1.అమ్మ చిరునవ్వు భాష తెలుగు।
అమ్మ మమ్ముల దగ్గరకు తీసుకొని పెట్టిన గోరు ముద్దలు భాష తెలుగు।
మా చిన్నతన్నాన ఆడిన గుజ్జనగూళ్ళ భాష తెలుగు।
నాన్న చెయ్యి పట్టుకు నడిచిన నడత తెలుగు।।
2.నన్నయ్య అక్షర రమ్యత తెలుగు।
తిక్కన నాటకీయత తెలుగు।
కృష్ణరాయలు పద్యసొగసు తెలుగు।
రామకృష్ణుని చతురత తెలుగు।
పెద్దన ప్రవరుని పవిత్రత తెలుగు।
నంది తిమ్మన నుడికారము తెలుగు।।
3.పోతన భాగవతపు వెలుగు తెలుగు।
శ్రీనాధుని వీర శృంగారము తెలుగు।
గురజాడ ముత్యాల సరాలు తెలుగు।
కందుకూరి సంస్కరణలు సారము తెలుగు।
4.విశ్వనాథుని గంభీర పటిమ తెలుగు।
కిన్నరసాని జిలుగు తెలుగు।
అడవిబాపిరాజు కొణంగి తెలుగు।
కృష్ణశాస్త్రి ఉర్వసి మెరుపు తెలుగు।
శ్రీశ్రీ విప్లవశంఖారావము తెలుగు।
అంత్యప్రాసల ఆరుద్ర కూనలమ్మ తెలుగు।
వేమన తెలిపిననీతి తెలుగు।।
5.మేము నమ్మిన వాగ్దేవి వాక్కు తెలుగు।
ఏ దేశమేగినా మా గుండె చప్పుడు తెలుగు।
మా పిల్లలకు మేమిచ్చి ఆస్తి తెలుగు!!
ప్రపంచాన పెరుగుతున్న భాష తెలుగు।
రేపటి వెలుగు విరజల్లు తున్న మెరుపు తెలుగు।।
-సంధ్యా యల్లాప్రగడ