొట్టుకుపోవడం. 
అదీ అట్లా ఇట్లా కాదు, పూర్తిగా మునిగి పోవటం. వారిలో కొంత మార్పు తేవటము. పాఠకులు తమ కథను చదివిన కథతో అనుసంధానించుకోవటం. 
పాత్రలలో మమైక్యమైపోవటం. తమ కోణంలో కథను చూడటం. కొన్నిచోట్ల కథతో తాదాత్మ్యం చెందటం. కథను కొంత సమర్ధించుకోవటం. వెరసి పూర్తిగా అందులో మునిగి తమను తాము కోల్పోయేలా చేసేది మంచి కథ, పుస్తకమనవచ్చును కదా!
అలా ఒక వారంగా నేను  కొట్టుమిట్టాడుతున్నాను, ఒక ప్రవాహములో పడి. దానికి కారణం గొల్లపూడి మారుతీరావు గారు రాసినసాయంకాలం‘.

నవల 15 సంవత్సరాలకు పూర్వం వార్తాపత్రికలలో వచ్చిందట. నేను తెలుగు రాష్ట్రాలకు దూరముగా వుండటముచే యధా ప్రకారం నాకు తెలియదు. కానీ ఇది నేను చదవాలనుకున్న పుస్తకాల లిస్ట్ లో ఉన్నది. ఇప్పుడు  నవలగానే చదివాను. పూర్తిగా చదివే వరకు పుస్తకం కింద పెట్టలేదంటే అతిశయోక్తి కాదు, గొల్లపూడి వారి కథనంలో ఉన్న  గొప్పతనం అది. ‘సాయంకాలములో వున్న సౌందర్యం అది. రచయిత కధంతా మన ప్రక్కన కూర్చొని చెబుతున్నట్లుగా ఉంటుంది. 

జీవితం ఒక నదీ ప్రవాహం వంటిది ! తటస్తంగా ఉండదు. జీవనదిలా ఉండే జీవితం సదా కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు మార్పు సహజం! అలాంటి మార్పును చూపించారు ఇందులో గొల్లపూడి వారు. మార్పు చాలా సహజంగా వచ్చినా, దానిని పాత్రలు  తీసుకున్న విధానము విశదీక రించారుసాయంకాలంలో.  
కానీ మార్పును ఆయన చాలా తటస్తంగా చెబుతారు. జడ్జిమెంటల్ గా చెప్పరు. 
కొందరి జీవితాలలో మార్పు మూలంగా తెచ్చిన ఆనందకరమైన సంగతులుంటే, కొందరిని మార్పు అతలాకుతలంచేస్తుంది. అది సర్వ సాధారణం కదా! 
పాత తరానికి మార్పు నచ్చదు. వారు అలవాటు పడిన మార్గమునకు భిన్నమైనది అది. అందుకే ఇప్పటికీ మన ఇంట్లో ఉండే పెద్దవారుమా రోజులలో” “ రోజులలోఅంటూ ఉంటారు. అలాంటివారికి మార్పుసాయంకాలం‘. 
కానీ ముందు తరాలకి మార్పు కావాలి. మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి కాదుగా. నది ముందుకు ప్రవహిస్తుంది, పల్లానికి దూసుకుపోతుంది కానీ వెనక్కి వెళ్ళదు కదా! కాబట్టి కొందరికి మార్పు బాగుంటుంది. అలాంటివారిని కూడా ఇందులో చిత్రీకరిస్తారు. 

ఇందులో కథ ఒక శోత్రియ వైష్ణవ కుటుంబానికి సంబంధించినది. 
మూడు తరాల నుంచి కథను మనకు టూకీగా పరిచయం చేస్తారు. కథలో వారు ఎంత నిష్టాగరిష్టులో మనకు బోధపడుతుంది. 
సుభద్రాచార్యులు గారి కాలంలోకి వచ్చినప్పుడు, మార్పులు తుఫాను వేగంతో  వారి జీవితంలోకి వస్తాయి. సంపద్రాయాలలో మునిగి తేలే కుటుంబంలోకి వచ్చిన మార్పు చదువు. 
చదువు కుటుంబీకుల మధ్య బాంధవ్యాలలో తెచ్చిన మార్పు, సంప్రదాయాలు పాటించటంలో వారు చూపిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు వీటిని అద్భుతంగా చూపించారు గొల్లపూడి. 
సుభద్రాచార్యులు వారి  పూర్వీకుల యొక్క నిష్ఠ గురించి చెబుతూ హిందూ తత్వ జ్ఞానం గురించి, శ్రీవైష్ణవ ఆచార వ్యవహారాల గురించి సవివరంగా, విస్తారంగా వివరిస్తారు. చదువు కోసం ఆయన ఒక చోట, పిల్లలు మరో చోట వుండటమన్నది కుటుంబానికి క్రొత్త. 
తన స్వభావములో భాగంలాగ  తనలో మమేకమయిన ఆధ్యాత్మిక సంపద సంచితమైన ఆస్తి లాగా కనిపించింది. 
మనస్సులో ఏదో మూల వ్యగ్రత చోటు చేసుకుంది. 
జీవిత భాగస్వామిని స్నేహితురాలయి, కొడుకు పొరుగుంటివాడిలా కనిపించే వయస్సు. పొరుగూరిలో తన వారు వుంటం తనకి క్రొత్త. మాట కొస్తే, కుటుంబానికే క్రొత్తఅంటారు సందర్భంలో రచయిత. 

సుభద్రాచార్యులు వారి జీవితాన్ని ఆధారంగా చేసుకొని కథ లో మార్పు చూపించారు కాబట్టి ఇదిసాయంకాలంఅయింది. అదే వారి అబ్బాయి తిరుమల జీవితంలో  ఇది సూర్యోదయం కదా! 
అలాగని ఆయన హడవిడిగా అతలాకుతలమవరు.  నిర్లిప్తంగా మార్పును తీసు కుంటారు సుభద్రాచార్యులు. 
మార్పును అంగీకరించక మరచి,పూర్వపు స్మృతులలో గడపటం ఆయన భార్యలో చూస్తాము. 

నవలలో మరో పాత్ర నవనీతం. నవనీతంలో కనిపించే మెచ్యూరిటీ, ధైర్యం, చేయ్యాలనుకున్న పని పట్ల స్పష్టత, ఆశ్చర్యంగా ఉంటుంది. సంజీవిని ద్వారా నవనీతం జీవితంలోకి మరో దిశగా ఎదగటం మరో మార్పు. 

నవలలో మరో సాంఘికమైన, సున్నితమైన, బలమైన విషయం కులాంతర వివాహం. వివాహమును గురించి వివరించినప్పుడు కూడా ఆచార పరులైన వైష్ణవ దంపతుల ప్రవర్తన అద్భుతంగా ఆవిష్కరించారు. అందులో ఒక మాట చెబుతారువైష్ణవమతమును మనసా వాచా పాటించేవారికి సర్వం సమానమని. కానీ దాన్ని తీసుకోవటంలో  మనుషుల ప్రవర్తన వేరు వేరు విధాలుగా ఉండటం విచిత్రం.  అత్యంత ఆధునికతకు గుర్తుగా తిరుమల అంగీకరించటం,సనాతనవాదులైన తల్లితండ్రులు నిర్లిప్తత, నామమాత్ర వైష్ణవులైన రాఘవాచార్యులు తిరస్కరించటం లోకం తీరును,  ప్రవర్తనను వివరిస్తారు . 
ఇది సదాచారానికి సాయం కాలము
సంస్కృతికి ఆటవిడిపు
మనోవికాసంకొత్తను జుర్రుకోవాలని చూస్తోంది. 
సంప్రదాయంపాతని భద్రపరచాలని ఆరాటపడుతోందిఅంటారు రచయిత.   

మార్పుతో ముందుకు సాగిన, జీవన విధానం, చదువుతో ఉన్నతికి సాగటం చూపుతారు కుర్మయ్య ద్వారా ; 
సందర్భంగా గొల్లపూడి వారి కలం సూటిగా, పదునుగా విశ్లేషిస్తుంది. 
పద్మనాభం లో రెండు విప్లవాలు జరుగుతున్నాయి. 
కొడుకు చదువుసంప్రదాయానికి దూరమవుతున్నాడని తండ్రిని కష్టపెడుతోంది. 
మరో కొడుకు చదువుమట్టి పిసుక్కునే స్థితి నుంచి ముందుకు పోతున్నాడని తండ్రి గర్వపడేటట్టు చేస్తోందిఅని. 

సాయంకాలంలో మరో విషయం,అమెరికా వలసలు. పిల్లలు అమెరికా వెళ్ళిపోతే, తల్లితండ్రుల శూన్యమైన మనో పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. 
తల్లితండ్రులపిల్లల అనుబంధసంబంధాలను ఆవిష్కరించారు. అంతరించిన సంప్రదాయాలను ఆచారాలను ఎత్తి చూపించారు. సంప్రదాయాలకు ఇదిసాయంకాలమనే సూచించారు.  

సాధారణంగా పిల్లలు దూరంగా ఉంటే, తల్లితండ్రులు మాట్లాడే విషయాలు అన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. అంటే, మనం ఎప్పుడు ఫోన్ చేసినాఅమ్మా! నాన్నగారు ఎలా ఉన్నారు? ” అని అడిగితే వాళ్ళు సదాబాగున్నామన్న సమాధానమే ఇస్తారు. కానీ వారికి కలిగే సమస్యలను చెప్పరు. 
నాకు కథ బాగా కనెక్ట్ అవటానికి నేను అమెరికాలో ఉండటం కూడా కొంత కారణం కావొచ్చు. తమ్ముడు కూడా ఇక్కడే ఉంటాడు. వాడు ఒక సారి ఇంటికి వెళ్ళే ముందు , అమ్మని నాన్నగారిని తిరుపతి తీసుకుపోవాలని ప్లాన్ తో వెడితే, అమ్మ కాలికి పెద్ద కట్టుతో ఎదురొచ్చిందిట. “ఇదేంటి ఫోన్ లో చెప్పలేదుఅని అడిగితే, ‘అదే పోతుందిలేరా! అనవసరంగా మీకు కంగారుఅని దాటవేసిందని, వాడు నాతో  చెప్పి చాలా బాధపడ్డాడు. 
అదే కాదు ఇక్కడ్నుంచివారికి వచ్చిన చిన్నా, పెద్దా కష్టాలకు తోడు ఉండమన్న ఒక గిల్టీ భావన ఇక్కడ, అంటే అమెరికా లాంటి దేశాలలో ఉన్న ప్రతి వారికి ఉంటుంది. అలాంటి విషయాలను కూడా సున్నితంగా స్పృశిస్తూ కళ్ళనీరు పెట్టించారు గొల్లపూడి. 
తల్లి మరణించాక, వెంటనే వెళ్ళలేక, తిరుమల పడే ఆవేదన, ప్రయాణానికి పడ్డ కష్టం, ఫీల్లీ ఎయిర్ పోర్ట్ లో వెక్కి వెక్కి ఏడవటం మనకు కన్నీరు తెప్పిస్తుంది. 
ఇది చదువుతున్నప్పుడు నన్ను చాలా దుఃఖానికి గురిచేసింది. అమ్మ ఇంక లేదని కబురు అందగానే, ఇన్నివేల మైళ్ళ దూరం నాకు అఘాతంలా తోచింది. అసలు కంటికి దృశ్యం కనపడలేదు. ఎలా వెళ్ళానో తెలియదు. అడుగడుగునా ఏకధాటిగా ఏడుస్తూ ఉండటం మాత్రమే గుర్తు. ఇలాంటివి ఇక్కడ ఉన్న వారికి కలిగే అనుభవాలే. 
మార్పు వల్ల వచ్చేది నష్టమా? కష్టమా? పెద్దలకేనా? పిల్లలకు కూడానా?

అమెరికాలో సెటిల్ అయిన  పిల్లల తల్లితండ్రులలో మరో కుటుంబం రేచకుడిది.
నిజానికి అలాంటి వారు ఉంటారా? అని అనుమానం వస్తుంది. అతని గురించి చదివితే. అంటే, అంత డిగ్రీలో పిల్లలనుంచి  పెద్దలు విషయాలను దాచటం. వాళ్ళు వచ్చి ఏమి చేస్తారు? అన్న నిర్లిప్తం తల్లితండ్రులతో పేరుకుపోతుంది. కానీ రేచకుడి లో  నిర్లిప్తత ఉండదు. సంతోషంగానే దాస్తాడు. 
కొడుకు సంతోషం దూరం చేసే హక్కు తనకి లేదని ఆయన వాదనకు పరాకాష్ట , ఆఖరికి తల్లి పోయిన విషయం కూడా కొడుకు కి చెప్పడు. ఇది నాకు చాలా అసహజంగా అనిపించిన విషయం నవలలో. మరి ఇలాంటి వారు కూడా ఉంటారేమో నాకు తెలియదు.

గొల్లపూడి వారు గొప్ప రచయిత. అయన రచనా శైలి అద్భుతం. వారి రచన శ్రీవైష్ణవులు మాధవునికి  సమర్పించే కైంకర్యంలా వెచ్చగా, కారంగా, తియ్యగా మహా రుచిగా  ఉండే మహా ప్రసాదం వంటిది.
వారి కధనం గురించి ఇక చెప్పనక్కర్లేదు. కధంతా వారు గంభీరమైన స్వరంతో మన ఎదురుగా కూర్చొని వివరించినట్లుగా ఉంటుంది . 
ప్రతి పాత్రా జీవం తొణికిసలాడుతూ మన కళ్ళ ముందు ప్రత్యక్షమౌతుంది. 
పద్మనాభం ఊరు, గోస్తనీ నది, కుంతీ మాధవ వైష్ణవ దేవాలయ ప్రాంగణం, అన్నీ మన కళ్ళ ముందు కనబడుతాయి. 
శ్రీవైష్ణవ ఆచార వ్యవహారాలు, పల్లెలలో ఉన్న పద్దతులతో పాటు ప్రతి మనిషి, పాత్ర వారి మనస్తత్వాన్ని బట్టి, కర్మఫలాలని బట్టి వారి జీవితం నడిపిస్తాడు రచయిత.  
ఇందులో ముఖ్యంగా రచయిత అన్ని విషయాలను పైపైన నుంచి చూస్తూ, ఎలాంటి సైడు తీసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా  అందిస్తారు. ఎక్కడా రచయిత జడ్జిమెంట్ చెయ్యరు. కేవలం మనకు కథను చెప్పటం మాత్రమే ఉంటుంది. మనమే నిర్ణయించుకుంటాము చదివి. 

ఇప్పుడు కాలం కొంత మారింది. కమ్యూనికేషన్ లో చాలా మార్పు వచ్చింది. నిజానికి పక్క ఇంట్లో వారి కంటే దూరాన ఉన్న అమెరికా విషయాలే ఎక్కువగా మాట్లాడుతున్నారు నేటి తెలుగు రాష్టాలలో. ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరో అమెరికాలో ఉన్నారు.  తల్లితండ్రులు పిల్లలను అమెరికా పంపటం అన్న ఒకే ఒక్క లక్ష్యంతో పెంచుతున్నట్లుగా కాలం మారింది. 
ఇలాంటి మార్పు వచ్చినా కూడా నవల మనకు నిత్యనూతనమే. కమ్యూనికేషన్ లో మార్పు వచ్చింది కానీ భారత దేశానికి, అమెరికాకు మధ్య దూరం తరగలేదుగా. 
ఎప్పుడు వెళ్ళాలన్నా 24 గంటలు తప్పదు. కాబట్టి నవల చదివిన వారికి నాటి కాలము గురించి, వస్తున్న కొత్త కొత్త మార్పుల గురించి, గడచిన కాలపు సాయం సమయాల గురించి చెబుతున్నట్లే ఉంటుంది. 
అందుకే నవల తెలుగు సాహిత్యంలో మరో మణిపూసగా నిలిచిపోయింది. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s