క్యాప్సికం రైస్ తో జీవిత పాఠాలు :
కొన్ని సార్లు కొన్ని విషయాలు చిన్నవే కానీ, చాల పెద్ద పాఠాలు చెబుతాయి. నాకు వంట అంతగా ఇష్టమైన విషయం కాకపోయినా, వండటంలో, వడ్డించటంలో చాలా శ్రద్దగా ఉంటాను.
అంటే, ఒక జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మిలా ఎలాగైనా మంచి వంట చేసి భర్తను ఎలా సంతోష పెట్టాలని ప్రతిజ్ఞ చేస్తుంది చూడండి. అలాగా నేను కూడా నా పెళ్ళైన క్రొత్తలో ప్రతిజ్ఞ చేశాను.
అప్పుడు నా వంట నిజానికి ఛండాలంగానే ఉండేది. నేను కూర చేస్తే నేనే తినలేను అలాగన్న మాట!
అయినా పాపం శ్రీవారు నోరెత్తి ‘బాలేదు’ అని ఒక్కసారి అనలేదు. కానీ మా పక్కింటి మిత్ర స్త్రీ లు ఉంటారుగా వారు మా వారి మీద తెగ జాలిపడిపోతూ ‘పాపం, ఆ అమ్మాయి ఎలా వండినా తింటాడు” అని గుసగుస్స్ తో నాలో నిద్రాణమైన పతివ్రతను నిద్రలేపారు.
ఆ రోజు ప్రతిజ్ఞ చేశాను. అత్యద్భుతంగా వండాలి. మళ్ళీ శ్రీవారు ఎవ్వరిది తిన్నా, నా వంటే బాగుందని, ఇంటికి వచ్చి ఇంట్లోనే కడుపు నిండా సృష్టుగా బోంచెయ్యాలని.
అలా ప్రతిజ్ఞ పూనాక మరి వారికీ బయట ఎక్కడ తిన్నా ఇంట్లో ఫుడ్ ముందు దిగదుడుపే అన్న భావన రావాలి కదా!! అలానే నేను సాగిస్తున్నామనుకోండి.
అపుడప్పుడు అది తప్పితే, ఇంట్లో నేను వీరగా చేసి, ‘ఇంకా చాలు ..నీవే బెస్ట్…. నీ ‘వంటే‘ బెస్ట్ ‘ అని అనిపించేదాకా వదలను. ఆలా మరి నేను పత్తివత్తను గా కదా! అదన్నమాట సంగతి! అంటే ఒకసారి ఇలానే బయట ఎక్కడో పెసరట్టు తిన్నారు. పోనీ తినారే పో… ఆహా! ఓహో! “ఎన్ని రోజులకు నా జిహ్వకు సంతృప్తి” అంటూ లొట్టలు వేయ్యాలా?? అయ్యింది నీ పని మహానుభావా! అన్ని నేను ఒక వారం రోజులు వీరగా వేశాను పెసరట్టేనండోయి. కమ్మగా నెయ్యితో, అల్లం , పచ్చిమిర్చి వేసి, ఉల్లి, జీల కఱ్ఱ చల్లి, స్వర్గానికి బెత్తెడు దూరంలో నిలబెట్టే పెసరట్టు తిని, తిని, ఇంకా పెసరట్టు కాదనలేక, దానికి అన్యాయం చెయ్యలేక – మళ్ళీ దారికి వచ్చారు!
పెసరట్టు వారోత్సవాలు ఆపమని, కాలావేళ్ళా బ్రతిమిలాడారు . అదన్నమాట !.
మరి నేను వంటగత్తెలు కాదు కదా. పైపెచ్చు నాకు పెళ్లి వరకు ఎలాంటి టిఫన్ కూడా తెలియదు. నేర్చుకు చేసిపెడుతుంటే గౌరవం ఉండాలి కదా!
సరే ఇన్ని రోజులలో ఒక సంఘటన జరిగింది. .
మొన్న మేము ఒక భజనకు వెళ్ళాము. మాములుగా ఎక్కడ ప్రసాదం మిగిలిపోయినా , అందరమూ పంచుకుంటాము. వేస్ట్ చెయ్యకూడదు కాబట్టి. నేను మా శ్రీవారితో “నీకు నచ్చింది తెచ్చుకో” అన్నాను. ఆయన ఎదో విని గమ్మున ఉండకుండా,” ఈ కాప్సికం అన్నం ఆహా బలేగా వుంది, నీవు చెయ్యవు ఇలాగు” అంటూ తెచ్చారు.
అక్కడ నా పులిహోర హాట్ కేక్ లా వెళ్ళిపోయ్యింది.
ఇంట్లో ఇంకా కొద్దిగా వుంది కూడాను.
పైపెచ్చు జీరా రైస్ కూడా వుంది. ఇన్ని వున్నా ‘పెరటి చెట్టు పనికిరాదు’ చందాన తెచ్చారు. పోని దాని రుచి చుద్దామా అంటేనూ,అదేమో ఉంది చప్పగా, ఒక ఉప్పు లేదు కారం లేదు….. .. ఇక చూడండి , నాలో నిద్ర పోతున్న శ్రీలక్ష్మి నిద్ర లేచి,పూర్వం చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసింది .
వెంటనే మళ్ళీ ఎక్కడా తినలేనంత అద్భుత క్యాపిస్కమ్ రైస్ చెయ్యాలని ఒట్టు వేసుకున్నాను. నాకు అసలు కాప్సికం రైస్ ఎప్పుడో తెలుసు. 10 ఏళ్ళ క్రిందట మా ఫ్రెండ్ ఇది తెగ చేసేది. నాకేం కాప్సికం కూర అంటేనే ఇష్టం. పైపెచ్చు కూర రోటి లోకి బాగుంటుంది. అదీ కాక ఈయనకు ఆ రైస్ ఇష్టమని నాకు తెలియదుగా. అందుకే నేను చెయ్యనిది . పోని తిని ఇంటికి వచ్చి చెయ్యమని అడగొచ్చుగా అమ్మా. ఆహా! తిని ఆ చప్పటి దాన్నికి లొట్టలా. ఇహ వూరుకోకూడదు. మళ్ళీ నా ప్రతివతా లక్షణాన్ని నిద్రలేపాలి.
ఈ రోజు క్యాప్సికమ్ రైసు, పెరుగు పచ్చడి, మెంతిబద్దలు చేసి వూదరకొట్టా. తిని మా వారు ఇక ఎక్కడా ఫుడ్ బాగుండదని, మళ్ళీ వారం రోజులు ఇది చేసినా తింటానని ఒకటే నమస్కారాలు పెడుతుంటే సరే నని మరోజు ఇంకోటి డిషుకు షిఫ్ట్ అయ్యాను!! ఇంక ఎక్కడ తిన్నా ఇలాంటిది తినలేనని మొన్న తిన్నది దీని ముందుకు పనికిరాదని, నా ‘వంటే‘ బెస్ట్ అని అనిపించాకా శాంతించింది నాలోని శ్రీలక్ష్మి. మరి కాకపోతే ఏంటి? వంటను ఇష్టపడకపోయినా ఎన్నో రుచిగా చేస్తాము. అయినా పొరుగింటి పుల్లకూర రుచి అంటే మనం జంధ్యాలను పిలవాల్సిందే. దారికొస్తారు శ్రీవారు.
మరి ఇంత రుచికరమైన వంటకము రెసిపీ మీతో పంచకపోతే ఎలా. అందుకే ఇలా వచ్చాను. మీకు తెలిస్తే సరే లేకపోతె ట్రై చెయ్యండి!
క్యాప్సికమ్ రైసు కు కావలసిన పదార్థాలు ;
2 కప్పుల అన్నానికి;
3 క్యాప్సికమ్ అవసరము. కాప్సికం కడిగి మీడియం సైజు లో ముక్కలు తరిగి పెట్టుకోండి.
ఇందులో మసాలా కు;
2 చెంచాల మినపప్పు
2 చెంచాల శనగపప్పు
2 చెంచా ధనియాలు
3 చెంచాల వేరుశనగ పప్పు
1 చెంచా ఆవాలు
1 చెంచా జీలకఱ్ఱ
4 ఎండు మిరపకాయ
2లవంగాలు
చిన్నదాల్చనచెక్క
2 ఇలాచి
2 రెమ్మల కరియాపాకు
వీటిని డ్రై రోస్టు చేసి, కచ్చా పచ్చాగా నూరుకోవాలి. పౌడర్ లా మెత్తగా చెయ్యకూడదు. కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది.
2 కప్పుల అన్నము వండాలి. బాసుమతి బావుంటుంది.
సోనా మసూరి వద్దు.
అన్నం వండేటప్పుడు పొడి పొడిగా రావటానికి కొంచం నూనే వెయ్యండి.
అన్నము పొడిగా వుండాలి. మసాల కలిపినప్పుడు మెతుకు విరగకూడదు. అన్నము చిదమకూడదు.
బాండీ లో నెయ్యి వేసుకొని, అందులో ఈ కాప్సికం ముక్కలు వేసి కొద్దిగా మెత్తపడనియ్యండి. మరి కూర లాగా మెత్తగా అవకూడదు. కాస్త మెత్తగా అయితే చాలు.
అప్పుడు కావలసిన ఉప్పు, పొడి చేసుకున్న మసాలా కలపాలి. దీనికి వండిన అన్నం జత చెయ్యాలి.
బాగా మసాలా కలిసాక, పెరుగు పచ్చడితో కానీ, రైతా తో కానీ కలిపి, వేడిగా వడ్డించండి. కమ్మగా ఉండి తిరిగి తిరిగి కావాలంటారు ఇది.
అదన్నమాట కాప్సికం రైస్ కథా కమామీషు!