మూడు రోజులుగా ముసురుగా ఉంది. అసలు వాన తగ్గడంలేదు.
మాకు వాన వచ్చిందంటే దడ దడగా పడటమే తప్ప ఇలా ముసురుగా ఉండదు. కురిసేది ఒక్కసారి కురిసి, వెళ్ళిపోతుంది.
కానీ ఈసారి మాత్రం మూడు రోజులైనా తగట్టం లేదు.
అసలు ఇక్కడ వారు అంతా వాన గురించి ఎక్కువగా ఎప్పుడు సియాటెల్ లోనే పడుతుందని అంటారు. కానీ మీరు రికార్డ్స్ కనుక పరిశీలిస్తే ఎక్కువ వాన పడేది మా అట్లాంటాలోనే.
వాన పడితే బాగుంటుంది అంతేకాదు పనులకు అంతరాయమని కూడా పెద్దగా అనిపించదు నా మటుకు.
కానీ మా శ్రీవారు మాత్రం వాన అంటేనే దడుస్తున్నాడు ఈ మధ్య. కారణము మా ఇంటి చుట్టూ నిలబడిపోయిన నీరు చూసి. దానికి కాలువలుగా చేసినా, ఈ వానకు ఏవి నిలబడటంలేదు.
నీళ్లు మాత్రమే నిలబడుతున్నాయి.
కొద్దిగా ఇదిగో ఈ చలికాలం తగ్గాకా చూడాలి వీటి సంగతి అంటారు.
అసలు, చలి పొద్దు, వాన పొద్దు వెచ్చటి కాఫీ ఇచ్చే సంతోషం మరోటి ఇవ్వదేమో. అందుకేగా సియాటెల్ లో వీధికి రెండు కాఫీ షాపులు ఉంటాయి.
స్టార్బక్స్ అక్కడే మొదలైంది ఈ వాన మూలంగానే. అక్కడ వాన పెద్దగా పడదు కానీ, సన్నని తుంపర సదా పడుతూ ఉంటుంది. సూర్యుణ్ణి వాళ్ళు ఎప్పుడో కానీ చూడరు.
అలాంటి చలి పొద్దులో, వెచ్చట్టి దుప్పటి కప్పుకు ఉండాలనిపించినా పనుల వలన ఉండలేము కదా!
అందుకే వెచ్చటి కాఫీకి అలవాటు పడి వుంటారు ఆ ప్రజలు.
ఇంక మా అట్లాంటాలో కూడా ఇలాంటి కాఫీ కీ అలవాటు పడాలేమో ఈ వానను చూడబోతే.
వాన అంటేనే ఆలోచనలు వానలా పడిపోతున్నాయి.
చిన్నప్పుడు వాన పడుతుంటే ఒకటే పండుగ.
వాన అంటే ఎంతో ఇష్టం గా ఉండేది.
స్కూల్ కి డుమ్మా కొటొచ్చు. వాన లో తడవటం ఇష్టమైనా, తడనిచ్చేవారు కాదు పెద్దలు.
వాన తగ్గిన తరువాత కాగితం పడవ, కత్తి పడవ చెయ్యటం, నిలబడిన నీటిలో వదలటం యమా సరదాగా ఉండేది.
“వాన వాన వల్లప్పా” అని పాటలు పాడటం కూడా మా వంతే!
కాలజీ లో ఉన్నప్పుడు వాన పడితే మిరపకాయ బజ్జి స్పెషలుగా తెచ్చుకు తినటం బలే ఉండేది. పాత నల్లకుంట బస్సు స్టాపు వెనక మిరపకాయ బజ్జీలకు అప్పుడు ప్రసిద్ధి. కానీ హైదరాబాద్ లో వానాతో మంచి అనుభవాలు ఉండవు ఎవ్వరికైనా.
వాన రాగానే రోడు మీద ట్రాఫికు నిలబడిపోయి, నీటితో పెద్ద మడుగులతో చిరాకు పెడతాయి. మా చిన్నప్పుడు హైదరాబాద్ లో వానకి మరి ఇంతగా ఎక్కడ బడితే అక్కడ తటాకాలు నిలబడేవి కావు.
ఏమైనా వాన వెలిశాక క పూరు చూడటానికి చాలా శుభ్రంగా కనిపించటము వుంది చూశారు ఆ అనుభవం మాత్రం చాల బాగుంటుంది కదా.
అసలు మొదటి చినుకు నేల తగిలినప్పుడు, మట్టి నుంచి వచ్చే ఆ సువాసన నచ్చని వారు ఉంటారా?
ఉండరనే నా అభిప్రాయం.
ఇక్కడ కూడా వాన వెలిశాక ఆ నీరెండలో, నున్నగా మెరుస్తూ ఉన్న వీధులు, ఆ దీపాలు చూడముచ్చటగా అనిపిస్తాయి.
కానీ, వానతో వచ్చే మట్టి సువాసన నాకు ఇక్కడ అనుభవములోకి రాలేదు ఇంతవరకు!
ఏది ఏమైనా వాన పొద్దుల నూనె సరుకు కు, వెచ్చని చాయి కి మంచి గిరాకీ వుంటుంది!
ఇంకోటి కూడా బాగుంటుంది. అదే మనసు దోచే పుస్తకం.
ఒక చక్కటి పుస్తకం, కప్పు చాయి, చాలు కదా వాన పొద్దున అని అనిపిస్తుంది.
మరీ ఏకధాటిగా మూడు రోజులుగా వానపడుతుంటేనే?
పండుగే పండుగ అనుకోవాలా? ముసురు వెలసి, ఆ భాస్కరుని దర్శనం ఎప్పుడా అని ఎదురుచూడాలా?
మొదటిదే బెటర్ కదండీ!
దానికి తోడు వెచ్చటి సమోసా ఉంటేనూ…
ఇంక చెప్పటానికి ఏముంది? స్వర్గపు అంచులలో, హాయిగా వెచ్చగా ఊరేగినట్లేగా!
కానీ ఈమధ్య నూనెలో వండినవి తినటానికి వంకలు ఎక్కువైన పిదప కాలమిది. అందుకే ఈ కొత్త రెసిపీల తిప్పలు, ఆరోగ్యంకై అవస్థలు.
మరీ కొత్తదేమీ కాదు గానీ, నాకు మొదటిసారి చేసిన ప్రయోగం!
ఫలించింది. అందుకే మీతో పంచుకుంటున్నాను!
కన్వెన్షన్స్ ఒవేన్ (convention oven)లో చేసిన సమోసా!
ముందుగా గోధుమ పిండితో పూరి మాములుగా చేసుకోవాలి.
సమోసా లో నింపటానికి ఆలు కూర కానీ, లేదంటే కొద్దిగా ఉల్లి వేయించి, అందులో ఉప్పు, ఒక చెంచా సోంపు పొడి కలిపి, పచ్చి బాటని గింజలు కూడా కలిపి మూతపెట్టి మెత్తబడేలా ఉంచాలి.
ఒక 5 నిముషాలు వేడి మీద నుంచి దించి, పక్కన పెట్టుకోవాలి.
ఒక పూరిని రెండు ముక్కలుగా మధ్యలో కట్ చేసుకోవాలి.
కట్ చేసిన వైపు కొద్దిగా నీటితో తడి చేసి అతికిస్తే త్రికోణాకారంలో కి మారుతుంది.
ముందుగా సిద్దంచేసిన కూరను నింపి, మూసివేసికోవాలి.
అలా అన్ని సమోసాలు సిద్దం చేసుకున్న తరువాత వాటికి నూనె అద్దాలి.
అవును. కేవలము నూనేను పైపూతలా పూర్తిగా రాయాలన్న మాట!
ఈలోపల కన్వెన్షన్ ఒవేన్ ని 400 డిగ్రీ లో ముందుగా వేడి చేసి సిద్ధం చేసుకోవాలి.
ఈ నూనె అద్దిన సమోసాలను ఒవేన్ లో పెట్టి పది నిముషాల తరువాత బయటకు తీసి తిప్పి మళ్ళీ ఒవేన్ లో 10 నిముషాలు పెట్టుకోవాలి.
పది నిముషాల తరువాత అంటే 20 నిముషాలు మొత్తానికి బయటకి తీసి, చక్కట్టి ఖర్జురాలతో చేసిన పచ్చడి తోనో , పుదీనా పచ్చడితోనో, వడ్డిస్తే వానకు జోడు మంచి పుస్తకము, ఈ సమోసా చాయి తో వానను మనం ఎంజాయ్ చెయ్యవచ్చు.
అలాగా ఈ వానను, చలినీ కొట్టే కుట్రను మీతో పంచు కుంటున్నాను. మీరు ప్రయత్నించి చెప్పండి ఎలా వచ్చాయో.