కాకరకాయ అంటే కేవున కేక వేసి కనపడకుండా మయామయ్యేవారము మా చిన్నప్పుడు.
నేను చిన్నతనములో కాకరంటే కళ్ళు తేలేసి, కొంకర్లుపోయి, తినకుండా కనుమరుగయ్యేదాని.
అమ్మ సన్నగా తరిగి కమ్మగా, దోరగా వేయ్యించి పంచదార చల్లినా వద్దంటే వద్దని గొడవ చెయ్యటము మా జన్మహక్కుగా వుండేది కుర్రతనమున.
కాని ఒకసారి ఇది తిన్నాను.
నా కాలేజిలో నేస్తాలు పెట్టారు. పేరు తెలియని కూర కమ్ పులుసను, తిన్నాను కడుపార,తరువాత కనుకున్నాను కాకరిదని, ఇంత కమ్మగా చెయ్యవచ్చని.
ఇది కాకర పులుసుకూర.
ఈ కాకరకాయ పులుసు కమ్మదనపు రుచి చూస్తే మాత్రం కాదనరు… కోరి కోరి తింటారు
కావాలని అంటారు…
కాకికి కూడా చోటివ్వరూ. అంతా మీకావాలంటారు. కాకర కూరంతా మీదేనంటారు. అంత కమ్మగుంటుంది. నిజం. ప్రయత్నించి చూడండి.
కాదంటే మళ్ళీ రెసిపీ చదివి మళ్ళీ ప్రయత్నించండి.
ఇది చెపాతీలకు బావుంటుంది.
అన్నములోకి బావుంటుంది.
కూరకు కావలసిన పదార్థములు:
చిన్న కాకర కాయలు 6
1 వుల్లిపాయ
2 పచ్చిమిర్చి.
3 చెంచాల మినపప్పు
4 చెంచాల నువ్వులు
4 చెంచాల ధనియాలు
కరియేపాకు రెమ్మ
తిరగమాత దినుసులు
బెల్లం
చింతపండు కొద్దిగా
చిటికెడు పసుపు
వుప్పు తగినంత
నూనె 2 చెంచాలు.
ముందుగా చింతపండు నానబెట్టాలి. వేడి నీరుతో నానబెడితే త్వరగా నానుతుంది.
ఇలాగైతే కూర చెయ్యాలనుకున్నప్పుడు నానబెడితె మీరు వాడే సమయానికి సిద్దంగా వుంటుంది. లేకపోతే ఒక గంటకు ముందు నానెయ్యాలి మరి.
మినపప్పు, నువ్వులు, ధనియాలి
డ్రైగా వేయించాలి.
ఈ వేయ్యించిన గింజలను మెత్తని పొడి చేసుకోవాలి. ఇది కాకర లోకి ఫిల్లింగన్నమాట!
కాకరకాయలను కడగాలి వుప్పు నీటిలో. నేను కాయలకు చెక్కు తీసివేస్తా. కొందరు వుంచుతారు. వారి వారి అభిరుచి పట్టి ఆ విషయమనుకోండి.
కాకర లేత కాయలు బావుంటాయి.
చిన్నవి, లేతవి తెచ్చుకోండి బజారు నుంచి.
ముదురువి బాగా లావుగా వుంటాయి. చేదు కూడా ఎక్కువగా వుంటుంది.
సరే విషయానికి వస్తే కాకర కాయలు తొక్కు తీసి నీలువుగా చీరాలి. అంటే మనము మిరపకాయ బజ్జీలకు చీరినట్లుగా.
వాటిలో గింజలు ముదురుగా వుంటే తీసివెయ్యండి.
లేతవైతే వుంచవచ్చు.
ఆ కాకరకాయలను నీళ్ళలలో వేసి,
పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టండి.
ఉడికిన కాకరను తీసి ప్రక్కన వుంచుకోవాలి.
వుల్లిపాయను సన్నగా తరుగుకోవాలి. పచ్చి మిర్చి కూడా ముక్కలుగా తరగాలి.
బాండిలో 2 చెంచాల నూనె వేసి వేడి చెయ్యాలి.
తిరగమాత దినుసులు వేసి, ఇంగువ వేసుకొని వేగాక వుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరియేపాకు వేసి వేయ్యించాలి.
వుల్లిపాయ వేగాక చింతపండు రసం పోయ్యాలి.
అందులో వుప్పు, బెల్లం కూడా వేసుకోవాలి.
సిద్దం చేసిన పొడిని వుడికిన కాకర కాయలలో కూరాలి.
ఈ కాకరకాయలను వుడుకుతున్న చింతపండు రసంలో వేసుకోవాలి.
మసాలా మిగిలితే ఇందులో కలిపి మూతపెట్టాలి. సన్నని సెగ మీద పది నిముషాలు వుంచితే కాకరకాయలు ఈ రసం లో బాగా నాని వుంటాయి. అప్పుడు పొయ్యి మీద్నుంచి దింపి, వేడి అన్నముతో నెయ్యితో ఈ కూరను వడ్డించండి.
పులుసులో నానిన కాకరకాయలు కరిగిపోతాయి అలా అలా!!
ఆహ! ఏమి రుచి అని అనకమానరు…
కాకారకాయ కావాలంటారు మళ్ళీ మళ్ళీ…
కాదన్నవి కావాలంటంలోనే వుంది కదా మజా అంతా!!
కాకరకు లేదిక తంటా!
ఇలా తినిపించెయ్యవచ్చు పిల్లలకంటా!!
అమ్మల కష్టం తీరిందంట!!!